Supreme Court: కామెడీ పేరుతో దివ్యాంగుల మనోభావాలు దెబ్బతీస్తారా.. స్టాండప్ కమెడియన్లపై సుప్రీం ఆగ్రహం..
ABN , Publish Date - Aug 25 , 2025 | 12:32 PM
సామాజిక మాధ్యమాల ద్వారా స్టాండప్ కామెడీ పేరుతో దివ్యాంగుల సహా పలువురు వ్యక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవరిస్తున్న స్టాండప్ కమెడియన్లపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఇలాంటి వ్యాఖ్యలను కట్టడి చేసేలా తగిన మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
ఢిల్లీ: స్టాండప్ కామెడీ పేరుతో దివ్యాంగుల మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్యలు చేయడం పట్ల సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దివ్యాంగుల సహా పలువురు వ్యక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవరిస్తున్న స్టాండప్ కమెడియన్లపై సీరియస్ అయింది. ఇన్‌ఫ్లుయెన్సర్లు ఇలా మర్యాదలేని జోకులు వేసే కమెడియన్లు సోషల్ మీడియా వేదికలపై క్షమాపణలు చెప్పాలని.. అంతేగాకుండా భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించాలని అత్యున్నత న్యాయస్థానం కేంద్రాన్ని ఆదేశించింది.
వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా వికలాంగులు, మహిళలు, చిన్నారులు, వృద్ధులను అవమానించే వారిపై తగిన చర్యలు తీసుకునే దిశగా నిర్ణయం వెలువరించింది. ట్రోలింగ్ చేస్తూ వేధింపులకు పాల్పడుతున్న వారిని కట్టడి చేసేందుకు మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఎస్‌ఎంఏ క్యూర్ ఫౌండేషన్ పిటిషన్ విచారణ సందర్భంగా ఈ తీర్పు వెలువరించింది. ప్రముఖ స్టాండప్ కమెడియన్లు సమయ్ రైనా, విపున్ గోయల్, ట్యూబర్ రణ్‌వీర్ అల్హాబాదియా (Ranveer Allahbadia) లాంటి వారు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను నిరసిస వ్యక్తం చేస్తూ ఈ పిటిషన్ దాఖలైంది.
విచారణ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ, హాస్యం జీవితంలో భాగమే అయినా, అది ఇతరులపై ఎగతాళి చేయడానికి ఉపయోగిస్తే అది అనవసరం. సమాజంలో దివ్యాంగులు, మహిళలు, చిన్నారులు, వృద్ధులు లాంటి విభిన్న వర్గాల మనోభావాలను గౌరవించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈరోజు టార్గెట్ దివ్యాంగులు అయితే, రేపు ఇతర వర్గాలు కావొచ్చు. ఇది ఎక్కడ ఆగుతుంది? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. హక్కులు, బాధ్యతల మధ్య సమతుల్యత అవసరమని జస్టిస్ జెేకే మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా రైనా తరఫు న్యాయవాది మేము బేషరతుగా క్షమాపణలు చెప్పాం. గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతివాదులంతా హాజరయ్యారు అని సుప్రీం ధర్మాసనానికి తెలిపారు. అయితే, సుప్రీం కేవలం ఈ ఒక్క కేసునే పరిగణనలోకి తీసుకోకుండా, ఇటువంటి ఘటనలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం నిబంధనలు రూపొందించడం తప్పనిసరి అని తేల్చి చెప్పింది. అంతేకాదు, ఈ వ్యాఖ్యలు చేసిన వారు తమ యూట్యూబ్ ఛానళ్లలోనూ క్షమాపణలు తెలియజేయాలని కోర్టు ఆదేశించింది. అలాగే, ఇలాంటి భవిష్యత్తు వ్యవహారాలపై జరిమానాలు విధించే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఇవీ చదవండి..
ఢిల్లీ సీఎం హత్యకు ప్లాన్.. చివరి క్షణంలో అలా.. విచారణలో షాకింగ్ నిజాలు..
నటి వేధింపుల ఆరోపణలు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే 6 నెలలు సస్పెండ్..
For More National News