Delhi CM: ఢిల్లీ సీఎం హత్యకు ప్లాన్.. చివరి క్షణంలో అలా.. విచారణలో షాకింగ్ నిజాలు..
ABN , Publish Date - Aug 25 , 2025 | 11:01 AM
ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై ఓ దుండగుడు అనూహ్యంగా దాడికి పాల్పడటం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసింది. ఈ దాడికి సంబంధించిన కీలక వివరాలను నిందితుడు పోలీసుల విచారణలో వెల్లడించాడు. వాస్తవానికి ముఖ్యమంత్రిని కత్తితో పొడవడానికి కుట్ర పన్నినప్పటికీ చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకున్నట్లు వెల్లడించాడు. దాడి చేయాలనుకోవడానికి కారణం..
ఢిల్లీ: గతవారం ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా (Delhi CM Rekha Gupta)పై ఓ దుండగుడు దాడికి పాల్పడటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ కేసులో పోలీసులు ప్రధాన నిందితుడి నుంచి కీలక విషయాలు రాబట్టారు. వాస్తవానికి ఘటన జరిగిన రోజున నిందితుడు కత్తితో దాడి చేయాలని ప్రణాళిక రచించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సకారియా రాజేశ్‌భాయ్ ఖిమ్జీభాయ్ (41)ను అరెస్ట్ చేశారు. విచారణలో అతడు సంచలన విషయాలను బయటపెట్టాడు.
నిందితుడు సకారియా పోలీసుల విచారణలో సీఎంపై దాడికి గల కారణాన్ని వెల్లడించాడు. తమ ప్రదేశంలో వీధి కుక్కల సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు చాలా సార్లు ప్రయత్నించినప్పటికీ.. సరైన స్పందన లేకపోవడంతో అసహనం కలిగి దాడి చేయాలని నిశ్చయించుకున్నట్లు చెప్పాడు. ఘటన రోజు కత్తితో పొడిచి చంపాలని ప్లాన్ చేసుకుని బయల్దేరాడు. కానీ, నిందితుడు సీఎం అధికారిక నివాసానికి చేరుకోక ముందు సుప్రీంకోర్టు వద్దకు వెళ్లాడు. అక్కడ భారీ భద్రతా వ్యవస్థను గమనించి తన దాడి ప్రణాళికను విరమించుకున్నానని పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది.
మరో వ్యక్తి అరెస్ట్
సీఎంపై దాడి కేసుకు సంబంధించి గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన తహసీన్ సయ్యద్ అనే వ్యక్తిని రెండవ నిందితుడిగా పోలీసులు గుర్తించారు. అతడు ప్రధాన నిందితుడు సకారియాకు స్నేహితుడు. ఘటన జరిగిన రోజు తహసీన్ ప్రధాన నిందితుడితో నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాదు.. ఆర్థికంగా సహాయం చేసినట్లు సమాచారం. తహసీన్ మొబైల్ ఫోన్ నంబర్ కాల్ వివరాలు, ఐపీడీఆ, యూపీఐ ద్వారా జరిగే లావాదేవీల ఆధారంగా పోలీసులు నిందితుడి పాత్రను కనుగొన్నారు.
ఆగస్టు 20న సివిల్ లైన్స్‌లోని సీఎం కార్యాలయం వద్ద సీఎం రేఖా గుప్తా ‘జన్ సున్వాయ్’’ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముసుగులో వచ్చిన ఓ దుండగుడు హఠాత్తుగా సీఎంపై దాడికి యత్నించాడు. ఫిర్యాదుదారుడిలా పత్రాలను చేతికందిస్తూ.. కేకలు వేస్తూ ముఖ్యమంత్రిని చెంపదెబ్బ కట్టాడు. రెప్పపాటులోనే ఆమెను వెనక్కు తోసి జుట్టు గట్టిగా పట్టుకుని లాగాడు. వెంటనే భద్రతా సిబ్బంది అతడ్ని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో సీఎం తల, చెయ్యి, భుజానికి స్వల్ప గాయాలయ్యాయి.
కాగా, దాడి నేపథ్యంలో ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు ఇటీవలే జడ్ కేటగిరీ భద్రత (CRPF సిబ్బంది సహా) కల్పించింది కేంద్ర ప్రభుత్వం. అయితే, తాజాగా ఆ భద్రతను ఉపసంహరించింది. మునుపటి తరహాలో ఢిల్లీ పోలీసులే సీఎం భద్రతా వ్యవహారాలు పర్యవేక్షిస్తారని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
ఇవీ చదవండి..
ఢిల్లీలో కుండపోత వర్షం.. ట్రాఫిక్ ఇబ్బందులు, విమానాల ఆలస్యం
భర్తకు ప్రాణం పోద్దామనుకుంది.. పాపం తను కూడా..
For More National News