Aruna: ఫోనే కీలకం.. వారిలో మొదలైన అలజడి..!
ABN , Publish Date - Aug 25 , 2025 | 09:53 AM
లేడీ డాన్ అరుణ నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లు ద్వారా మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఆ దిశగా పోలీసులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
నెల్లూరు, ఆగస్టు 25: జిల్లాకు చెందిన లేడీ డాన్ అరుణ నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లు ద్వారా మరింత గట్టు రట్టయ్యే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఆమె ఫోన్లలో కొంత మంది ప్రభుత్వాధికారులు, ప్రజాప్రతినిధుల ఆడియో, వీడియో రికార్డులతోపాటు వందల కొద్ది ఫొటోలు ఉండి ఉంటాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో నెల్లూరు జిల్లాలో విధులు నిర్వహించిన ఐపీఎస్ అధికారితో ఉన్న ఫొటోలు, వీడియోలు ఆ ఫోన్‌లోనే ఉన్నట్లు వారు సందేహం వ్యక్తం చేస్తున్నారు. కస్టడీకి తీసుకున్నప్పుడు ఆమెతోనే ఈ ఫోన్లను తెరిపించి.. వాటిలోని సమాచారాన్ని వెలికి తీయాలని పోలీసులు భావిస్తున్నారు. అందుకు కోర్టు అనుమతి తీసుకుని.. వాటిని ఆమె సమక్షంలోనే తెరిపించాలని పోలీసులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఆమెతో సన్నిహిత సంబంధాలు కొనసాగించిన వారిలో అలజడి ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఎవరి గుట్టు ఎప్పుడు బయట పడుతుందనే టెన్షన్‌లో వారంతా ఉన్నట్లు ఒక చర్చ అయితే సాగుతోంది.
అదీకాక.. అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉన్నత స్థాయి వ్యక్తులతో ఫోన్లలో మాట్లాడినప్పుడు.. వారి వాయిస్ రికార్డు చేయడంతోపాటు వారితో సన్నిహితంగా ఉన్నప్పుడు ఫొటోలు, వీడియోలు తీసుకోవడం ఆమెకు అలవాటని అరుణ సన్నిహితులు చెబుతున్నారు. అయితే గతంలో ఇలా తీసిన వీడియో, ఆడియోల ద్వారా పలువురిపై ఉన్నతాధికారులకు ఆమె ఫిర్యాదు చేసినట్లు మరో చర్చ సైతం ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.
అంతేకాకుండా.. అరుణకు వెన్నుదన్నుగా నిలిచిందెవరు? ఆమె ఎవరెవర్ని బెదిరించింది? తదితర అంశాల గుట్టు తేల్చేందుకు పోలీసులు ఇప్పటికే రంగంలోకి దిగారు. ఆ క్రమంలో గత రెండేళ్లకు సంబంధించిన ఆమె కాల్ డీటెయిల్స్ ను తెప్పించి విశ్లేషించారు. అందులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన ఒక ప్రముఖుడితో ఆమె తరచుగా సంభాషణలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. అతడి కారణంగానే శ్రీకాంత్ జైలు నుంచి పేరోల్‌పై విడుదలైనట్లు పోలీసులు కనుగొన్నారు.
మరోవైపు అరుణ అరెస్ట్ కావడంతో.. ఆమె చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఆమె వల్ల బాధితులుగా మారిన వారంతా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఆ క్రమంలో అరుణపై నెల్లూరు జిల్లాలోని కోవూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది.
అరుణ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండడంతో.. కారు డిక్కీలో దాక్కుని పారిపోతున్న ఆమెను అద్దంకి వద్ద పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆమెను కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి 14 రోజులపాటు రిమాండ్ విధించిన విషయం విదితమే.
ఈ వార్తలు కూడా చదవండి..
గాజాలో ఆగని ఆకలి చావులు.. 290 మంది మృతి
ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి
For More AP News And Telugu News