Share News

Bihar : ప్రెగ్నెంట్ చేస్తే రూ.10 లక్షలు.. ఆలిండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్..

ABN , Publish Date - Jan 13 , 2025 | 03:06 PM

పిల్లలు లేని మహిళలను గర్భవతులను చేయండి. పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించుకోండి. ఇదే ఆలిండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్ స్కెచ్. సోషల్ మీడియాలో ఈ పేరిట ప్రకటనలు చేస్తూ కొత్త తరహా మోసాలకు తెరలేపింది బీహార్ గ్యాంగ్..

Bihar : ప్రెగ్నెంట్ చేస్తే రూ.10 లక్షలు.. ఆలిండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్..
All India Pregnant Job Service Scam Bihar Police Arrests Three Accused People

సంతానం లేని మహిళలను గర్భవతులను చేయండి. పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించుకోండి అంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రకటనలు చేస్తోంది ఓ ముఠా. 'ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ (బేబీ బర్త్ సర్వీస్)', 'ప్లేబాయ్ సర్వీస్' ప్రోగ్రామ్‌ల ముసుగులో కొత్త తరహా మోసానికి పాల్పడుతోంది. ఫోన్ కాల్స్ ద్వారా మాయమాటలు చెప్పి కస్టమర్లను ఆకర్షిస్తూ భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న ఈ ప్రకటనలు నిజమని నమ్మి నట్టేట మునిగారు. ఈ తరహా మోసాలపై స్థానికుల నుంచి ఫిర్యాదులు పెరగడంతో దర్యాప్తు చేపట్టిన బీహార్ పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. డిజిటల్ అరెస్ట్, హనీట్రాప్ తరహాలో సైబర్ నేరగాళ్లు మొదలుపెట్టిన ఈ కొత్త స్కామ్.. నవడా జిల్లాలోని కహువరా గ్రామంలో వెలుగులోకొచ్చింది.


'ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ (బేబీ బర్త్ సర్వీస్)', 'ప్లేబాయ్ సర్వీస్' పేరిట కొందరు మోసగాళ్లు ఫేస్‌బుక్‌, ఇతర సోషల్ మీడియాల ద్వారా ఓ ముఠా సభ్యులు పలువురికి వల వేస్తున్నారు. ఫోన్ కాల్స్ ద్వారా పిల్లలు లేని స్త్రీలను గర్భవతిని చేస్తే రూ.10 లక్షలు ఇస్తామని, విఫలమైనా డబ్బులు చెల్లిస్తామని హామీలు గుప్పిస్తున్నారు. ప్రజలను మభ్యపెట్టి భారీగా డబ్బులు దండుకుంటున్నారు. ఈ తరహా మోసాలపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో బీహార్ పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. స్కామ్‌ను ఛేదించి ముఠాకు చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అయిన ముఠా సభ్యులు ప్రిన్స్ రాజ్, భోలా కుమార్, రాహుల్ కుమార్‌లు నవడా జిల్లాకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోసగాళ్లు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా వివిధ రాష్ట్రాల ప్రజలకు కనెక్ట్ అవుతున్నారు. బిడ్డలు లేని స్త్రీలను గర్భవతి చేయడమే మీ పని అని చెప్తారు. విజయవంతమైతే రూ.10లక్షలు, విఫలమైనా రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకూ చెల్లిస్తామని తప్పుడు హామీ ఇస్తారు. ఆసక్తి కనబరిచిన వారి నుంచి ముందుగా పాన్‌ కార్డ్‌, ఆధార్‌ కార్డ్‌, సెల్ఫీ, ఇతర వ్యక్తిగత వివరాలు సేకరిస్తారు. తర్వాత హోటల్ గదులు, రిజిస్ట్రేషన్ ఫీజుల పేరిట ఆన్‌లైన్‌లో రూ.500- రూ.20,000 వరకు కట్టాలని ఈ ముఠా డిమాండ్ చేస్తుంది. ఎవరైనా ఇచ్చేందుకు ఒప్పుకోకపోతే మీ విషయం బయటపెడతామని వారిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బు వసూలు చేస్తారు. ఈ రకంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పలువురి నుంచి భారీ మొత్తంలో ఈ ముఠా డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.


అరెస్టయిన నిందితుల నుంచి ఆరు స్మార్ట్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులోని కాల్ లాగ్‌లు, వాట్సాప్ ఛాటింగ్, కస్టమర్ల ఫోటోలు, ఆడియో రికార్డింగ్‌లు, బ్యాంక్ లావాదేవీల ఆధారంగా నిందితుల నుంచి కొంతవరకూ సమాచారం రాబట్టామని పోలీసు అధికారి వెల్లడించారు. మొత్తం ముఠా నెట్‌వర్క్‌ను మ్యాపింగ్ చేయడం ప్రారంభించామని పేర్కొన్నారు.

Updated Date - Jan 13 , 2025 | 03:06 PM