Share News

Siddaramaiah: కాబోయే సీఎం ఆయనే.. బాంబు పేల్చిన సిద్ధరామయ్య తనయుడు

ABN , Publish Date - Oct 22 , 2025 | 07:47 PM

కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ మార్పులు జరుగనున్నాయని, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ ముఖ్యమంత్రి పగ్గాలు చేపడతారంటూ కొద్దికాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సిద్ధరామయ్య ప్రభుత్వం వచ్చే నవంబర్‌లో రెండున్నరేళ్లు పాలన పూర్తి చేసుకోనుంది.

Siddaramaiah: కాబోయే సీఎం ఆయనే.. బాంబు పేల్చిన సిద్ధరామయ్య తనయుడు
Siddaramaiah son Yathindra

బెళగావి: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) కుమారుడు యతీంద్ర (Yathindra) బుధవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి రాజకీయ కెరీర్ చివరి దశలో ఉందని తెలిపారు. పార్టీ నేత, కేబినెట్ మంత్రి సతీష్ జార్కిహోళి (Satish Jarkhiholi)కి మార్గదర్శిగా తన తండ్రి ఉంటారని చెప్పారు. దీంతో కర్ణాటక కాంగ్రెస్‌ను నడిపేందుకు సీఎంగా జార్కిహోళి సమర్థడంటూ పరోక్షంగా ఆయనే సంకేతాలిచ్చినట్టు అయింది.


కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ మార్పులు జరుగనున్నాయని, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ ముఖ్యమంత్రి పగ్గాలు చేపడతారంటూ కొద్దికాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సిద్ధరామయ్య ప్రభుత్వం వచ్చే నవంబర్‌లో రెండున్నరేళ్లు పాలన పూర్తి చేసుకోనుంది. తక్కిన రెండున్నరేళ్ల పాలన డీకే శివకుమార్‌‌కు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే సిద్ధరామయ్య మాత్రం తాను పూర్తి కాలం ముఖ్యమంత్రినంటూ ఈ ఊహాగానాలు కొట్టివేస్తున్నారు.


యతీంద్ర ఏమన్నారు?

బెళగావి జిల్లా రాయ్‌బాయ్ తాలూకా కప్పలగుడ్డి గ్రామంలో సెయింట్ కనకదాస్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో యతీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన తండ్రి రాజకీయ ప్రస్థానం చివరిదశలో ఉందని, ఆయన తర్వాత ప్రగతిశీల, ముందుచూపు కలిగిన నేతల అవసరం ఉందని అన్నారు. ఈ బాధ్యతలు చేపట్టగల సమర్థత సతీష్ జార్కిహోళికి ఉందని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని నడిపేంచేందుకు ఆయన తగిన వ్యక్తి అని అన్నారు.


కాంగ్రెస్‌లో అలజడి

యతీంద్ర వ్యాఖ్యలతో కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలకు దారితీసే అవకాశాలపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. పార్టీ అధిష్ఠానం వచ్చే నెలలో సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని కోరితే అంత తేలిగ్గా సీఎం పదవిని డీకే వదులుకోకపోవచ్చు. సిద్ధరామయ్య వర్గీయులు సతీష్ జార్కిహోళిని ఆయన వారసుడిగా తెరపైకి తెస్తే డీకే వైపు నుంచి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తవచ్చు. కాగా, యతీంద్ర వ్యాఖ్యలపై ఇటు సిద్ధరామయ్య కానీ, అటు పార్టీ అధినాయకత్వం కానీ ఇంకా స్పందించలేదు.


ఇవి కూడా చదవండి..

పొలిటికల్ ఇస్లామ్‌తో యమ డేంజర్.. యోగి ఆదిత్యనాథ్ హెచ్చరిక

అయ్యప్ప సేవలో ద్రౌపది ముర్ము.. శబరిమలను దర్శించుకున్న తొలి రాష్ట్రపతి

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 22 , 2025 | 09:12 PM