Share News

Operation Sindoor 2025: ఆపరేషన్ సింధూర్.. టార్గెట్ల ఎంపిక వెనక దాగి ఉన్న రహస్యాలు..

ABN , Publish Date - May 07 , 2025 | 08:51 PM

Operation Sindoor 2025: పహల్గాం ఉగ్రదాడికి ఏ క్షణానైనా భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందని అందరూ ఎదురుచూస్తున్న తరుణంలో బుధవారం తెల్లవారుజామున పాకిస్థాన్, పీవోకేలలో ఉగ్రవాద స్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడ్డాయి భారత త్రివిధ దళాలు. ఇంతకీ, ఇంత కచ్చితంగా భారత ఆర్మీ టార్గెట్లను ఎలా ఎంపిక చేసింది. అనుకున్న ప్లాన్ ఎలా అమల్లో పెట్టింది.

Operation Sindoor 2025: ఆపరేషన్ సింధూర్.. టార్గెట్ల ఎంపిక వెనక దాగి ఉన్న రహస్యాలు..
Operation Sindoor Action Plan

Operation Sindoor details And Target Locations: పహల్గాంలో పైశాచిక ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్ దేశంలో పురుడు పోసుకుని వేళ్లూనుకున్న ఉగ్రవాద సంస్థలను కూకటివేళ్లతో సహా పెకిలించేందుకు భారత్ కంకణం కట్టుకుంది. అదును చూసి బుధవారం తెల్లవారుజామున 1.15 నుంచి 1.30 గంటల మధ్య భారత సైన్యం 'ఆపరేషన్ సింధూర్'(Operation Sindoor) నిర్వహించింది. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లోని తొమ్మిది కీలక ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత త్రివిధ దళాలు క్షిపణులతో విరుచుకుపడ్డాయి. అత్యంత కచ్చితత్వం, పక్కా ప్రణాళికతో పౌరులకు హాని కలగకుండా 9 ఉగ్ర స్థావరాలను భారత సాయుధ దళాలు ఎలా మట్టుబెట్టగలిగాయి? ఆపరేషన్ కోసం ఎలా సంసిద్ధమయ్యాయి?


బుధవారం భారత సాయుధ దళాలు తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను మిస్సైల్స్ తో నేలమట్టం చేశాయి. వీటిలో ముజఫరాబాద్‌లోని సవాయి నాలా క్యాంప్, సయ్యద్నా బెలాల్ క్యాంప్, గుల్పూర్ క్యాంప్, అబ్బాస్ క్యాంప్, బర్నాలా క్యాంప్, సర్జల్ క్యాంప్, మెహమూనా జోయా క్యాంప్, మర్కజ్ తైబా, బహవల్‌పూర్‌లోని మర్కజ్ సుభాన్ ఉన్నాయి. ఈ దాడిలో 80 వరకూ ఉగ్రవాదులు మరణించినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 22న పహల్గాంలో 26 మంది అమాయక పర్యాటకులను అన్యాయంగా ఉగ్రవాదులు కాల్చిచంపినందుకు ప్రతీకారంగా భారత ప్రభుత్వం ఈ ఆపరేషన్ చేపట్టింది. భార్యల ముందే భర్తలను కిరాకతంగా హతమార్చి వారిని పసుపు కుంకుమలకు దూరం చేసినందుకు గానూ.. ఈ దాడికి 'ఆపరేషన్ సిందూర్' అనే పేరు పెట్టారు.


ఆపరేషన్ సిందూర్ లక్ష్యమేంటి?

పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిక్షణా శిబిరాల కూల్చివేతే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్ ప్రారంభించారు. ఎందుకంటే, పాక్ దశాబ్దాలుగా ఉగ్రవాదుల కర్మాగారంగా పనిచేస్తోంది. తన భూభాగం, పీఓకె పాక్ ఆర్మీ సహకారంతో ఉగ్రవాదులు అధునాతన మౌలిక సదుపాయాలతో శిబిరాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ నెట్‌వర్క్‌లో రిక్రూట్‌మెంట్, బోధనా కేంద్రాలు, ఆయుధ శిక్షణా సౌకర్యాలు, లాంచ్ ప్యాడ్‌లు, కార్యాచరణ స్థావరాలు ఉన్నాయి. వీటన్నింటి సాయంతోనే ఉగ్రవాదులు భారత భూభాగంలోకి చొరబడుతున్నారు. భారత సైన్యం ప్రకారం, ఈ వ్యవస్థ ఉగ్రవాదుల సంఖ్య పెరిగేందుకు తోడ్పడుతుంది. పుల్వామా, 2008 ముంబై ఉగ్రవాద దాడులలో పాల్గొన్న ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చిన ఎల్‌ఈటీ, జేఈఎం శిక్షణ కేంద్రాలూ 'ఆపరేషన్ సింధూర్'(Operation Sindoor)లో ధ్వంసమయ్యాయి. నిరంతరం అభివృద్ధి చెందుతున్న ఈ స్థావరాలను మట్టుబెట్టడం ఉగ్రవాద సంస్థలు కోలుకోలేని దెబ్బే.


టార్గెట్లను ఎలా ఎంచుకున్నారు?

నిఘా వర్గాల విశ్వసనీయమైన సమాచారం ఆధారంగా ఆపరేషన్ సిందూర్ లక్ష్యాల ఎంపిక జరిగిందని రక్షణ అధికారులు తెలిపారు. భారతదేశానికి వ్యతిరేకంగా గతంలో, ప్రణాళికాబద్ధంగా ఉగ్రవాద కార్యకలాపాలలో పాలుపంచుకున్న నిర్దిష్ట శిబిరాలను పక్కా సమాచారంతో గుర్తించారు. టార్గెట్ చేసిన ప్రతి శిబిరం నిర్దిష్ట దాడులతో ముడిపడి ఉన్నవే కావడం గమనార్హం. లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద గ్రూపుల కేడర్లకు శిక్షణ ఇవ్వడానికి ప్రసిద్ధి చెందిన వాటినే ఎంపిక చేసుకున్నారు. పాకిస్థాన్ లోని పౌరులు మా లక్ష్యం కాదు. ఉగ్రవాదులు మాత్రమే అని చాటేలా ఈ 'ఆపరేషన్ సింధూర్' విజయవంతంగా నిర్వహించారు. భారత సాయుధ దళాలు పౌరులు, పాక్ ఆర్మీకి సంబంధం లేకుండా కేవలం ఉగ్రవాదుల శిబిరాలనే టార్గెట్ చేసి మట్టుబెట్టడంపై ప్రపంచదేశాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.


Read Also: Operation Sindoor:మరోసారి బయటపడ్డ పాక్ అసలు రంగు.. ఉగ్రవాది అంత్యక్రియలకు ఆర్మీ అధికారులు హాజరు..

Pakistan Shelling Attack: రివేంజ్ స్టార్ట్..కశ్మీర్‌లో పాక్ కాల్పులు..15 మంది పౌరుల మృతి, 43 మందికి గాయాలు..

Operation Sindoor: పాక్ ప్రతిదాడి చేయెచ్చు, అప్రమత్తంగా ఉండాలి: రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ థిల్లాన్

Updated Date - May 07 , 2025 | 09:09 PM