Karnataka: కర్ణాటకలో కామరాజ్ ప్లాన్.. కాంగ్రెస్ కసరత్తు..
ABN , Publish Date - Oct 22 , 2025 | 08:37 PM
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో రెండున్నరేళ్ల పాలన పూర్తి చేసుకోనుండటం, రొటేషనల్ పద్ధతిలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు పదోన్నత కల్పించనున్నారనే ఊహాగానాల నేపథ్యంలో మంత్రివర్గ పునర్వస్థీకరణ చోటుచేసుకోనుంది.
బెంగళూరు: కర్ణాటకలో కీలక మార్పులు, చేర్పులు (Major reshuffle) చేపట్టేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం సిద్ధమవుతోంది. ఇందుకోసం కామరాజ్ ప్లాన్ (Kamaraj Plan)ను అమలు చేసే యోచనలో ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం. ఆ ప్రకారం పనితీరు, అవినీతి ఆరోపణల ఆధారంగా పలువురు సీనియన్ నేతలకు రాష్ట్ర మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలకనుంది. ఈ ఏడాది చివర్లో చేపట్టే ఈ మార్పులు, చేర్పుల్లో సుమారు డజను మంది సీనియర్ మంత్రులను తప్పించి, వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పిస్తారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో రెండున్నరేళ్ల పాలన పూర్తి చేసుకోనుండటం, రొటేషనల్ పద్ధతిలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు పదోన్నత కల్పించనున్నారనే ఊహాగానాల నేపథ్యంలో మంత్రివర్గ పునర్వస్థీకరణ చోటుచేసుకోనుంది. కామరాజ్ ప్లాన్‌ను కర్ణాటకలో అమలు చేస్తే డీకే సైతం ప్రస్తుతం ఉన్న రెండు పదవుల్లో ఒక దానికే పరిమితం కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆయన ఉపముఖ్యమంత్రి పదవితోపాటు పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఉన్నారు.
ఏమిటీ కామరాజ్ ప్లాన్?
ప్రముఖ రాజకీయ నేత అయిన కుమారస్వామి కామరాజ్ (1903-1975) స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనడంతోపాటు అప్పటి మద్రాస్ స్టేట్ (ప్రస్తుతం తమిళనాడు)కు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడుగానూ ఉన్నారు. భారత రాజకీయాల్లో 'కింగ్‌మేకర్'గా ఆయన పేరు తెచ్చుకున్నారు. లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ ప్రధానమంత్రులు కావడంలో కీలకపాత్ర పోషించారు. 1963లో అప్పటి మద్రాస్ ముఖ్యమంత్రిగా ఉన్న కామరాజ్ ఆ తర్వాత ఐఎన్‌సీ(ఓ) అధ్యక్షుడయ్యారు. పార్టీ పునర్నిర్మాణం కోసం సీనియర్ నేతలు ప్రభుత్వ పదవుల నుంచి తప్పుకోవాలని కామరాజ్ ప్రతిపాదించారు. పార్టీ ఆర్గనైజేషన్‌ను అట్టడుగు స్థాయి నుంచి పటిష్టం చేయడం ఈ ప్లాన్ ముఖ్యోద్దేశం.
ఇవి కూడా చదవండి..
కాబోయే సీఎం ఆయనే.. బాంబు పేల్చిన సిద్ధరామయ్య తనయుడు
పొలిటికల్ ఇస్లామ్‌తో యమ డేంజర్.. యోగి ఆదిత్యనాథ్ హెచ్చరిక
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి