Case Against Rahul Gandhi: పాట్నాలో రాహుల్ గాంధీపై కేసు నమోదు..
ABN , Publish Date - Aug 29 , 2025 | 07:23 AM
దర్భంగా జిల్లాలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ తల్లిపై రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలు అసభ్యకరంగా ఉన్నాయని బీజేపీ నాయకుడు కృష్ణ సింగ్ కల్లు ఆరోపించారు. ప్రపంచంలో లేని వ్యక్తి గురించి దుర్భాషలు ఆడటం బాధాకరమన్నారు.
పాట్నా: పాట్నాలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేసు నమోదైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో రాహుల్ గాంధీపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు భారతీయ జనతా పార్టీ నాయకుడు కృష్ణ సింగ్ కల్లు తెలిపారు. ఎన్నికలు జరగనున్న రాష్ట్రంలో ఓట్ల దొంగతనం జరిగిందని ఆరోపిస్తూ.. ప్రతిపక్షాలు నిర్వహిస్తున్న ర్యాలీని ఆపాలని ఆయన పేర్కొన్నారు. లోక్‌సభలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ.. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలపై నిరంతరం అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
దర్భంగా జిల్లాలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ తల్లిపై రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలు అసభ్యకరంగా ఉన్నాయని బీజేపీ నాయకుడు కృష్ణ సింగ్ కల్లు ఆరోపించారు. ప్రపంచంలో లేని వ్యక్తి గురించి దుర్భాషలు ఆడటం బాధాకరమన్నారు. తమ తల్లిని దుర్భాషలాడితే.. ఎందుకు సహించాలని ప్రశ్నించారు. పాట్నాలోని గాంధీ మైదాన్ పోలీస్ స్టేషన్‌లో ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని తెలిపారు. బీహార్ ప్రజలు రాష్ట్రంలో ఇండియా బ్లాక్ ర్యాలీ జరగనివ్వరని ధీమా వ్యక్తం చేశారు. పాట్నాలో రాహుల్ గాంధీ కార్యక్రమం జరగడానికి తాము అనుమతించమని పేర్కొన్నారు. అంతకుముందు.. ప్రధాని మోదీ తల్లిపై రాహుల్ దుర్భాషలాడటంపై పలువురు ముఖ్యమంత్రులు ఇతర బీజేపీ నాయకులు కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.
రాహుల్ గాంధీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రమాణాలను తగ్గిస్తుందని బీజేపీ ఆరోపించింది. రాహుల్, తేజస్వి ఇద్దరూ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. అయితే.. బీజేపీ అనవసరమైన అంశాలను లేవనెత్తుతోందని కాంగ్రెస్ పేర్కొంది. ప్రధానమంత్రిపై రాహుల్ గాంధీ వాడిన భాషను తీవ్రంగా ఖండిస్తూ.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనపై విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీపై వాడిన భాషను ప్రజాస్వామ్యంపై మరకగా అభివర్ణిస్తూ.. గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ రాజకీయాలు అత్యల్ప స్థాయికి చేరుకున్నాయని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ రాజకీయాలు అట్టడుగు స్థాయికి చేరుకున్నాయని ఆరోపించారు. గత 11 సంవత్సరాలుగా ఒక పేద తల్లి కొడుకు ప్రధానమంత్రి కుర్చీలో కూర్చుని, ఆయన నాయకత్వంలో దేశాన్ని నిరంతరం ముందుకు తీసుకెళ్తున్న తీరును వారు సహించలేకపోతున్నారని మండిపడ్డారు. బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డా కూడా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ ఆయన తల్లిపై చేసిన దూషణలు అన్ని హద్దులను దాటాయని అన్నారు. రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, ముఖ్యమైన అంశాల నుంచి దృష్టి మరల్చడానికి బీజేపీ సంబంధం లేని అంశాలను లేవనెత్తుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
ఇవి కూడా చదవండి
బస్సు బీభత్సం.. ప్రమాదంలో ఆరుగురి మృతి, ఏడుగురికి గాయాలు
యువకుల అత్యుత్సాహం.. ప్రాణం మీదకు తెచ్చిన పందెం..