Actor Politician Vijay: టీవీకే సభలో అపశృతి.. దళపతి విజయ్‌పై కేసు నమోదు..
ABN , Publish Date - Aug 27 , 2025 | 11:36 AM
తమిళ స్టార్ హీరో కమ్ పొలిటీషియన్ దళపతి విజయ్‌పై అభిమాని కేసు ఫైల్ చేశాడు. మదురైలో జరిగిన తమిళిగ వెట్రి కళగం (టీవీకే) కార్యక్రమంలో తనపై విజయ్ బౌన్సర్లు దాడి చేశారని శరత్ కుమార్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
తమిళనాడు, మదురై: తమిళ సినీ హీరో, తమిళగ వెట్రి కళగం (TVK) వ్యవస్థాపకుడు విజయ్ తాజాగా ఒక వివాదంలో చిక్కుకున్నారు. మదురైలో ఇటీవల జరిగిన పార్టీ మహాసభల కార్యక్రమంలో జరిగిన దాడికి సంబంధించి విజయ్, అతడి భద్రతా బృందంపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఘటన రోజున తన అభిమాన హీరో విజయ్‌ను దగ్గర చూసేందుకు వెళ్లగా.. ఆయన బౌన్సర్లు తనపై దాడి చేశారంటూ శరత్ కుమార్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దళపతి విజయ్‌పై కేసు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది.
ఆగస్టు 21న తమిళనాడులోని మదురైలో జరిగిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) ర్యాలీకి వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. ఈ కార్యక్రమం సందర్భంగా విజయ్ వేదికపైకి వెళ్లి ర్యాంప్ పైకి ఎక్కిఅభివాదం చేస్తుండగా.. కొందరు అభిమానులు ఆయనకు అతి సమీపంగా వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే బౌన్సర్లు ర్యాంప్‌పైకి దూకుతూ విజయ్ మీదకు దూసుకెళ్తున్న వారికి అడ్డుగా నిలిచి పక్కకు తోసివేశారు. ఈ పరిస్థితి ఇంచుమించు తోపులాటకు దారితీసింది. ఆ సమయంలో శరత్ కుమార్ అభిమానిని ర్యాంప్ మీద నుంచి విజయ్ భద్రతా సిబ్బంది కిందకు తోసేశారు.
దీంతో విజయ్ బౌన్సర్లు తనపై దౌర్జన్యం చేశారంటూ శరత్‌కుమార్ పెరంబలూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయ్‌తో పాటు అతడి బౌన్సర్లపై కేసు నమోదు అయింది. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇప్పటికే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్ 2026లో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ టీవీకే (TVK) తరపున బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ సమావేశాలు నిర్వహిస్తూ పార్టీని బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెట్టారు. మదురైలో జరిగిన సభలో మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో TVK, DMK మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని విజయ్ స్పష్టం చేశారు. భాజపా రాష్ట్రంలో స్థిరపడలేదని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆంధ్రాలో చిరంజీవే పార్టీని విలీనం చేశారు...
ఐపీఎల్‌కు స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ గుడ్‌బై..
Read Latest National News