Samsung Laptops: భారత్‌లో శాంసంగ్ ల్యాప్‌ట్యాప్ తయారీ మొదలు.. ధరలు తగ్గే ఛాన్స్ ఉందా?
ABN , Publish Date - Aug 17 , 2025 | 09:02 PM
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ కీలక నిర్ణయం తీసుకుంది. మేక్ ఇన్ ఇండియా ప్రణాళికకు ఊతమిస్తూ ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ల్యాప్‌టాప్‌ల ఉత్పత్తి ప్రారంభించింది. ఈ చర్యతో భారత్‌లో శాంసంగ్ తయారీ విభాగంలో మరో కీలక మైలురాయిని చేరుకుంది.
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ ఇప్పుడు భారతదేశంలో ల్యాప్‌టాప్‌ల తయారీ ప్రారంభించింది. ఈ చర్యతో భారత్‌లో శాంసంగ్ తయారీ విభాగంలో మరో కీలక మైలురాయిని చేరుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఉన్న ఫ్యాక్టరీలో ఈ కొత్త ఉత్పత్తి ప్రారంభమైనట్టు సమాచారం. ఇప్పటికే ఈ ప్లాంట్‌లో స్మార్ట్‌ఫోన్లు, ఫీచర్ ఫోన్లు, వేర్‌బుల్స్, టాబ్లెట్లు లాంటి పరికరాలను శాంసంగ్ తయారు చేస్తోంది. ఇప్పుడు ల్యాప్‌టాప్‌లు కూడా ఆ జాబితాలో చేరడం విశేషం.
భారత మార్కెట్‌కి అనుగుణంగా నిర్ణయం
ఈ నిర్ణయం వెనుక శాంసంగ్‌కు రెండు ప్రధాన లక్ష్యాలున్నాయని సమాచారం. ఒకటి భారతీయ వినియోగదారుల అవసరాలను తీర్చడం, మరొకటి గ్లోబల్ ఎగుమతులకు భారత్‌ను తయారీ కేంద్రంగా అభివృద్ధి చేయడం. కంపెనీ తన తయారీ పోర్ట్‌ఫోలియోను విస్తరించేందుకు ఈ ముందడుగు వేసింది. ఇటీవల కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, శాంసంగ్ సౌత్‌వెస్ట్ ఆసియా ప్రెసిడెంట్ జెబీ పార్క్, వైస్ ప్రెసిడెంట్ ఎస్‌పీ చున్ లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, 'శాంసంగ్ దేశంలో అభివృద్ధి చెందిన పరికరాల తయారీలో భాగస్వామిగా నిలుస్తోంది. ఇది భారత్‌లోని స్థానిక ప్రతిభ, నైపుణ్యం, ఆవిష్కరణలపై ఆధారపడిన ముందడుగు' అని తెలిపారు.
నోయిడా ప్లాంట్‌కి మరింత ప్రాధాన్యం
1996లో స్థాపితమైన నోయిడా శాంసంగ్ ఫ్యాక్టరీ, భారత్‌లో మొదటి అంతర్జాతీయ ఎలక్ట్రానిక్స్ తయారీ ఫ్యాక్టరీల్లో ఒకటి. ఇప్పటివరకు ఇది భారీగా మొబైల్ ఫోన్ల ఉత్పత్తిలో కీలక పాత్ర పోషించగా.. ఇప్పుడు ల్యాప్‌టాప్‌ల తయారీ ప్రారంభంతో ఈ ప్లాంట్ ప్రాధాన్యం మరింత పెరిగింది.
ఈ సంవత్సరం ప్రారంభంలోనే శాంసంగ్ మొబైల్ ఎక్స్‌పీరియెన్స్ (MX) విభాగం ప్రెసిడెంట్ టీఎం రోహ్, ల్యాప్‌టాప్‌లను భారత్‌లో తయారు చేయాలనే యోచనతో ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పుడు అవి కార్యరూపం దాల్చాయి.
ఇవీ చదవండి:
రాబోయే జీఎస్టీ సంస్కరణలు ఇవేనా.. ప్రజలకు ఇక పండగే
భారతీయ కరెన్సీలో చెల్లింపుల దిశగా ఆర్‌బీఐ మరో కీలక నిర్ణయం