PM Modi Launches eVITARA: గ్లోబల్ EV గేమ్‌లోకి భారత్ ఎంట్రీ.. మోదీ చేతుల మీదుగా మారుతీ సుజుకీ ఈవీ ప్రారంభం..
ABN , Publish Date - Aug 26 , 2025 | 12:35 PM
గుజరాత్‌లోని హన్సల్‌పూర్‌లో మారుతి సుజుకీ తొలి ఎలక్ట్రిక్ వెహికల్ ప్లాంట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా, పూర్తి స్థాయిలో ఇండియాలో తయారైన మారుతీ సుజుకీ తొలి ఎలక్ట్రిక్ కారు ఇ-విటారాను ఆయన జెండా ఊపి ప్రారంభించారు.
గుజరాత్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) మంగళవారం గుజరాత్‌లోని హన్సల్‌పూర్‌లో రెండు కీలక ప్రాజెక్టులకు అంకురార్పణ చేశారు. మారుతీ సుజుకీ మోటార్ ప్లాంట్‌లో మొట్టమొదటి గ్లోబల్ స్ట్రాటజిక్ బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనం (BEV) 'ఇ-విటారా'(eVITARA)తో పాటు కొత్త హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్ ఉత్పత్తి చేసే ప్లాంటును ప్రధాని జెండా ఊపి ఆరంభించారు. ఇ-విటారా భారతదేశంలో పూర్తి స్థాయిలో తయారుచేసిన తొలి ఎలక్ట్రిక్ కారు.100 కంటే ఎక్కువ దేశాలకు రవాణా చేయాలనే లక్ష్యంతో ఈ ప్లాంట్ మొదలైంది. క్లీన్ ఎనర్జీ తయారీ, గ్రీన్ మొబిలిటీకి ప్రపంచ కేంద్రంగా మారాలనే భారతదేశం ఆశయంలో ఇదొక కీలక ముందడుగు. ఈ కార్యక్రమానికి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, జపాన్ రాయబారి కీచీ ఒనో కూడా హాజరయ్యారు.
100 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి
అహ్మదాబాద్‌లోని హన్సల్‌పూర్‌లో సుజుకీ మోటార్ ప్లాంట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుజుకీ తయారుచేసిన మొట్టమొదటి బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనం (BEV) అయిన e-VITARA ను ప్రారంభించారు. భారతదేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ జనవరి 2025లో జరిగిన ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో 'ఇ-విటారా'ను ప్రదర్శించింది. పూర్తి స్థాయిలో ఇండియాలో తయారైన ఈ ఈవీ కారును జపాన్, యూరోపియన్ మార్కెట్లతో సహా 100 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి చేసే దిశగా ప్రణాళికలు సిద్ధమయ్యాయి.
80 శాతం బ్యాటరీ భాగాలు స్వదేశంలోనే..
ఎలక్ట్రిక్ వాహనాల ఎగుమతి ప్రారంభంతో పాటు డెన్సో, తోషిబా, సుజుకీల జాయింట్ వెంచర్ అయిన TDS లిథియం-అయాన్ బ్యాటరీ ప్లాంట్‌లో హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్‌ల స్థానిక ఉత్పత్తిని ప్రధాని మోదీ ఆరంభించారు. ఇందువల్ల 80 శాతం హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్స్ భాగాలు స్వదేశంలోనే ఉత్పత్తి అవుతాయి. ఇది దేశంలో EV బ్యాటరీ ఉత్పత్తిని పెంచేందుకు దోహదపడుతుంది. తద్వారా భారత్ దిగుమతి కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది.
eVITARA ప్రత్యేకతలు
మారుతీ సుజుకీ తన తొలి ఎలక్ట్రిక్ కారును 2025 జనవరిలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ కారు రెండు బ్యాటరీ వేరియంట్లలో లభ్యం అవుతుంది. 49kWh బ్యాటరీ 144 hp శక్తిని,189 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అలాగే 61kWh బ్యాటరీ 174 bhp శక్తిని, 189 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ భారీ బ్యాటరీ వేరియంట్ సుమారు 500 కి.మీ. పైగా రేంజ్ కలిగి ఉందని కంపెనీ వెల్లడించింది. మారుతీ సుజుకీ ఇ-విటారా ఉత్పత్తికి రూ. 2,100 కోట్లు ఖర్చు చేసింది. ఈ కారును 100 దేశాలకు ఎగుమతి చేయడం ద్వారా భారతదేశాన్ని గ్లోబల్ ప్రొడక్షన్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని సుజుకీ మోటార్ కార్పొరేషన్ అధ్యక్షుడు తోషిహిరో సుజుకీ గతంలో పేర్కొన్నారు.
ఈవీ వినియోగాన్ని మెరుగుపరిచే దిశగా, మారుతీ సుజుకీ మొదటి దశలో 100 నగరాల్లో ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనుంది. అదేవిధంగా, ఈ కార్లు కొనుగోలు చేసే వినియోగదారులకు స్మార్ట్ హోమ్ ఛార్జర్, ఇన్‌స్టాలేషన్ సపోర్ట్ కూడా అందించనున్నారు. ప్రతి 5–10 కిలోమీటర్లకు ఛార్జింగ్ స్టేషన్ ఉండేలా మారుతీ సుజుకీ ప్రణాళికలు సిద్ధం చేసింది.
e-VITARA తో ఈవీ తయారీలో పురోగతి
భారతదేశంలోని నాలుగు ప్లాంట్లలో 2.6 మిలియన్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం కలిగిన మారుతి సుజుకీ హన్సల్‌పూర్ ప్లాంట్‌లో ఇ-విటారా తయారుచేస్తుంది.
FY25లో ఈ కంపెనీ 3.32 లక్షల వాహనాలను ఎగుమతి చేసింది. మన దేశంలో 19.01 లక్షల యూనిట్లను విక్రయించినట్లు తెలుస్తోంది.
e-VITARA ప్రారంభంతో భారతదేశం అధికారికంగా సుజుకీ ఎలక్ట్రిక్ వాహనాల (EVలు) ప్రపంచ తయారీ కేంద్రంగా మారింది.
ఇవీ చదవండి:
హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ మెగా డీల్
ఫ్లిప్‌కార్ట్‌లో 2.2 లక్షల సీజనల్ ఉద్యోగాలు
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి