Phoenix Centaurus: హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ మెగా డీల్
ABN , Publish Date - Aug 26 , 2025 | 02:02 AM
అమెరికా టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్‌లో వ్యాపార కార్యకలాపాలను మరింత విస్తరిస్తోంది. ఇందుకోసం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ఫీనిక్స్ సెంటారస్ బిల్డింగ్‌లో 2.65 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని...
2.65 లక్షల చ.అ ఆఫీస్ స్పేస్ లీజుకు తీసుకున్న టెక్ దిగ్గజం
నెలకు రూ.5.4 కోట్ల అద్డె
హైదరాబాద్: అమెరికా టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్‌లో వ్యాపార కార్యకలాపాలను మరింత విస్తరిస్తోంది. ఇందుకోసం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ఫీనిక్స్ సెంటారస్ బిల్డింగ్‌లో 2.65 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని (ఆఫీస్ స్పేస్) లీజుకు తీసుకుంది. హైదరాబాద్‌లోని ఆఫీస్ స్పేస్ మార్కెట్లో ఇప్పటివరకు కుదిరిన అతిపెద్ద లీజు ఒప్పందాల్లో ఇదొకటి. రియల్ ఎస్టేట్ డేటా ప్లాట్‌ఫామ్ ప్రాప్‌స్టాక్ ప్రకారం.. వర్క్‌స్పేస్ నిర్వహణదారు టేబుల్ స్పేస్ టెక్నాలజీస్ నుంచి ఫీనిక్స్ సెంటార్‌సలోని 3,4 అంతస్థులను మైక్రోసాఫ్ట్ ఇండియా ఐదేళ్ల కాలానికి లీజుకు తీసుకుంది. ఈ జూలై 1 నుంచి ఒప్పందం అమలులోకి వచ్చింది. చదరపు అడుగుకు రూ.67 చొప్పున మొత్తం స్థలానికి మైక్రోసాఫ్ట్ నెలకు రూ.1.77 కోట్ల కనీస అద్దె, నిర్వహణ వ్యయాలు, ఇతర చార్జీలు కలిపి మొత్తం రూ.5.4 కోట్లు చెల్లించనుంది. ఏటా అద్దె 4.8 శాతం పెరగనుంది. అంతేకాదు, సెక్యూరిటీ డిపాజిట్ కింద మైక్రోసాఫ్ట్ రూ.42.15 కోట్లు జమ చేసినట్లు ప్రాప్‌స్టాక్ తెలిపింది. వాస్తవానికి టేబుల్ స్పేస్ టెక్నాలజీస్ ఈ స్థలాన్ని బిల్డింగ్ యజమాన్య సంస్థ ఫీనిక్స్ టెక్ జోన్ నుంచి లీజుకు తీసుకుంది.
1998 నుంచి నగరంలో సంస్థ కార్యకలాపాలు: మైక్రోసాఫ్ట్ ఇండియాలో తన తొలి ఆర్ అండ్ డీ సెంటర్‌ను హైదరాబాద్‌లో 1998లో ఏర్పాటు చేసింది. అమెరికా వెలుపల కంపెనీ నిర్వహిస్తోన్న అతిపెద్ద ఆర్ అండ్ డీ సెంటర్ ఇదే. గచ్చిబౌలిలోని కంపెనీ క్యాంపస్ ప్రస్తుతం ఇంజనీరింగ్, కృత్రిమ మేధ (ఏఐ), క్లౌడ్ సేవలపై దృష్టి సారిస్తోంది. ఫీనిక్స్ సెంటార్‌సలోని క్యాంపస్ మరిన్ని ఆర్ అండ్ డీ బృందాలు, టెక్నాలజీ విభాగాలకు నెలవు కానుంది. హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, పుణె, నోయిడాల్లోనూ మైక్రోసాఫ్ట్ కార్యకలాపాలు సాగిస్తోంది.
ఆఫీస్ స్పేస్‌కు హైదరాబాద్ అడ్డా: భారత్‌లో ప్రీమియం, ఏ గ్రేడ్ ఆఫీస్ స్పేస్ అడ్డాల్లో హైదరాబాద్ ఒకటి. పలు అంతర్జాతీయ టెక్నాలజీ, ఆర్థిక సేవల కంపెనీల కార్యాలయాలతో పాటు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ)కు నెలవుగా మారింది నగరం. ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టింగ్ సేవల కంపెనీ నైట్‌ఫ్రాంక్ డేటా ప్రకారం.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్‌లో కోటి చదరపు అడుగుల కార్యాలయ స్థలం లీజు ఒప్పందాలు కుదిరాయి. అందులో టెక్నాలజీ దిగ్గజ కంపెనీలదే అధిక వాటా అని నైట్‌ఫ్రాంక్ పేర్కొంది.
ఇవి కూడా చదవండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి