MP Sri Bharat: పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. వైసీపీకి ఎంపీ శ్రీభరత్ స్ట్రాంగ్ వార్నింగ్
ABN , Publish Date - Nov 10 , 2025 | 02:18 PM
ప్రజలు ఎన్నికల్లో బుద్ది చెప్పినా వైసీపీ నేతల్లో మార్పు కనిపించడం లేదని తెలుగుదేశం విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ ఎద్దేవా చేశారు. అభివృద్ధి అంటే వైసీపీకి తెలియదని ఆక్షేపించారు. ఏపీ విధ్వంసం, నాశనం చేయడంలో వైసీపీ నేతలు పీహెచ్‌డీ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
విశాఖపట్నం, నవంబరు10(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు రావడం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy), ఆయన అనుచరులకు నచ్చడం లేదని తెలుగుదేశం విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ (TDP Visakhapatnam MP Sri Bharat) ఆరోపణలు చేశారు. ఏపీ అభివృద్ధి చెందడం వైసీపీకి ఇష్టం లేదని ధ్వజమెత్తారు. పేదలను పూర్తి పేదరికంలోనే ఉంచాలనేది వైసీపీ సిద్ధాంతమని విమర్శించారు. జగన్ హయాంలో పేదలకు మేలు చేసే పథకాలు తీసేశారని మండిపడ్డారు. రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన సంస్థలను తిరిగి పంపించేశారని ఆక్షేపించారు. వైసీపీ చేసే పనులకు, మాట్లాడే మాటలకు నిబద్ధత లేదని.. అది ప్రజలకు కూడా తెలుసునని చెప్పుకొచ్చారు ఎంపీ శ్రీభరత్.
ఇవాళ(సోమవారం) విశాఖపట్నంలో ఎంపీ శ్రీభరత్ పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎంపీ పాల్గొన్నారు. సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా విశాఖపట్నంలో యూనిటీ మార్చ్ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీభరత్ పాల్గొని మాట్లాడారు. ఈనెల 12వ తేదీన వైజాగ్ బీచ్‌రోడ్డులో, 17వ తేదీన గాజువాకలో యూనిటీ మార్చ్ జరుగుతోందని తెలిపారు. అందరినీ భాగస్వామ్యం చేసి పటేల్ స్ఫూర్తిని భావితరాలకు అందిస్తామని చెప్పుకొచ్చారు. ఈనెల 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో భాగస్వామ్య సదస్సు జరుగనుందని తెలిపారు. ప్రజలు ఎన్నికల్లో బుద్ది చెప్పినా వైసీపీ నేతల్లో మార్పు కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. అభివృద్ధి అంటే వైసీపీ నేతలకు తెలియదని ఆక్షేపించారు. ఏపీ విధ్వంసం, నాశనం చేయడంలో వైసీపీ నేతలు పీహెచ్‌డీ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ శ్రీభరత్.
ప్రపంచస్థాయి పెట్టుబడుల సదస్సు జరుగుతున్న సమయంలో వైసీపీ ర్యాలీలు చేయడం దురదృష్ట కరమని పేర్కొన్నారు. ఏపీకి మంచి చేయాలని చూస్తే తమ ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. పిల్లల భవిష్యత్తు ముఖ్యమా.. స్వార్ధ ప్రయోజనాలు ముఖ్యమా.. అన్నది ప్రజలు ఆలోచించాలని సూచించారు. చట్టం అందరికీ ఒకేలా వర్తిస్తుందని హెచ్చరించారు. వైసీపీ నేతలు ర్యాలీలు చేయాలనుకుంటే మరో సమయంలో చేసుకోవాలని సూచించారు. ర్యాలీల పేరుతో డైవర్ట్ చేద్దామని.. విశాఖకు చెడ్డ పేరు తెద్దామని చూస్తే ప్రభుత్వం తరఫున ముందుకెళ్తామని హెచ్చరించారు. రుషికొండ ప్యాలస్ కోసం ఖర్చు చేసిన డబ్బులు.. ఉత్తరాంధ్రలో మెడికల్ కాలేజీలకు పెట్టి ఉంటే పూర్తి అయ్యేవని వివరించారు. వైసీపీలో వ్యక్తిగతంగా తప్పులు చేసిన వాళ్లు సమాజంలో చాలా మంది ఉంటారని విమర్శించారు ఎంపీ శ్రీభరత్.
వైసీపీ నేతలు ఎవరూ తప్పు చేసినా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వార్నింగ్ ఇచ్చారు. వైసీపీలో అసభ్యంగా విమర్శించిన నేతలకి నామినేటెడ్ పదవి.. హత్య చేసిన వారికి మంత్రి పదవి ఇచ్చారని సెటైర్లు గుప్పించారు. గంజాయి కేసులో ఉన్నవారిని జైలుకెళ్లి పరామర్శించిన ఘనత జగన్‌కే దక్కుతోందని ఎద్దేవా చేశారు. ప్రపంచస్థాయిలో ఆంధ్రప్రదేశ్‌ను తీసుకేళ్లే ప్రయత్నం తాము చేస్తున్నామని వివరించారు ఎంపీ శ్రీభరత్.
విశాఖలో జరిగే సమ్మిట్‌లో 410కి పైగా ఎంఓయూలు, రూ.9.8లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలపై సంతకాలు జరుగబోతున్నాయని ఉద్ఘాటించారు. విశాఖ సమ్మిట్ కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. పెట్టుబడులకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తోందని నొక్కిచెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చిన 17 నెలల్లోనే మంత్రివర్గం రూ. 9 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపిందని గుర్తుచేశారు. వైజాగ్‌కు రానున్న పరిశ్రమలకు త్వరలోనే శంకుస్థాపనలు ఉంటాయని వివరించారు. పెట్టుబడులని ఆహ్వానించడం.. సాధ్యమైనంత త్వరగా ఆయా కంపెనీల గ్రౌండ్ వర్క్ చేసి.. వాటిని త్వరగా ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎంపీ శ్రీభరత్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
రాయలచెరువు గండి ఘటన.. ప్రభుత్వం కీలక నిర్ణయం
మంత్రులకు సీఎం చంద్రబాబు అభినందనలు.. ఎందుకంటే
Read Latest AP News And Telugu News