Share News

Simhachalam Temple: అన్నదానంలో అపూర్వం.. సింహాచలం ఆలయంలో నిత్యాన్న ప్రసాదం

ABN , Publish Date - Aug 14 , 2025 | 10:31 AM

అన్ని దానాల్లోకి అన్నదానం మేలు అన్న ఆర్యోక్తిని సింహాచలంలోని వరాహలక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ఉద్యోగులు 36 ఏళ్ల కిందట నిజం చేశారు. రూ.50 వేలను విరాళంగా సమర్పించి పెద్దమనసుతో నిత్యాన్న ప్రసాద పథకానికి అంకురార్పణ చేశారు.

Simhachalam Temple: అన్నదానంలో అపూర్వం.. సింహాచలం ఆలయంలో నిత్యాన్న ప్రసాదం
Simhachalam Temple

» అప్పన్న భక్తులకు వరం..నిత్యాన్న ప్రసాదం

» దాతల సహకారంతో 36 ఏళ్లుగా సాగుతున్న వైనం

» ప్రతిరోజూ సుమారు 3 వేల మందికి భోజనం

» రూ.36.45 కోట్లకు చేరిన అన్నదాన విరాళాలు

సింహాచలం, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): అన్ని దానాల్లోకి అన్నదానం మేలు అన్న ఆర్యోక్తిని సింహాచలంలోని వరాహలక్ష్మీనృసింహస్వామి దేవస్థానం (Simhachalam Varaha Lakshmi Narasimha Swamy Temple) ఉద్యోగులు 36 ఏళ్ల కిందట నిజం చేశారు. రూ.50 వేలను విరాళంగా సమర్పించి పెద్దమనసుతో నిత్యాన్న ప్రసాద పథకానికి అంకురార్పణ చేశారు. ఈ క్రమంలో 1989 ఆగస్టు 24న అప్పటి దేవస్థానం ఈవో నరసింహమూర్తి ఆధ్వర్యంలో ప్రారంభమైన పథకం నేటికీ అప్రతహితంగా సాగుతూ భక్తుల మన్ననలు అందుకుంటోంది.


అప్పన్న దర్శనానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల ఆకలి తీర్చాలనే సదుద్దేశంతో దేవస్థానం ఉద్యోగులు మంచి మనసుతో ప్రారంభించిన అన్నప్రసాద పథకానికి అనేకమంది దాతలు నిరంతంర సహాయ సహకారాలు అందిస్తున్నారు. దాంతో 2014లోని హుద్ హుద్, 2021లోని కరోనా వంటి ప్రకృతి విపత్తుల వేళ దేవస్థానం అధికారులు నిత్యాన్న ప్రసాద పథకం కింద ఉడతా భక్తిగా వేలాది మందికి పులిహోర, కదంబం, దద్దోజనం, పులిహోర వంటి ప్రసాదాలను ప్యాకెట్లుగా చేసి బాధితులకు అందజేశారు.


రోజుకు 3 వేలమందికి

పథకం ప్రారంభించిన మొదట్లో ప్రతిరోజూ 200 మందికి మాత్రమే అన్నప్రసాదాన్ని అందించగా, ప్రస్తుతం ప్రతిరోజు కనీసం మూడువేల మంది భక్తులకు, ప్రభుత్వ ఆదేశాల మేరకు గరిష్ఠంగా ఐదువేల మందికి అన్నప్రసాదాన్ని మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో ప్రతిరోజు రెండువందల మందికి అన్నప్రసాదాన్ని రుచికరంగా వండి వడ్డిస్తున్నారు. ఈ పథకానికి రూ.లక్షకు పైగా విరాళం సమర్పించిన దాతలను మహారాజ పోషకులని, రూ.50వేలు, అంతకంటే ఎక్కువ విరాళం ఇచ్చిన వారిని రాజపోష కులని, రూ.10వేలు అంతకంటే ఎక్కువ విరాళాలు సమర్పించిన వారిని పోషకులని వ్యవహరిస్తారు. దాతలకు నగదు రశీదుతోపాటు డోనార్ కార్డును అందజేస్తారు. డోనార్ కార్డుతో దాత కుటుంబసభ్యులకు ఏడాదిలో ఒకరోజు స్వామివారిని ఉచితంగా దర్శనం చేసుకునేందుకు వీలు కల్పిస్తారు. విరాళం అందజేసిన రోజున స్వామి దర్శనంతోపాటు శేష వస్త్రం, వేదాశీర్వచనాలు, ప్రసాదాలను అందజేస్తారు. భకులు కోరిన రోజున ఏడాదికి ఒకసారి గోత్రనామాలతో ప్రత్యేక పూజలు చేస్తారు. వారు అందించిన విరాళంపై వచ్చే వడ్డీతో భక్తులకు అన్నప్రసాదం అందిస్తారు. ప్రతిరోజు అన్నప్రసాద భవనం ముందు బోర్డుపై ఆరోజు దాతల పేర్లను రాస్తారు.


విరాళాలివ్వాలంటే...

భక్తులు విరాళాలు సమర్పించేందుకు అప్పన్నస్వామి ఆలయం పరిసరాల్లో మూడు స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దర్శనం అనంతరం బయటకు వచ్చు దక్షిణ రాజగోపురం వద్ద, పీఆరో కార్యాలయం, అన్నప్రసాద భవనం వద్ద విరాళాలను స్వీకరిస్తారు. విరాళాల పూర్తి సమాచారం కోసం భక్తులు 9398734612 నంబరులో సంప్రదించాలని అధికారులు ప్రకటించారు.


వడ్డి సొమ్ముతోనే ప్రసాదం

భక్తితో దాతలు సమర్పించిన విరాళాలను జాతీయ బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి, దానిపై లభించే వడ్డీతో అన్నప్రసాద పథకం కింద పరిశుభ్రమైన వాతావరణంలో రుచికరమైన భోజనాన్ని సంప్రదాయరీతిలో విస్తరాకుల్లో వడ్డిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం 2024-25నాటికి బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ చేసిన సొమ్ము సుమారు రూ.36.45 కోట్లకు చేరింది. డిపాజిట్లపై సుమారు రూ.2కోట్ల వరకు వడ్డీ లభిస్తున్నట్లు దేవస్థానం రికార్డులను బట్టి తెలుస్తోంది. విరాళలపై వచ్చే వడ్డీతో తాజా గణాంకాల ప్రకారం ఏడాదిలో సుమారు 12 లక్షల మందికి అన్నప్రసాదాన్ని అందిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రజలకు భయం పోయింది.. జగన్‌కు పట్టుకుంది

జగన్‌కు దమ్ముంటే మోదీ, షాపై పోరాడాలి

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Aug 14 , 2025 | 10:31 AM