Share News

CII Summit:విశాఖలో 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభం

ABN , Publish Date - Nov 14 , 2025 | 10:22 AM

విశాఖపట్నంలో జరుగుతున్న 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో పలువురు పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వంతో కలిసి పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు.

CII Summit:విశాఖలో 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభం
CII Partnership Summit

విశాఖపట్నం ,నవంబరు14 (ఆంధ్రజ్యోతి): 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు (CII Partnership Summit) ఇవాళ(శుక్రవారం) విశాఖపట్నంలోని ఏయూ ఇంజినీరింగ్ కళాశాల గ్రౌండ్స్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఈ సదస్సును భారతదేశ ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. భాగస్వామ్య సదస్సుకు కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, రామ్మోహన్ నాయుడు, శ్రీనివాసవర్మ, పెమ్మసాని చంద్రశేఖర్ హాజరయ్యారు. ఈ సదస్సులో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, సీఎస్ విజయానంద్, సీఐఐ అధ్యక్షుడు రాజీవ్ మెమానీ, సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పాల్గొన్నారు. విశిష్ట అతిథులుగా కరణ్ అదానీ, యూసఫ్ అలీ, బాబా కల్యాణి తదితర దిగ్గజ పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు. ఈ సదస్సులో దేశ, విదేశాలకు చెందిన ప్రతినిధులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు పాల్గొన్నారు.


స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో ఏపీ ఆధునికంగా మారుతోంది: కరణ్ అదానీ

స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో ఆంధ్రప్రదేశ్ ఆధునికంగా మారుతోందని అదానీ పోర్ట్స్, సెజ్ ఎండీ కరణ్ అదానీ ఉద్ఘాటించారు. విశాఖపట్నంలోని సీఐఐ పెట్టుబడుల సదస్సులో కరణ్ అదానీ పాల్గొని ప్రసంగించారు. భారతదేశంలో వేగంగా ఎదుగుతున్న స్టార్టప్ స్టేట్‌గా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని తెలిపారు. దీనికి మార్గదర్శిగా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఏపీలో డేటా సెంటర్లు, ఓడరేవులు, సిమెంట్ ఉత్పత్తి తదితర రంగాల్లో అదానీ ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోందని స్పష్టం చేశారు. 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులు, లక్షకు పైగా ఉద్యోగాలను కూడా అదానీ సంస్థ కల్పించిందని నొక్కిచెప్పారు. ఏపీ వృద్ధిలో అదానీ సంస్థ కూడా భాగస్వామి అవుతోందని చెప్పుకొచ్చారు. నైపుణ్యం ఉన్న యువత, మానవ వనరులు, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ఏపీని మంత్రి నారా లోకేష్ తీర్చిదిద్దుతున్నారని కరణ్ అదానీ ప్రశంసించారు.


ఏపీకి అంతర్జాతీయ విమానాశ్రయాలు: మల్లిఖార్జునరావు

ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్‌కు అనుగుణంగా ఏపీకి అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయాలు వస్తున్నాయని జీఎంఆర్ సంస్థ చైర్మన్ గ్రంధి మల్లిఖార్జునరావు వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలోని సీఐఐ పెట్టుబడుల సదస్సులో మల్లిఖార్జునరావు పాల్గొని ప్రసంగించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంలో భాగస్వామి అయినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ ఏరో స్పేస్ ఎకోసిస్టంను ఆంధ్రప్రదేశ్‌లో సిద్ధం చేస్తున్నామని వివరించారు. మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవర్ హాలింగ్ కేంద్రం కూడా భోగాపురం ఎయిర్ పోర్టుకు వస్తోందని వెల్లడించారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలు ఏపీలో ఇప్పుడు సాకారం అవుతున్నాయని మల్లిఖార్జునరావు పేర్కొన్నారు.


ప్రపంచవ్యాప్తంగా ఏఐ, డేటా యుగం నడుస్తోంది: అమిత్ కల్యాణి

ప్రపంచవ్యాప్తంగా ఏఐ, డేటా యుగం నడుస్తోందని భారత్ ఫోర్జ్ జాయింట్ ఎండీ అమిత్ కల్యాణి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఏపీ కూడా ఈ రంగాల్లో ముందడుగు వేస్తోందని తెలిపారు. ఏపీ వృద్ధిలో భారత్ ఫోర్జ్ కూడా భాగస్వామి అవుతోందని వివరించారు. నౌకా నిర్మాణం, పర్యాటక, తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని భారత్ ఫోర్జ్ నిర్ణయించిందని పేర్కొన్నారు. ఇప్పటికే డిఫెన్స్ ఉత్పత్తుల తయారీలో ఏపీతో కలిసి పనిచేస్తున్నామని వివరించారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా యువతకు నైపుణ్యాలు కల్పించే అంశంలోనూ భారత్ ఫోర్జ్ సంస్థ భాగస్వామి అయ్యిందని అమిత్ కల్యాణి పేర్కొన్నారు.


భారత్ ముందుకెళ్తోంది: సుచిత్రా కె.ఎల్లా

ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమిస్తూ భారత్ ముందుకెళ్తోందని భారత్ బయోటెక్ ఎండీ, సీఐఐ ఉపాధ్యక్షురాలు సుచిత్రా కె.ఎల్లా ఉద్ఘాటించారు. విశాఖపట్నంలోని సీఐఐ పెట్టుబడుల సదస్సులో సుచిత్రా కె.ఎల్లా పాల్గొని ప్రసంగించారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో స్వయం ప్రతిపత్తి సాధించేలా దేశం ముందడుగు వేస్తోందని తెలిపారు. భాగస్వామ్యం, ఆవిష్కరణలు, విలువ ఆధారిత ఉత్పత్తులతోనే ఆత్మనిర్భర్ భారత్ ఆవిష్కృతం అవుతోందని చెప్పుకొచ్చారు. కోవిడ్ లాంటి విపత్తు వచ్చినప్పుడు ప్రపంచానికి వాక్సిన్ అందించగలిగిన దేశంగా భారత్ అవతరించిందని అభివర్ణించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు జీనోమ్ వ్యాలీ లాంటి ఎకోసిస్టమ్‌ను తయారు చేశారని ఉద్ఘాటించారు. అదే జీనోమ్ వ్యాలీలో భారత్ బయోటెక్ కోవిడ్‌కు వ్యాక్సిన్ తయారు చేసి అందించిందని సుచిత్రా కె.ఎల్లా పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

అతిథులకు ఆహ్వానం పలుకుతూ సీఎం ట్వీట్

ఓఎంసీ సుప్రీం కమిటీ నుంచి అనంత కలెక్టర్‌ తొలగింపు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 14 , 2025 | 11:46 AM