Supreme Court: ఓఎంసీ సుప్రీం కమిటీ నుంచి అనంత కలెక్టర్ తొలగింపు
ABN , Publish Date - Nov 14 , 2025 | 06:43 AM
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అక్రమ తవ్వకాలను నిర్ధారించేందుకు సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
సర్వే ఆర్‌డీడీ, డీడీ మైన్స్ కూడా.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు
అమరావతి, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అక్రమ తవ్వకాలను నిర్ధారించేందుకు సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా కలెక్టర్, రెవెన్యూ, సర్వే, గనుల శాఖ జిల్లా స్థాయి అధికారులను కమిటీ నుంచి ప్రభుత్వం తొలగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఉత్తర్వులు (జీఓ193) జారీచేశారు. నిపుణుల కమిటీ ఏర్పాటు విషయంలో సుప్రీం కోర్టు మార్గదర్శకాలు, ఆదేశాలు కచ్చితంగా పాటించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అనంతపురం కలెక్టర్‌తో పాటు, సర్వే ఆర్ డీడీ, డీడీ మైన్స్‌లను ఈ కమిటీ నుంచి తొలగించారు. దీంతో కమిటీలో ఆరుగురు సభ్యులు మాత్రమే ఉన్నారు. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుధాంశు ధూలియా నేతృత్వంలోని ఈ నిపుణుల కమిటీ ఓఎంసీ మైనింగ్ కేసులో మైనింగ్‌లీజు ఏరియా, తవ్వకాలు జరిపిన ప్రాంతం, అక్రమంగా తవ్వితీసిన ఖనిజం, అక్రమ తవ్వకాలు జరిగిన మైనింగ్ ఏరియా వంటి అంశాలను నిర్ధారించి సుప్రీంకు నివేదిక ఇవ్వనుంది. సర్వే డైరెక్టర్ కూర్మనాథ్ ఈ కమిటీ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. కాగా.. రాష్ట్రంలో మేజర్ మినరల్స్ వేలానికి ముందు రికార్డుల పరిశీలన, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకునేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.