Share News

PM Modi On Super GST Meeting: 2047 నాటికి మన దేశం వికసిత్‌ భారత్‌గా మారుతుంది: మోదీ

ABN , Publish Date - Oct 16 , 2025 | 04:03 PM

ఏపీ ఆత్మగౌరవం.. సంస్కృతికి నిలయంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభివర్ణించారు. ఏపీలో అనంత అవకాశాలు ఉన్నాయని ఉద్ఘాటించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ.

PM Modi On Super GST Meeting: 2047 నాటికి మన దేశం వికసిత్‌ భారత్‌గా మారుతుంది: మోదీ
PM Narendra Modi On Super GST Meeting

కర్నూలు, అక్టోబరు16(ఆంధ్రజ్యోతి): ఏపీ ఆత్మగౌరవం.. సంస్కృతికి నిలయంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) అభివర్ణించారు. ఏపీలో అనంత అవకాశాలు ఉన్నాయని ఉద్ఘాటించారు. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలోనూ యువశక్తి ఉందని నొక్కిచెప్పారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ రూపంలో ఏపీకి శక్తివంతమైన నాయకత్వం ఉందని ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఏపీకి సహకారం అందిస్తున్నామని పేర్కొన్నారు. 16 నెలల్లో అభివృద్ధి డబుల్‌ ఇంజిన్‌లా దూసుకుపోతోందని ఉద్ఘాటించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ.


ఢిల్లీ, అమరావతి కలిసి పనిచేస్తున్నాయి..

అభివృద్ధి కోసం ఢిల్లీ, అమరావతి కలిసి పనిచేస్తున్నాయని ప్రధాని మోదీ వెల్లడించారు. ఇవాళ(గురువారం) కర్నూలు జిల్లాలోని నన్నూరులో 'సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్' బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగించారు. ఈ సభలో సోదర, సోదరీమణులకు నమస్కారం అంటూ తెలుగులో మోదీ ప్రసంగించారు. అహోబిళం, మహానంది, మంత్రాలయం స్వాముల ఆశీస్సులు కోరుకుంటున్నామని ఆకాంక్షించారు. ద్వితీయ జ్యోతిర్లింగమైన మల్లికార్జునస్వామి ఆశీస్సులు పొందానని చెప్పుకొచ్చారు. సోమనాథుడు కొలువైన గడ్డపై పుట్టానని ఉద్ఘాటించారు. విశ్వనాథుడికి సేవ చేసే భాగ్యం కలిగిందని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ.


స్వర్ణాంధ్ర సహకారం..

‘వికసిత్‌ భారత్‌ లక్ష్యానికి స్వర్ణాంధ్ర ఎంతో సహకారం అందిస్తోంది. భారత్‌, ఏపీ అభివృద్ధిని ప్రపంచమంతా గమనిస్తోంది. గూగుల్‌ లాంటి కంపెనీ ఏపీలో పెట్టుబడి పెడుతోంది. అమెరికా వెలుపల అతిపెద్ద పెట్టుబడి పెడుతున్నట్లు గూగుల్‌ సీఈవో చెప్పారు. విశాఖలో ఏఐ హబ్‌, డేటా సెంటర్‌, సబ్‌ సీ కేటుల్‌ వంటి భారీ ప్రాజెక్ట్‌లు వస్తున్నాయి. సబ్‌ సీ కేబుల్‌ వ్యవస్థకు విశాఖపట్నం గేట్‌ వేగా మారబోతోంది. విశాఖ నుంచే ప్రపంచానికి సేవలు అందబోతున్నాయి’ అని వ్యాఖ్యానించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ.


వికసిత్‌ భారత్‌..

‘2047 నాటికి మన దేశం వికసిత్‌ భారత్‌గా మారుతుంది. 21వ శతాబ్దం.. 140 కోట్ల భారతీయుల శతాబ్దం. పలు ప్రాజెక్టులతో ఏపీలో కనెక్టివిటీ బలోపేతం అవుతుంది. ప్రాజెక్టులతో పరిశ్రమలకు ఊతం.. ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. దేశం అభివృద్ధి చెందాలంటే ఇంధన భద్రత కీలకం. ట్రాన్స్‌మిషన్‌ ప్రాజెక్టులతో దేశ ఇంధన సామర్థ్యం పెరుగుతుంది. దేశంలోని ప్రతి గ్రామంలో విద్యుద్దీకరణ జరిగింది. తలసరి విద్యుత్‌ వినియోగం 1400 యూనిట్లకు పెరిగింది. దేశంలో ఇంధన విప్లవానికి ఏపీ కేరాఫ్‌గా మారింది. ఇళ్లతో పాటు పరిశ్రమలకు తగిన విద్యుత్‌ అందుతోంది. సహజ వాయువు పైపులైన్‌తో రూ.15 లక్షల ఇళ్లకు గ్యాస్‌ సరఫరా అందిస్తున్నాం. చిత్తూరు LPG బాటిలింగ్‌ ప్లాంటుకు రోజూ 20 వేల సిలిండర్లు నింపే సామర్థ్యం ఉంది’ అని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ.


మల్టీమోడల్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల అభివృద్ధి..

‘వికసిత్‌ భారత్‌ లక్ష్య సాధనకు మల్టీమోడల్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్టులు అభివృద్ధి చేస్తున్నాం. సబ్బవరం- షీలానగర్‌ హైవేతో కనెక్టివిటీ మరింత పెరుగుతుంది. ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక కారిడార్లతో ఉపాధి లభిస్తోంది. భారత్‌ను 21వ శతాబ్దపు తయారీ కేంద్రంగా ప్రపంచం చూస్తోంది. ఏపీ అభివృద్ధికి రాయలసీమ అభివృద్ధి చాలా ముఖ్యం. రాయలసీమ జిల్లాల్లో ఉపాధి కల్పించేలా పలు ప్రాజెక్టులు వస్తున్నాయి. ప్రజలే ప్రాధాన్యంగా మా ప్రభుత్వ నిర్ణయాలు, అభివృద్ధే మా విధానం. జీఎస్టీ భారాన్ని కూడా తగ్గించాం. జీఎస్టీ పొదుపు ఉత్సవాన్ని పండుగగా చేసుకున్నారు. మంత్రి నారా లోకేశ్‌ ఆధ్వర్యంలో ఉత్సవాన్ని జరుపుకోవడం ఆనందాన్నిచ్చింది. కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఏపీ సామర్థ్యాన్ని విస్మరించాయి. దేశాన్ని ముందుకు నడిపించే శక్తి ఏపీకి ఉంది. ఏపీ మాత్రం సొంత అభివృద్ధి కోసం పోరాడే దుస్థితి కలిగింది. ఎన్డీఏ హయాంలో ఏపీ ముఖచిత్రం మారుతోంది. నిమ్మలూరు నైట్‌ విజన్‌ పరికరాల తయారీ ఫ్యాక్టరీ.. రక్షణ రంగంలో కీలకపాత్ర పోషించబోతోంది. కర్నూల్‌ను డ్రోన్‌ హబ్‌గా మార్చాలన్నది ప్రభుత్వం సంకల్పం’ అని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ.


ఈ వార్తలు కూడా చదవండి:

Pawan Kalyan On GST Meeting: ప్రధాని మోదీని కర్మయోగిగా చూస్తాం: పవన్‌ కల్యాణ్‌

PM Modi On GST Meeting: నన్నూరులో 'సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్' బహిరంగసభ ప్రారంభం.. పాల్గొన్న ప్రధాని మోదీ

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 16 , 2025 | 07:11 PM