YSRCP Leaders: వైసీపీకి ఊహించని పాక్.. టీడీపీలోకి కీలక నేతలు
ABN , Publish Date - Dec 30 , 2025 | 09:06 PM
వైసీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. గంపలగూడెం మండలంలో వైసీపీకి చెందిన కీలక నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ చేరికలు స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ఎన్టీఆర్ జిల్లా, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): వైసీపీకి (YSRCP) భారీ ఎదురుదెబ్బ తగిలింది. గంపలగూడెం మండలంలో వైసీపీకి చెందిన కీలక నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో (Telugu Desam Party) చేరారు. ఈ చేరికలు స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. గంపలగూడెం మండలం కొణిజర్ల గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు బొల్లా కరుణాకర్ (బుజ్జి), బొల్లా శ్రీనివాసరావు (ఎన్నారై) ఆధ్వర్యంలో వారి అనుచరులు, కుటుంబ సభ్యులు పసుపు కండువా కప్పుకున్నారు. తెలుగుదేశం పార్టీ గంపలగూడెం అధ్యక్షులు మానుకొండ రామకృష్ణ (ఎమార్కే) అధ్యక్షతన ఇవాళ(మంగళవారం) తోటమూల ఎస్ఆర్ గార్డెన్‌లో నిర్వహించిన సమావేశంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా తెలుగు రైతు విభాగ అధ్యక్షుడు చెరుకూరి రాజేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన సమక్షంలో బొల్లా కరుణాకర్ (బుజ్జి), బొల్లా శ్రీనివాసరావు (ఎన్నారై)తో పాటు వారి అనుచరులు, మహిళలు, కుటుంబ సభ్యులు టీడీపీలో చేరారు. ఈసందర్భంగా వారికి పసుపు కండువాలు కప్పి అధికారికంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు టీడీపీ ప్రభావం మరింత పెరుగుతున్నట్లు ఈ చేరికలు సూచిస్తున్నాయి.
వైసీపీ ప్రస్తుత పోకడలు మాకు నచ్చలేదు: బొల్లా కరుణాకర్, శ్రీనివాసరావు
ఈ సందర్భంగా బొల్లా కరుణాకర్, శ్రీనివాసరావు మాట్లాడారు. వైసీపీ ప్రస్తుత పోకడలు తమకు నచ్చలేదని స్పష్టంగా తెలిపారు. పార్టీ శ్రేణులకు ఇచ్చిన హామీల అమల్లో ఫ్యాన్ పార్టీ విఫలమైందని విమర్శించారు. మరోవైపు కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు తమను ఆకర్షించాయని పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసమే టీడీపీలో చేరినట్లు బొల్లా కరుణాకర్, శ్రీనివాసరావు పేర్కొన్నారు.
టీడీపీపై విశ్వాసానికి ఇది స్పష్టమైన సంకేతం: మానుకొండ రామకృష్ణ
టీడీపీ గంపలగూడెం అధ్యక్షుడు మానుకొండ రామకృష్ణ మాట్లాడారు. గంపలగూడెం మండలంలో పార్టీ బలపడిందనడానికి ఈ చేరికలే నిదర్శనమని వ్యాఖ్యానించారు. గ్రామస్థాయిలో టీడీపీపై పెరుగుతున్న విశ్వాసానికి ఇది స్పష్టమైన సంకేతమని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని చేరికలు జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ప్రతి కార్యకర్తకు తమ పార్టీ పూర్తి ప్రాధాన్యం ఇస్తుందని, వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. గ్రామ అభివృద్ధి, రైతుల సంక్షేమం, యువత ఉపాధి వంటి అంశాలపై టీడీపీ కట్టుబడి పనిచేస్తుందని మానుకొండ రామకృష్ణ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
శ్రీశైలం దేవస్థానం మరో కీలక నిర్ణయం.. వారికి ఉచిత స్పర్శదర్శనం
న్యూఇయర్.. హద్దు దాటితే కఠిన చర్యలు
For More AP News And Telugu News