Share News

New Year Celebrations: న్యూఇయర్.. హద్దు దాటితే కఠిన చర్యలు

ABN , Publish Date - Dec 30 , 2025 | 03:53 PM

నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా పలు ఆంక్షలు విధించినట్లు విశాఖపట్నం నగర పోలీస్ కమిషనరేట్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వేడుకలను శాంతియుతంగా, సురక్షితంగా నిర్వహించుకోవాలని సూచించారు.

New Year Celebrations: న్యూఇయర్.. హద్దు దాటితే కఠిన చర్యలు
CP Shankhabrata Bagchi

విశాఖపట్నం, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): నూతన సంవత్సర వేడుకలను (New Year Restrictions) శాంతియుతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు విశాఖపట్నం నగర పోలీస్ కమిషనరేట్ పలు కఠిన ఆంక్షలను విధించింది. డిసెంబర్ 31వ తేదీ రాత్రి వేడుకల నిర్వహణకు అనుమతులు ఇచ్చినప్పటికీ, రాత్రి 12 గంటల వరకు మాత్రమే కార్యక్రమాలకు అనుమతి ఉంటుందని విశాఖపట్నం సీపీ శంఖబ్రత బాగ్చి (CP Shankhabrata Bagchi) స్పష్టం చేశారు. ఈ నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్బుల్లో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించే నిర్వాహకులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చట్ట విరుద్ధమైన కార్యక్రమాలు, అసాంఘిక చర్యలు, అశ్లీల నృత్యాలు నిర్వహిస్తే నిర్వాహకులతో పాటు పాల్గొన్న వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని తెలిపారు. నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఏ చర్యనైనా సహించబోమని స్పష్టం చేశారు.


నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నగరమంతా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. సుమారు 500 మంది పోలీస్ సిబ్బందితో డ్రంకెైన్‌డ్రైవ్ పరీక్షలు, ట్రిపుల్ రైడింగ్‌పై ప్రత్యేకంగా గస్తీ నిర్వహిస్తామని వెల్లడించారు. అతిగా మద్యం సేవించి వాహనం నడిపితే సీజ్ చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


బైక్ సైలెన్సర్లతో హడావుడి చేస్తూ ప్రజలను ఇబ్బంది పెట్టే వారిని వెంటనే అరెస్టు చేస్తామని తెలిపారు. అలాగే ఈ వేడుకల నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా నగరంలోని ఫ్లైఓవర్లను డిసెంబర్ 31వ తేదీ రాత్రి మూసివేస్తామని ప్రకటించారు. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని సూచించారు.


నగర భద్రతపై ప్రత్యేక దృష్టి సారించామని.. అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతిక్షణం మానిటరింగ్ కొనసాగిస్తామని వివరించారు. గంజాయి, మత్తు పదార్థాలు సేవించినా లేదా వాటి అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడినా అరెస్టులు తప్పవని హెచ్చరించారు.


అసాంఘిక కార్యకలాపాలు, చట్ట విరుద్ధ చర్యలు ప్రజల దృష్టికి వస్తే వెంటనే డయల్ 112 నెంబర్‌కు ఫోన్ చేయాలని లేదా నేరుగా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజల సహకారంతోనే శాంతియుతంగా నూతన సంవత్సర వేడుకలు సాధ్యమవుతాయని తెలిపారు. నూతన సంవత్సరంలో ‘Say No to Drugs’ అనే ఉద్దేశంతో ముందుకు వెళ్లాలని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. వేడుకల పేరుతో ప్రాణాలకు ముప్పు తెచ్చే చర్యలకు పాల్పడవద్దని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విశాఖపట్నం సీపీ శంఖాబ్రత బాగ్చి కోరారు.

Updated Date - Dec 30 , 2025 | 04:00 PM