YS Sharmila: జగన్ బలప్రదర్శనలకు ముగ్గురు బలి.. షర్మిల ఫైర్
ABN , Publish Date - Jun 26 , 2025 | 05:27 PM
జగన్ హయాంలోని ఐదేళ్లలో ప్రజా సమస్యలను ఎందుకు పరిష్కరించలేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. కనీసం కార్యకర్తలకు కూడా అందుబాటులో లేకుండా పోయారని..ఇప్పుడేమో 2.0 అని మొహం చూపిస్తాడట అని షర్మిల ఎద్దేవా చేశారు.

విజయవాడ: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై మాట్లాడే నైతిక హక్కు జగన్‌కి లేదని ధ్వజమెత్తారు. ఐదేళ్లు అధికారంలో ఉండి మద్యం మాఫియా నడిపించారని ఆరోపించారు. రైతులను నట్టేట ముంచారని ఫైర్ అయ్యారు. ఇవాళ(గురువారం) విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయంలో షర్మిల మీడియాతో మాట్లాడారు.
రైతులు చనిపోతున్నా జగన్ కనీసం పట్టించుకోలేదని వైఎస్ షర్మిల మండిపడ్డారు. వైఎస్సార్ చేపట్టిన జలయజ్ఞాన్ని కూడా నిర్లక్ష్యంగానే వదిలేశారని విమర్శలు చేశారు. ఆరునెలల్లో మొత్తం ప్రాజెక్ట్‌లు పూర్తి చేస్తానని జగన్ చెప్పారని.. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ప్రాజెక్ట్‌ని కూడా పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేశారని దుయ్యబట్టారు. ఐదేళ్లలో ప్రజా సమస్యలను ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు. కనీసం వైసీపీ కార్యకర్తలకు కూడా అందుబాటులో లేకుండా పోయారని.. ఇప్పుడేమో 2.0 అంటూ మొహం చూపిస్తాడట అని ఎద్దేవా చేశారు వైఎస్ షర్మిల.
పర్యటనల పేరుతో జగన్ బలప్రదర్శనలు..
‘ప్రజలను నమ్మించే ప్రయత్నం జగన్ చేస్తాడట. ఆయనకి ప్రజా సమస్యలు కాదు.. కావాల్సినవి బలప్రదర్శనలు. అందుకే పర్యటనల పేరుతో బలప్రదర్శనలు చేస్తున్నారు. జగన్ చేసిన బలప్రదర్శనలకు ముగ్గురు బలి అయ్యారు. ఆయన ప్రదర్శనలపై ఏపీ ప్రభుత్వం నిషేధం విధించాలి. హత్యలు చేసిన వాళ్లు, చంపిన వాళ్లు ఒప్పుకుంటారా..? వివేకా బాబాయినీ హత్య చేయించి సునీత మీదే తోశాడు. ఇప్పుడు సింగయ్యను చంపి ఏఐ అంటున్నారు. బాబాయిని చంపి సునీత మీద నెట్టివేసిన వాళ్లకు సింగయ్య మృతి మీద అబద్ధాలు చెప్పడం ఒక లెక్కా..? వివేకా హత్య కేసులో సీబీఐ అన్ని ఆధారాలు చూపించింది. హత్య చేసిన వాళ్లు, చేయించిన వాళ్లతో మాట్లాడిన సంభాషణలు ఉన్నాయని సీబీఐ చెప్పింది. అయినా మేము చంపలేదు.. మాకు ఏం తెలియలేదని మాట మార్చలేదా..? ఇప్పుడు సింగయ్య హత్య కూడా అంతే’ అని షర్మిల ధ్వజమెత్తారు.
ఇవి కూడా చదవండి:
జలహారతి కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం..
ఇంద్రకీలాద్రిపై వారాహి ఉత్సవాలు..
For More AP News and Telugu News