Indrakeeladri Phone Controversy: ఇంద్రకీలాద్రిలో మొబైల్ ఫోన్ ఉల్లంఘనలు
ABN , Publish Date - Sep 08 , 2025 | 07:59 AM
రాష్ట్రంలోని వివిధ ప్రముఖ ఆలయాలకు వెళ్లినప్పుడు నిబంధనలను కచ్చితంగా పాటించే భక్తుల్లో కొందరు ఇంద్రకీలాద్రి విషయానికి వచ్చే సరికి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
మా ఫోన్లు.. మా ఇష్టం
ఇంద్రకీలాద్రిపై వివాదాస్పదంగా పలువురి తీరు
నిబంధనలను పాటించని వీఐపీ భక్తులు
అంతరాలయంలో సెల్‌ఫోన్లపై నిషేధం విధించిన అధికారులు
అడ్డుకున్న సెక్యూరిటీపై తిరుగుబాటు
(ఆంధ్రజ్యోతి- విజయవాడ): రాష్ట్రంలోని వివిధ ప్రముఖ ఆలయాలకు వెళ్లినప్పుడు నిబంధనలను కచ్చితంగా పాటించే భక్తుల్లో కొందరు ఇంద్రకీలాద్రి (Indrakeeladri Temple) విషయానికి వచ్చే సరికి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా సెల్‌ఫోన్ల విషయంలో నిత్యం ఏదో ఒక చోట వివాదం జరుగుతూనే ఉంది. దుర్గమ్మ దర్శనానికి వెళ్లే అన్ని మార్గాల్లోనూ అధికారులు నిబంధనలకు సంబందించిన బోర్డులను ఏర్పాటు చేసినప్పటికీ పలువురు భక్తులు వాటిని పాటించడానికి ససేమిరా అంటున్నారు.
శ్రీదుర్గామల్లేశ్వరస్వామి ఆలయానికి కొన్ని నెలల క్రితం భక్తురాలు దర్శనానికి వచ్చి అమ్మవారికి ఇచ్చే హారతుల దృశ్యాన్ని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించింది. అక్కడితో ఆగకుండా వీడియోను ఇన్‌స్టా అకౌంట్‌లో పోస్టు చేసింది. ఈ వీడియో మొత్తం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పెద్ద దుమారమే రేగింది. దీంతో ఆలయ అకాధికారులు సెల్‌ఫోన్ వినియోగంపై నిషేధం విధించారు. అమ్మవారి దర్శనానికి వెళ్లే భక్తులు సెల్ ఫోన్‌ను తీసుకురావడం నిషేధమని బోర్డులు ఏర్పాటు చేశారు. ఘాట్ రోడ్డులో ఉన్న క్యూలు, వీఐపీ క్యూలతోపాటు కనకదుర్గ నగర్‌లోని మహామండపంలో ఉన్న క్యూల వద్ద ఈ బోర్డులు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ సెల్‌ఫోన్‌లను వెంటబెట్టుకుని భక్తులు దర్శనానికి వెళ్తున్నారు.
వీఐపీ దర్శనాలతో సమస్య..
ఇంద్రకీలాద్రిపై సాధారణ భక్తులు నిబంధనను పాటిస్తున్నారు. అసలు సమస్య మాత్రం వీఐపీ సిఫార్సులతో (VIP Darshan Guidelines) దర్శనానికి వచ్చిన భక్తులతో ఏర్పడుతుంది. ఇలా సిఫార్సులతో వచ్చిన భక్తులు సమాచార కేంద్రం నుంచి నేరుగా సెల్‌ఫోన్లు తీసుకుని దర్శనాలకు వెళ్తున్నారు. ఫోన్లు చేతుల్లో, జేబుల్లో కనిపించినా దేవస్థాన సిబ్బంది వారికి నిబంధన గురించి చెప్పడం లేదు. ఎవరైనా సెక్యూరిటీ గార్డులు వాటిని గుర్తించి ప్రశ్నిస్తే వారిపై తిరుగుబాటు చేస్తున్నారు. తామంతా వీఐపీ కోటాలో దర్శనాలకు వచ్చామని చెప్పి రుబాబు చేస్తున్నారు.
దీన్ని గమనించిన దేవస్థాన సిబ్బంది లేనిపోని గొడవ ఎందుకని వదిలేస్తున్నారు. సిబ్బందే వదిలేయమని చెప్పడంతో సెక్యూరిటీ గార్డులు ఏమీ చేయలేకపోతున్నారు. ఆదివారం అమ్మవారి దర్శనానికి వచ్చిన ఓ భక్తుడు సెల్‌ఫోన్లో దర్శనానికి వెళ్తున్నాడు. దీన్ని గమనించిన మహిళా సెక్యూరిటీగార్డు అతడిని అడ్డుకుంది. సెల్‌ఫోన్‌ను డిపాజిట్ కౌంటర్లో ఇచ్చిన తర్వాత దర్శనానికి వెళ్లాలని చెప్పింది. దీంతో ఆ భక్తుడు ఆమెపై వీరంగం చేశాడు. వీఐపీ సిఫార్సులతో వచ్చిన భక్తులు ఈ విధంగా చేస్తుండటాన్ని గమనించిన మిగిలిన భక్తులూ సెల్‌ఫోన్‌లను వెంటబెట్టుకుని దర్శనానికి వెళ్తున్నారు. అధికారులు ఒక నిబంధనను అమలు చేస్తున్నా వాటిని పాటించే పరిస్థితుల్లో భక్తులు లేకపోవడం గమనార్హం.
ఈ వార్తలు కూడా చదవండి
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. హై కోర్టుకు సిట్ అధికారులు.. ఎందుకంటే..
కేతిరెడ్డి పెద్దారెడ్డికి షాక్.. అసలు విషయమిదే..
Read Latest Andhra Pradesh News and National News