Share News

Fertilizer Shortage: బ్లాక్ మార్కెట్‌లో యూరియా.. అన్నదాతలకు కష్టాలు

ABN , Publish Date - Aug 12 , 2025 | 11:14 AM

మచిలీపట్నం జిల్లాలో వరినాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే నాట్లు పూర్తి చేసిన పొలాల్లో మొదటి, రెండో కోటాగా రైతులు కాంప్లెక్స్ ఎరువులు వేయాల్సి ఉంది. కాంప్లెక్స్ ఎరువులతో యూరియాను తప్పనిసరిగా కలిపి జల్లితేనే వరిపైరు ఏపుగా ఎదుగుతుంది.

Fertilizer Shortage: బ్లాక్ మార్కెట్‌లో యూరియా.. అన్నదాతలకు కష్టాలు
Fertilizer Problems

» బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతున్న యూరియా

» ఒక్కో బస్తా రూ.420 నుంచి రూ.450 వరకు విక్రయం

» అంతపెట్టి కొనలేమని పీఏసీఎస్‌లకు రైతుల పరుగు

» అక్కడ అరకొరగా సరఫరా.. ఇండెంట్ పెట్టినా రాలేదని సమాధానం

» పెనుమల్లి, బుద్దాలపాలెం పీఏసీఎస్‌ల వద్ద రైతుల ఆందోళన

» ఉన్నతాధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని వినతి

అన్నదాతలను యూరియా కష్టాలు (Urea fertilizer shortage) వెంటాడుతున్నాయి. జిల్లాకు సరఫరా అవుతున్న యూరియాను కొందరు అక్రమార్కులు బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. ఒక్కో బస్తా రూ.420 నుంచి రూ.450 వరకు విక్రయిస్తున్నారు. రూ.266.50లకు విక్రయించాల్సిన బస్తాను ఇంత ధర పెట్టి కొనలేమని రైతులు పీఏపీఎస్‌లకు పరుగులు తీస్తున్నారు. అక్కడ అరకొరగా పంపిణీ చేయడంతో ఇది సరిపోదని సిబ్బందితో వాదనకు దిగుతున్నారు. ఇండెంట్ పెట్టాం వస్తుందని చెప్పడంతో పీఏపీఎస్‌ల వద్దే పడిగాపులు పడుతున్నారు.


రెండు కట్టలే ఇస్తామనడంపై ఆగ్రహం

జిల్లాకు వచ్చిన యూరియాను గుట్టుచప్పుడు కాకుండా బ్లాక్ చేయడంతో రైతులు అధిక ధరలకు బ్లాక్ మార్కెట్‌లో ఒక్కో కట్టను రూ.400, ఆపైన ధరకు కొనుగోలు చేయలేక పీఏసీఎస్‌లకు పరుగులు తీస్తున్నారు. అక్కడ ఒక్కో రైతుకు రెండు కట్టలు మాత్రమే ఇస్తామని చెప్పడంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐదు ఎకరాలకుపైన వ్యవసాయం చేసే రైతులకు రెండు కట్టల యూరియా ఇస్తే ఎలా సరిపెట్టుకోవాలని పీఏసీఎస్ సిబ్బందితో వాదనకు దిగుతున్నారు.


నిరాశలో రైతులు

మచిలీపట్నం మండలంలోని నెలకుర్రు పీఏసీఎస్ పరిదిలో 13 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల పరిధిలో సుమారుగా 10వేల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ పీఏసీఎస్‌కు రైతులు యూరియా కావాలని వెళ్తే ఇండెంట్ పెట్టి చాలా రోజులైందని, ఇంతవరకు రాలేదని అక్కడి వెనుదిరుగుతున్నారు. యూరియా కోసం పీఏసీఎస్ వద్దకు వచ్చిన రైతులకు సమాధానం చెప్పలేకపోతున్నామని, ఇక్కడి డిమాండ్‌కు అనుగుణంగా యూరియాను తమ సొసైటీకి ఇవ్వాలని పీఏసీఎస్ త్రీమెన్ కమిటీ సభ్యులు కోరుతున్నారు.


ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం: జిల్లాలో వరినాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే నాట్లు పూర్తి చేసిన పొలాల్లో మొదటి, రెండో కోటాగా రైతులు కాంప్లెక్స్ ఎరువులు వేయాల్సి ఉంది. కాంప్లెక్స్ ఎరువులతో యూరియాను (Urea) తప్పనిసరిగా కలిపి జల్లితేనే వరిపైరు ఏపుగా ఎదుగుతుంది. మార్క్‌ఫెడ్ ద్వారా ఇప్పటి వరకు జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, రైతు సేవా కేంద్రాలు, రిటైల్ వ్యాపారులకు 10,500 టన్నుల యూరియాను సరఫరా చేశారు. అయినా అందుబాటులో లేదని, గుడివాడలోని గోడౌన్‌కు వ్యాగన్ వస్తేనే ఇస్తామని చెప్పి ఎవరికివారు తప్పించుకుంటున్నారు.


ఇలాంటి పరిస్థితిని ఆసరాగా చేసుకుని వ్యాపారులు, డీలర్లు, హోల్‌సేల్ డీలర్లు, కొందరు రాజకీయ నాయకులు కూడబలుక్కుని యూరియాను బ్లాక్ మార్కెట్‌కు తరలించేశారు. 45కిలోల యూరియా బస్తాను రూ.266.50లకు విక్రయించాల్సి ఉండగా, రూ.420 నుంచి రూ.450 వరకు అమ్ముతున్నారు. జిల్లాకు వచ్చిన యూరియాను ప్రాధాన్యతా క్రమంలో పీఏసీఎస్‌లకు ఇవ్వాలి కానీ పీఏసీఎస్‌లకు ఇచ్చినట్లుగా రికార్డుల్లో లెక్కలు చూపి యూరియాను అక్కడకు పంపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి ఏదైనా పీఏసీఎస్ చైర్ పర్సన్ అధికారులపై ఒత్తిడి తెస్తే ఆ సొసైటీకి యూరియా కొంతమేర ఇచ్చి సరిపెడుతున్నారు. మిగిలిన సొసైటీల సిబ్బంది, చైర్ పర్సన్లు యూరియా కోసం ఇండెంట్ పెట్టామని, ఇవ్వాలని అడిగితే త్వరలో గుడివాడలోని గోడౌన్‌కు వ్యాగన్ వస్తుందని, అప్పుడు యూరియాను పంపుతామని చెప్పి సరిపెడుతున్నారు.


పోలీసుల రంగ ప్రవేశం

పెడన మండలం పెనుమల్లి పీఏసీఎస్ యూరియా అందుబాటులో ఉందనే సమాచారంతో రైతులు పెద్దఎత్తున అక్కడకు సోమవారం చేరుకున్నారు. రెండు కట్టలకు మించి ఇవ్వబోమని పీఏసీఎస్ సిబ్బంది చెప్పడంతో రైతులు తిరగబడ్డారు. ఎక్కువ పొలం సాగుచేసే రైతులకు అవసరమైనంత యూరియాను ఇవ్వాలని పట్టుబట్టారు. దీంతో అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. రైతులు యూరియా కోసం ఆందోళనకు దిగుతున్నారనే సమాచారంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. రైతుల వద్ద ఉన్న పత్రాల ఆధారంగా చేసుకుని వారిని క్యూలో నిలబెట్టి మరీ యూరియాను విక్రయించేలా ఏర్పాట్లు చేశారు.


బుద్దాలపాలెంలో రైతుల మధ్య వాగ్వాదం

మచిలీపట్నం మండలం బుద్దాలపాలెం పీఏసీఎస్ వద్ద రైతులు యూరియా కోసం సోమవారం బారులు తీరారు. బుద్దాలపాలెం సొసైటీ పరిధిలోని బుద్దాలపాలెం, బొర్రబోతు పాలెంలోని రైతులకు ముందుస్తుగా యూరియాను విక్రయించి, ఆ తర్వాత యూరియా మిగిలితే పక్కగ్రామాల రైతులకు విక్రయించాలని స్థానిక రైతులు షరతు పెట్టారు. దీంతో యూరియా కోసం ఆయా గ్రామాల నుంచి తరలివచ్చిన రైతులకు, స్థానిక రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పీఏసీఎస్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీలో క్రీడల అభివృద్ధి లబ్ధిదారులు లేరు

ముందస్తు బెయిల్‌కు సురేశ్‌బాబు అనర్హుడు

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Aug 12 , 2025 | 11:24 AM