Share News

Supreme Court: ముందస్తు బెయిల్‌కు సురేశ్‌బాబు అనర్హుడు

ABN , Publish Date - Aug 12 , 2025 | 07:02 AM

తెలుగుదేశం పార్టీ ఒంగోలు నేత వీరయ్య చౌదరి హత్య కేసులో ప్రధాన నిందితుడు సురేశ్‌ బాబుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. అతనికి ముందస్తు బెయిల్‌ ఇవ్వడానికి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది.

Supreme Court: ముందస్తు బెయిల్‌కు సురేశ్‌బాబు అనర్హుడు

  • వీరయ్య చౌదరి హత్య కేసు ప్రధాన నిందితుడికి చుక్కెదురు

  • ఆయన పాత్రపై తగిన ఆధారాలున్నాయి: సుప్రీంకోర్టు

  • బెయిల్‌ పిటిషన్‌ డిస్మిస్‌ చేసిన ధర్మాసనం

న్యూఢిల్లీ, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ ఒంగోలు నేత వీరయ్య చౌదరి హత్య కేసులో ప్రధాన నిందితుడు సురేశ్‌ బాబుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. అతనికి ముందస్తు బెయిల్‌ ఇవ్వడానికి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ కేసులో సురేశ్‌ బాబు పాత్రకు సంబంధించి పోలీసుల వద్ద ఆధారాలు ఉన్నాయని, ఆయన ముందస్తు బెయిల్‌కు అనర్హుడని స్పష్టం చేసింది. నాగులుప్పలపాడుకు చెందిన టీడీపీ నేత, మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరిని ఒంగోలులోని ఆయన కార్యాలయంలో ఏప్రిల్‌ నెలలో హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు సురేశ్‌ బాబు తనకు ముందుస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ జూలై 27న సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై సోమవారం జస్టిస్‌ రాజేష్‌ బిందాల్‌, జస్టిస్‌ మన్మోహన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. వీరయ్య చౌదరి హత్య కేసులో ఇప్పటికే తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారని, సురేశ్‌ బాబు పరారీలో ఉన్నారని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. వాదనల అనంతరం.. డబ్బులు చేతులు మారడం, ఫోన్‌ కాల్స్‌తో సహా తగినన్ని ఆధారాలు ఉన్నాయని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసులో మిగిలిన నిందితులకు రెగ్యులర్‌ బెయిల్‌ వచ్చిందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది చెప్పారు. అలాగేతే.. కింది కోర్టులోనే బెయిల్‌ తెచ్చుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను డిస్మిస్‌ చేసింది.

Updated Date - Aug 12 , 2025 | 07:06 AM