Share News

Amaravati Real Estate: ఏవీ నాటి కళకళలు

ABN , Publish Date - Aug 12 , 2025 | 07:25 AM

వైసీపీ సర్కారు అమరావతి’ని ఆపేసి... అంతటితో ఊరుకోలేదు. ఈ ప్రాంతంపై కక్ష కట్టినట్టు వ్యవహరించింది. కోట్ల రూపాయల ప్రజాధనంతో వేసిన రాజధాని రోడ్లనే తవ్వేస్తున్నా... చూస్తూ’ ప్రోత్సహించింది.

Amaravati Real Estate: ఏవీ నాటి కళకళలు

  • అమరావతిలో ‘రియల్‌’ స్తబ్ధతకు అనేక కారణాలు

  • భారీగా పెరిగిన ప్లాట్ల ధరలతో బయ్యర్ల వెనుకంజ

  • వేచి చూసే ధోరణిలో కొనుగోలుదారులు

  • తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన ‘నగదు’ సరఫరా ఎఫెక్ట్‌

  • లేఅవుట్లు అభివృద్ధి చేస్తే పరిస్థితి మారే అవకాశం

  • వెస్ట్‌ బైపాస్‌ వెంటనే అందుబాటులోకి తేవాలి

2019 ఎన్నికలకు ముందు...

రాజధాని ప్రాంతంలో ఎటు చూసినా కోలాహలం! సంచుల్లో డబ్బులు మోసుకొచ్చి... గజాల్లో స్థలాలు కొంటున్న జనం! రాజధాని గ్రామాల్లో ఏ దారిలో చూసినా జనాలు, వాహనాలు! ఎక్కడికక్కడ పుట్టుకొచ్చిన హోటళ్లు! ఆ టేబుళ్లపై రియల్‌ ఎస్టేట్‌ ముచ్చట్లు! ఒకే సిట్టింగ్‌లో కోట్లకొద్దీ డీల్స్‌! మంగళగిరి, మందడం, తుళ్లూరు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు నిత్యం కిటకిటే! వైసీపీ సర్కారు వచ్చింది. అమరావతి అటకెక్కింది. అంతా స్తబ్దతే!

మరి ఇప్పుడు...

ప్రభుత్వం మారింది. కూటమి సర్కారు మళ్లీ రాజధానిపై దృష్టి సారించింది. ఇప్పటికి 15 నెలలు దాటింది. అయినా సరే... నాటి కళకళలు, గలగలలు మాత్రం రాజధానిలో కనిపించడంలేదు. 2014-19 నాటి రియల్‌బూమ్‌ కమ్మేస్తుందన్న అంచనాలు తప్పాయి. విచిత్రమేమిటంటే... అంతకుముందున్నంత ధరలూ లేవు. కొనేవారు కనిపించడంలేదు.

(మంగళగిరి - ఆంధ్రజ్యోతి)

వైసీపీ సర్కారు ‘అమరావతి’ని ఆపేసి... అంతటితో ఊరుకోలేదు. ఈ ప్రాంతంపై కక్ష కట్టినట్టు వ్యవహరించింది. కోట్ల రూపాయల ప్రజాధనంతో వేసిన రాజధాని రోడ్లనే తవ్వేస్తున్నా... ‘చూస్తూ’ ప్రోత్సహించింది. 2019కు ముందు హైకోర్టు, సచివాలయం ప్రాంతంలో గజం రూ.50వేలకు పైగా పలికిన ప్లాట్ల ధరలు జగన్‌ హయాంలో పాతాళానికి పడిపోయాయి. 2024లో ప్రభుత్వం మారడంతో అమరావతి రైతులు, ప్లాట్లు కొనుగోలు చేసిన వారిలో ఉత్సాహం రెట్టింపయ్యింది. 2014-19 మధ్య గరిష్ఠంగా రూ.50వేలు పలికిన గజం ధర... కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఏకంగా రూ.70వేలకు పెంచేశారు. ఎర్రబాలెం, నవులూరు ప్రాంతాలలో 2014-19లో గజం గరిష్ఠంగా రూ.35 వేలు పలుకగా జగన్‌ హయాంలో రూ.15వేలకు కూడా అడిగే దిక్కులేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం రాజధానిలో మళ్లీ పనులు మొదలుపెట్టాక... ధరను రూ. 55వేల వరకు తీసుకెళ్లారు.


తొలి పదినెలలు బాగానే సందడి కనిపించింది. ఆ తర్వాత... ప్లాట్ల ధరలు అనూహ్యంగా పెరిగిపోవడంతో కొనుగోలుదారులు ముందుకు రావడంలేదనే అభిప్రాయం నెలకొంది. ‘మళ్లీ జగన్‌ వస్తే ఎలా?’ అని ఏ మూలనో ఒక ఆందోళన ఉందని... అందుకే బయ్యర్లు వేచి చూస్తున్నారని చెబుతున్నారు. మరోవైపు.. తెలుగు రాష్ట్రాల్లో ‘క్యాష్‌ ఫ్లో’ తగ్గిందని.. దీంతో భారీగా పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రావడంలేదని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ప్రభావం అమరావతిపైనా పడింది.

చిన్న ప్లాట్లకే ‘పరిమితం’

ప్రస్తుతానికి రాజధాని అమరావతిలో ప్లాట్ల క్రయవిక్రయాలు చాలా నెమ్మదించాయి. 150, 200 గజాల నివాస ప్లాట్లు, 80, 90 గజాల వాణిజ్య ప్లాట్లు... అదీ అడపాదడపా విక్రయాలు జరుగుతున్నాయి. పెద్ద ప్లాట్ల జోలికైతే ఎవరూ వెళ్లడం లేదు.


వెస్ట్‌ బైపాస్‌ మీదే ఆశలన్నీ

అనేకానేక కారణాల వల్ల రాజధానిలో భూముల ధరలు తగ్గాయి. రాజధానిలోని అన్నీ ప్రాంతాల్లో సుమారుగా గజానికి రూ.15 వేల వంతున ధరలు పడిపోయాయి. వెస్ట్‌ బైపాస్‌ ప్రారంభమైతే మళ్లీ ధరలు పెరుగుతాయని ఆశపడుతున్నాం. అలాగే నవ నగరాల నిర్మాణంపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలి.

- వెలిమిచర్ల శివన్నారాయణ, యర్రబాలెం


ఇవి చేస్తే మునుపటి కళ...

  • రిటర్నబుల్‌ ప్లాట్ల లేఅవుట్ల అభివృద్ధి పనులు తక్షణం ప్రారంభించాలి. రూ.29వేల కోట్ల వ్యయంతో 26 వెంచర్లలో లేఅవుట్ల అభివృద్ధికి టెండర్లను ఖరారు చేసినప్పటికీ ఏవో కారణాలతో ఆయా పనులు ప్రారంభం కాకుండా వాయిదాలు పడుతూ ఉన్నాయి.

  • సీడ్‌ యాక్సెస్ రోడ్డు రెండో దశ పనుల్లో ఆశించినంత వేగం కానరావడం లేదు. ఈ పనులు వెంటనే చేపట్టాలి.

  • రాజధాని ప్రాంతంలో వున్న కృష్ణా కరకట్ట రోడ్డును నాలుగులేన్ల రహదారిగా విస్తరించాల్సిన పనులను మొదలుపెట్టాలి.

  • విజయవాడ పశ్చిమ బైపా్‌సను వీలైనంత త్వరగా అందుబాటులోకి తేవాలి. దీనివల్ల రాజధానితో రెండు హైవేల అనుసంధానం జరుగుతుంది.

  • ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల కార్యకలాపాలు... కార్యాలయాల నిర్మాణాలు త్వరగా మొదలయ్యేలా చర్యలు తీసుకోవాలి.

Updated Date - Aug 12 , 2025 | 07:25 AM