NTR District Achieves World Book of Records: ఎకో ఫ్రెండ్లీ గణేష్ తయారీలో.. ఎన్టీఆర్ జిల్లా వరల్డ్ రికార్డ్
ABN , Publish Date - Aug 26 , 2025 | 12:25 PM
ఎకో ఫ్రెండ్లీ వినాయక తయారీలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ నెలకొల్పినందుకు విజయవాడ ప్రజలకు శుభాకాంక్షలు చెబుతున్నామని ఎంపీ కేశినేని చిన్ని పేర్కొన్నారు. నగర ప్రజల కృషితోనే సెవన్ స్టార్ రేటింగ్ వచ్చిందని చెప్పుకొచ్చారు. అధికారులు చాలా బాగా పనిచేస్తున్నారని ప్రశంసించారు.
విజయవాడ: ఎకో ఫ్రెండ్లీ వినాయక (Eco Friendly Vinayaka) తయారీలో ఎన్టీఆర్ జిల్లా (NTR District) యంత్రాంగం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ (World Book of Records) నెలకొల్పింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
అధికారులు చాలా బాగా పనిచేస్తున్నారు: ఎంపీ కేశినేని చిన్ని

ఈ సందర్భంగా విజయవాడ ఎంపీ శివనాథ్ (చిన్ని) మీడియాతో మాట్లాడారు. ఎకో ఫ్రెండ్లీ వినాయక తయారీలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ నెలకొల్పినందుకు విజయవాడ ప్రజలకు శుభాకాంక్షలు చెబుతున్నామని ఎంపీ కేశినేని చిన్ని పేర్కొన్నారు. నగర ప్రజల కృషితోనే సెవన్ స్టార్ రేటింగ్ వచ్చిందని చెప్పుకొచ్చారు. అధికారులు చాలా బాగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. మంత్రి నారా లోకేష్ గణేష్ మండపాలకు ఉచితంగా కరెంట్ ఇచ్చారని, విజయవాడ సీపీ ఉచితంగా డీజే పర్మిషన్ ఇవ్వాలని కోరారు. దసరాకు కూడా 11 రోజులు ఒక మంచి కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు. 2047 వికసిత భారత్ దిశగా అడుగులు వేద్దామని ఎంపీ కేశినేని చిన్ని ఉద్ఘాటించారు.
గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్: మంత్రి సత్యకుమార్ యాదవ్

బాద్రపద శుద్ధ చవితి నాడు మనం వినాయక చవితి జరుపుకుంటామని ఎన్టీఆర్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రకృతి మెచ్చేలా గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని సూచించారు. సర్వ విజ్ఞాలకు అధిపతి వినాయకుడు అని ఉద్ఘాటించారు. ప్రజలు అందరూ అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న జిల్లా యంత్రాంగానికి ధన్యవాదాలు తెలిపారు. 5వేల విగ్రహాలు తయారు చేయటం, అందులో కుమ్మరి సోదరులను కలుపుకోని పోవడం మంచి పరిణామమని ప్రశంసించారు మంత్రి సత్యకుమార్ యాదవ్.
ఎలాంటి రుసుం లేకుండా మండపాలకు ఉచిత విద్యుత్‌ను తమ ప్రభుత్వం అందజేస్తోందని ప్రకటించారు. 21 రకాల పత్రులతో వినాయకుడికి పూజలు చేస్తామని.. వాటిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని వివరించారు. ఈ మధ్య ప్లాస్టిక్ వచ్చి ప్రకృతి విధ్వంసం జరుగుతోందని చెప్పుకొచ్చారు. అందుకనే మన పాత కాలం మాదిరిగా ప్రకృతిలో దొరికే వాటితోనే పూజించాలని కోరారు. గణేష్ ఉత్సవాల్లో డీజే కచ్చితంగా ఉండాలని... కానీ స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. వినాయక మండపాల్లో అభ్యంతరకర పాటలు పెట్టకూడదని షరతు విధించారు. వినాయకుడి అవయవాల్లో ఒక్కొక్క దానికి ఒక్కో విశిష్ట ఉంటుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ వివరించారు.
ప్రకృతి కాపాడటం మన బాధ్యత: బోండా ఉమామహేశ్వరరావు

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ శా ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రశంసించారు. రికార్డులు విషయం పక్కన పెడితే ప్రకృతి కాపాడటం మన బాధ్యత అని ఉద్ఘాటించారు. గత 15 ఏళ్ల నుంచి ప్రజల్లో కొంత చైతన్యం వస్తోందని తెలిపారు. కోర్టులు చెప్పాయి, పోలీసులు చెప్పారు... కానీ ప్రతి ఒక్కరిలో చైతన్యం వస్తేనే మార్పు వస్తోందని పేర్కొన్నారు. తమ చిన్నప్పడు చెరువుల నుంచి మట్టి తీసుకొని వచ్చి విగ్రహాలను తయారు చేసే వాళ్లమని గుర్తుచేశారు. మళ్లీ నిమజ్జనం చెరువుల్లో చేసే వాళ్లమని... మనం ఆ నీళ్లే తాగాలని సూచించారు. అందుకే ప్రకృతిలో కలిసిపోయే వస్తువులతోనే వినాయక విగ్రహాలు తయారు చేయాలని బోండా ఉమామహేశ్వరరావు కోరారు.
పర్యావరణం కాపాడటమే ప్రధాన ఉద్దేశం: కలెక్టర్ లక్ష్మీ శా
మట్టి విగ్రహం తయారీకి వచ్చిన విద్యార్థులకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ శా ఆశీస్సులు అందించారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్‌కి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. స్వర్ణాంధ్రలో భాగంగా పొల్యూషన్ లేని వినాయక విగ్రహాలను పూజించటం మంచిదని సూచించారు. ఇక్కడ తయారు చేసిన ప్రతి గణేష్ విగ్రహంలో ఒక విత్తనం ఉంటుందని చెప్పుకొచ్చారు. నిమజ్జనం చేసిన తర్వాత మొక్క వస్తుందని.. పర్యావరణం కాపాడటమే తమ ప్రధాన ఉద్దేశమని.. ఇది ఒక మంచి ప్రయత్నమని ఉద్ఘాటించారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమాలు మరిన్ని చేయాలని కలెక్టర్ లక్ష్మీ శా సూచించారు.
డీజేలు తక్కువగా వినియోగించాలి:సీపీ రాజశేఖర్ బాబు
పర్యావరణం కాపాడాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైన ఉందని విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు తెలిపారు. పొల్యూషన్ ధ్వని కాలుష్యం కూడా ఈ సారి తగ్గిస్తారని భావిస్తున్నానని పేర్కొన్నారు. ఈసారి ఎలాంటి రుసుం లేకుండా గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్‌కు అనుమతి ఇచ్చామని స్పష్టం చేశారు. ఈసారి గణేష్ ఉత్సవాల్లో డీజేలు తక్కువగా వినియోగించాలని సీపీ రాజశేఖర్ బాబు సూచించారు.
ప్రకృతి ప్రసాదించిన వస్తువులతోనే వినాయకుడిని పూజించాలి: కృష్ణయ్య
ప్రకృతి ప్రేమికులు అందరూ రానున్న వినాయక చవితినీ ప్రకృతి ప్రసాదించిన వస్తువులతోనే పూజించాలని ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కృష్ణయ్య సూచించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో మనకి రెండు పెద్ద నగరాలు ఉన్నాయని.. ఆ రెండు నగరాల్లో ఎయిర్ పొల్యూషన్ ఎక్కువగా ఉందని చెప్పుకొచ్చారు. విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న ఆటోనగర్ నుంచి ఎక్కువగా పొల్యూషన్ వస్తోందని తెలిపారు. దానికి ప్రత్యామ్నాయం చూస్తే బావుంటుంది అని ప్రభుత్వాన్ని కోరారు. పాఠశాలల్లో విద్యార్థులు ఎక్కువగా ప్లాస్టిక్ బాక్సులోనే భోజనం తింటున్నారని.. ముందుగా పిల్లల నుంచి మార్పు రావాలని కృష్ణయ్య కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్‌కు హైకోర్టులో ఎదురు దెబ్బ
ఫోన్‌లో ఆర్డర్ చేస్తే గంజాయి డెలివరీ
For More AP News And Telugu News