Share News

Nandamuri Balakrishna Visit to Nimmakuru: నాకు పదవులు ముఖ్యం కాదు... బాలయ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ABN , Publish Date - Sep 04 , 2025 | 11:19 AM

పదవులు ముఖ్యం కాదని... వాటికే తాను అలంకారమన్నది తన భావనని సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఉద్ఘాటించారు. మంచి ఉద్దేశంతో అఖండ- 2 మూవీ తీశామని చెప్పుకొచ్చారు. కులాలకు ఆపాదించకుండా హైందవ ధర్మానికి ప్రతిరూపంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని బాలకృష్ణ పేర్కొన్నారు.

Nandamuri Balakrishna Visit to Nimmakuru: నాకు పదవులు ముఖ్యం కాదు... బాలయ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Nandamuri Balakrishna Visit to Nimmakuru

గుడివాడ, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో అంతర్జాతీయ వైద్య సేవలు అందిస్తున్నామని సినీ హీరో, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఉద్ఘాటించారు. తన సంతోషాన్ని గ్రామస్తులతో పంచుకోవాలని నిమ్మకూరుకు వచ్చానని చెప్పుకొచ్చారు. ఎక్కడ ఉన్నా తెలుగు వారంతా ఒక్కటే అన్నది తన తండ్రి ఎన్టీఆర్ భావన అని.. తన ఆలోచన కూడా అదేనని నొక్కిచెప్పారు నందమూరి బాలకృష్ణ.


దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు స్వగ్రామం నిమ్మకూరులో నందమూరి బాలకృష్ణ ఇవాళ(గురువారం) సందడి చేశారు. ఈ క్రమంలో ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు నివాళులు అర్పించారు. సినీ ప్రస్థానంలో 50 ఏళ్లు పూర్తిచేసుకుని, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న అనంతరం నిమ్మకూరులో బాలయ్య పర్యటించారు. గార్డ్ ఆఫ్ హానర్‌తో గురుకుల పాఠశాల విద్యార్థులు ఆయనకు స్వాగతం పలికారు. బాలయ్యకు నిమ్మకూరు ఆడపడుచులు మంగళ హారతులు ఇచ్చారు. ఈ సందర్భంగా బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


వారి సహకారం మరువలేనిది...

‘పద్మభూషణ్, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించడం నేను అదృష్టంగా భావిస్తున్నా. నా వరుస సినీ విజయాలను.. ప్రజల విజయాలుగా భావిస్తున్నా. పదవులు నాకు ముఖ్యం కాదు... వాటికే నేను అలంకారమన్నది నా భావన. ఈ విజయాలను నా తల్లిదండ్రులకు అంకితం చేస్తున్నా. తండ్రైన, గురువైన, దేవుడైన నాకు అన్నీ ఎన్టీఆరే. పాత్రలకు ప్రాణం పోస్తూ నటించిన ఎన్టీఆర్ దరిదాపులకు చేరాలన్నదే నా తపన. ఎన్టీఆర్ ఉన్నత స్థితికి రావడానికి... నా తల్లి బసవతారకం చేసిన త్యాగాలు, అందించిన సహకారం మరువలేనిది. హిందూపురం ఎమ్మెల్యేగా, రాయలసీమను నా అడ్డాగా భావిస్తా’ అని నందమూరి బాలకృష్ణ ఉద్ఘాటించారు.


హిందూపురంలో తాగునీటి సమస్య పరిష్కారం..

‘దృఢ సంకల్పం ఉంటే భగీరథులు కావచ్చని... రాయలసీమకు నీటిని ఇచ్చి సీఎం చంద్రబాబు నిరూపించారు. హిందూపురంలో తాగునీటి సమస్యను పరిష్కరించడం సంతోషంగా ఉంది. నాడు ఎన్టీఆర్, నేడు నేను ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నేడు భౌగోళికంగా ప్రాధాన్యత సంతరించుకుంది. సందేశం ఉండాలన్న లక్ష్యంతో నేను ప్రతి సినిమా చేస్తున్నా. వరదలతో తెలంగాణ రాష్ట్రంలో చాలామంది నష్టపోయారు. అన్నదాతలు విలవిలలాడుతున్నారు. తెలుగు వారికి ఎక్కడ ఇబ్బంది వచ్చినా పరస్పరం సహకరించుకుంటూ అండగా ఉండాలి. అపజయాల్లో ప్రాంతాలకు అతీతంగా తోడుగా ఉన్న అభిమానులకు ధన్యవాదాలు. సోషల్ మీడియా వల్ల ప్రపంచం కుదించుకుపోయింది. సోషల్ మీడియాను మంచికి వాడండి... వినాశనానికి వద్దు. మంచి ఉద్దేశంతో అఖండ- 2 చిత్రం తీశాం. కులాలకు ఆపాదించకుండా హైందవ ధర్మానికి ప్రతిరూపంగా తెరకెక్కించాం’ అని నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

జీఎస్టీ సంస్కరణలు దేశానికి నిజమైన దీపావళి.. పవన్ ప్రశంసలు

Read Latest Andhra Pradesh News and National News

Updated Date - Sep 04 , 2025 | 01:08 PM