Share News

Venkaiah Naidu: కొన్ని అగ్ర దేశాల బెదిరింపులకు మనం భయపడేది లేదు:వెంకయ్య నాయుడు

ABN , Publish Date - Aug 07 , 2025 | 11:20 AM

సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఉన్న సవాళ్లను ఎదుర్కొనేలా మీ మేథస్సుతో పని చేయాలని భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు మార్గనిర్దేశం చేశారు. త్వరలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వస్తోందని.. వాటి‌పై మనం‌ పూర్తి అవగాహన పెంచుకోవాలని సూచించారు. మన సాంకేతికతను ఉపయోగించి మంచి పంటలు పండేలా చేయాలని వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు.

Venkaiah Naidu: కొన్ని అగ్ర దేశాల బెదిరింపులకు మనం భయపడేది లేదు:వెంకయ్య నాయుడు
Muppavarapu Venkaiah Naidu

కృష్ణా, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ ఆర్థిక అభివృద్ధిలో భారతదేశం నాలుగో స్థానంలో ఉందని.. త్వరలోనే మూడో స్థానానికి చేరుతుందని భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు (Muppavarapu Venkaiah Naidu) ఉద్ఘాటించారు. చదువుతో ‌పాటు డిగ్రీ సంపాదించడమే కాదని.. సంస్కారం, విజ్ఞానం సంపాదించడం ముఖ్యమని వ్యాఖ్యానించారు. భావితరాలు ఈ అంశాలను గుర్తుపెట్టుకోవాలని దిశానిర్దేశం చేశారు. విద్యార్థులకు సంస్కారంతో ఉండేలా అలవాటు చేయాలని సూచించారు. విద్యాలయం, గ్రంథాలయం, సేవాలయం ఉండేలా చూడాలని ఆకాంక్షించారు వెంకయ్య నాయుడు.


ఇవాళ(గురువారం) కృష్ణా జిల్లాలోని ఉషారామ ఇంజనీరింగ్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకయ్య నాయుడు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సుంకర రామబ్రహ్మం, సుంకర అనిల్, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు, కళాశాల ‌విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు డిగ్రీ సర్టిఫికేట్‌లను వెంకయ్య నాయుడు అందజేశారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు ప్రసంగించారు. కళాశాలలు, యూనివర్శిటీలకు వెళ్లి ప్రసంగించే కార్యక్రమాలను తాను పెట్టుకున్నానని చెప్పుకొచ్చారు. తాను పదవీ విరమణ చేశానే కానీ.. పెదవీ విరమణ చేయలేదని సరదాగా వ్యాఖ్యానించారు. ఉషారామ విద్యార్థులు అంటే ఎక్కడికి వెళ్లినా గొప్పగా చెప్పుకోవాలని మార్గనిర్దేశం చేశారు.16 ఏళ్లుగా ఉషారామ ఇంజనీరింగ్ కళాశాలలో మంచి‌ విద్యను బోధిస్తున్నారని ప్రశంసించారు వెంకయ్య నాయుడు.


దేశ భవిష్యత్తు గురించి నేటి తరానికి‌ చెప్పాలనేదే తన సంకల్పమని పేర్కొన్నారు. డిగ్రీ పట్టాలు అందుకున్న ఈరోజు జీవితంలో మరచిపోలేని రోజని నొక్కిచెప్పారు. ప్రపంచంలో నేడు మన దేశం వేగవంతంగా అభివృద్ధి చెందుతోందని చెప్పుకొచ్చారు. కొన్ని అగ్రదేశాల బెదిరింపులకు మనం భయపడేది లేదని హెచ్చరించారు. మన‌ పంచభూతాలను మనం గౌరవిస్తే.. అవి మనల్ని కాపాడతాయని ఉద్ఘాటించారు. మన తెలివిని దోచుకుని.. వారి గురించి గొప్పగా బ్రిటిష్ వారు చెప్పుకున్నారని తెలిపారు. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత మన తెలివి తేటలతో మనం సొంతంగా ఎదిగామని నొక్కిచెప్పారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతావనిలో మనం అమృత కాలంలో ఉన్నామని గుర్తుచేసుకున్నారు వెంకయ్య నాయుడు.


నేటి తరం అంతా మన దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు. భారతదేశం ఎప్పుడూ ఏ దేశం మీద దండయాత్ర చేయలేదని స్పష్టం చేశారు. మన మూలాలు దెబ్బ తీయడానికే గతంలో చాలా కుట్రలు చేశారని విమర్శించారు. మన సంస్కృతిని నిర్వీర్యం చేయాలని చూశారని ధ్వజమెత్తారు. వాటిని మనం తట్టుకుని, నిలదొక్కుకుని నేడు నిలబడ్డామని ఉద్ఘాటించారు. నేడు మనకు ఎన్ని అవకాశాలు ఉన్నాయో... అన్ని సవాళ్లు కూడా ఎదురవుతున్నాయని వెల్లడించారు. ప్రతి పాఠశాల, కళాశాలల్లో విద్యార్థులకు ఐక్యతతో ఉండేలా చూడాలని సూచించారు. కుల, మత, ప్రాంత బేధాలు ఉండకూడదని కోరారు. కన్నతల్లిని, పుట్టిన ఊరుని, పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులను ఎప్పటికీ మరువకూడదని సూచించారు. ఎంత ఉన్నత స్థానానికి‌ వెళ్లినా నీ ఊరును మరచిపోకుడదని మార్గ నిర్దేశం చేశారు వెంకయ్య నాయుడు.


నీకంటే ఆర్థికంగా బలహీనంగా ఉన్న వారిని చేతనైనంతలో చేయూతను ఇవ్వాలని వెంకయ్య నాయుడు సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఉన్న సవాళ్లను ఎదుర్కొనేలా మీ మేథస్సుతో పని చేయాలని మార్గనిర్దేశం చేశారు. త్వరలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వస్తోందని.. వాటి‌పై మనం‌ పూర్తి అవగాహన పెంచుకోవాలని సూచించారు. మన సాంకేతికతను ఉపయోగించి మంచి పంటలు పండేలా చేయాలని ఆకాంక్షించారు. అన్నదాతలు నేడు చాలా నష్టపోతున్నారని.. ఇంజనీర్లు వ్యవసాయ రంగంపై దృష్టి పెట్టాలని దిశానిర్దేశం చేశారు. మానవాళి ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కనుగొనే దిశగా మన పని తీరు ఉండాలని దిశా నిర్దేశం చేశారు. ఎవరికీ వారు సొంతంగా కాళ్లపై నిలబడేలా చిన్న పరిశ్రమలు అయినా నెలకొల్పాలని పేర్కొన్నారు. కేవలం ఉద్యోగం కోసమే అన్వేషిస్తూ ఆగిపోవద్దని వెంకయ్య నాయుడు సూచించారు.


తెలుగు భాషలోనే మాట్లాడాలి..

మాతృభాషపై వెంకయ్య నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘సెల్‌ఫోన్ ఎక్కువగా వాడితే... మన‌ మైండ్ సెల్‌లోకి వెళ్లినట్లే. పిల్లలు సృజనాత్మక శక్తితో పని‌చేయడం మానేశారు. ఆలోచన శక్తి అనేది లేకపోవడం ఆందోళన కలిగిస్తుంది. ఇప్పుడు ఏది అడిగినా గూగుల్ అంటున్నారు.. మాతృభాషలోనే విద్య ఉండాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్ణయం తీసుకున్నారు. మాతృభాషలో ఉన్న మధురత్వం ఎందులోనూ లేదు. మన తెలుగు వారంతా తెలుగు భాషలోనే మాట్లాడాలి. గుడ్ మార్నింగ్‌లు వద్దు... నమస్కారం.. మన సంస్కారం. ఫస్ట్ మదర్ టంగ్, తర్వాత బ్రదర్ టంగ్, మూడోది ఆంగ్ల భాష. రాంనాధ్ కోవింద్ హిందీలో‌ చదివారు, నేను తెలుగులో చదివాను, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ తెలుగులో చదివే ఎదిగారు. ఏ భాషలో చదివామని కాదు..‌ విషయ పరిజ్ఞానం పెంచుకుని ఇక్కడ వరకు వచ్చాం. ఏ భాషను బలవంతంగా రుద్దకూడదు.. ఏ భాషను మనం వ్యతిరేకించకూడదు. ప్రతిరోజూ నడక, వ్యాయామం, యోగా చేయడం ముఖ్యం. పిజ్జాలు, బర్గర్లు తినడం ద్వారా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. మన సంప్రదాయ భోజనం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మన‌ ఇడ్లీ, మన దోశ, మన‌ సాంబారు, గుంటూరు కారం ప్రపంచంలో ఫేమస్ అయ్యాయి. మన ఆహారపు అలవాట్లు వదలకుండా అమలు‌ చేయండి. యోగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోసం‌ కాదు.. మన బాడీ కోసం అనేది తెలుసుకోండి. మన తల్లిదండ్రులను గౌరవించండి.. బామ్మ, తాతయ్యలతో కాసేపు గడపండి’ అని వెంకయ్య నాయుడు దిశా నిర్దేశం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

Fire Accident: ఏపీలో అనుకోని ప్రమాదం... అప్రమత్తమైన అధికారులు

CM Chandrababu: మంగళగిరిలో సీఎం చంద్రబాబు పర్యటన.. మూడు పథకాలకు శ్రీకారం

For More AP News and Telugu News

Updated Date - Aug 07 , 2025 | 11:40 AM