Share News

Srushti Fertility Center  Scam: విజయవాడలో డాక్టర్లు, దళారుల చెలామణీ.. వెలుగులోకి సృష్టి సెంటర్ లింకులు

ABN , Publish Date - Aug 10 , 2025 | 08:25 AM

సృష్టి సంతాన సాఫల్య కేంద్రం అధినేత డాక్టర్ పచ్చిపాల నమ్రత కేసులో పిల్లల విక్రయాల్లో దళారులుగా వ్యవహరించిన ముగ్గురిని, విశాఖపట్నంలోని కేజీహెచ్‌లో అనస్థీషియా వైద్యుడు వాసుపల్లి రవిని, పిడి యాట్రిక్ విభాగ వైద్యురాలు ఉషాదేవిని గోపాలపురం పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నిరుపేదల కుటుంబాలను టార్గెట్ చేసుకుని వారి నుంచి పిల్లలను కొన్న వ్యవహారంలో వీరు అరెస్టయ్యారు.

Srushti Fertility Center  Scam: విజయవాడలో డాక్టర్లు, దళారుల చెలామణీ.. వెలుగులోకి సృష్టి సెంటర్ లింకులు
Srushti Fertility Center  Scam

» సమస్యలు సృష్టించిందెవరు?

» సృష్టి సంతాన సాఫల్య కేంద్రం కేసులో విజయవాడ మూలాలు

» ఆరా తీస్తున్న గోపాలపురం పోలీసులు

» నవజాత శిశువులను విక్రయించే ముఠాలతో లింకులు?

» పిల్లలు తీసుకొచ్చి ఇచ్చిన వారికి రూ.లక్షల నజరానా

» నగరంలోని ప్రైవేట్ డాక్టర్లతో తెరచాటు వ్యవహారాలు

» నమ్రత అరెస్టుతో అజ్ఞాతంలోకి..

సరోగసి పేరుతో సర్వం దోచుకుని కాసులు వెనుకేసుకున్న సృష్టి సంతాన సాఫల్య కేంద్రం అధినేత డాక్టర్ పచ్చిపాల నమ్రత కేసులో విజయవాడకు లింకులు ఉన్నాయా? పిల్లలను విక్రయించే ముఠాలతో ఆమె సత్సంబంధాలు నడిపారా? వైద్యుల్లో కొందరు నమ్రతకు కేసులను అప్పగించారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. నమ్రత కేసులో తవ్వేకొద్దీ సంచలనాలు బయటకు వస్తున్నాయి.


(ఆంధ్రజ్యోతి-విజయవాడ): సృష్టి సంతాన సాఫల్య కేంద్రం (Srushti Fertility Center  Scam) అధినేత డాక్టర్ పచ్చిపాల నమ్రత (Doctor PachiPala Namratha) కేసులో పిల్లల విక్రయాల్లో దళారులుగా వ్యవహరించిన ముగ్గురిని, విశాఖపట్నంలోని కేజీహెచ్‌లో అనస్థీషియా వైద్యుడు వాసుపల్లి రవిని, పిడి యాట్రిక్ విభాగ వైద్యురాలు ఉషాదేవిని గోపాలపురం పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నిరుపేదల కుటుంబాలను టార్గెట్ చేసుకుని వారి నుంచి పిల్లలను కొన్న వ్యవహారంలో వీరు అరెస్టయ్యారు. విజయవాడకు చెందిన డా క్టర్ నమ్రత హైదరాబాద్‌లో సృష్టి సంతాన సాఫల్య కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. దానికి అనుబంధంగా విజయవాడ, విశాఖపట్నంలో బ్రాంచ్‌లు ఉన్నాయి. విశాఖపట్నం లింకులు బయటపడిన నేపథ్యంలో గోపాలపురం పోలీసులు ఇప్పుడు విజయవాడ లింకులపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.


శిశువులు విక్రయించే ముఠాతో లింక్ ?

విజయవాడ పోలీసులు కొద్దినెలల క్రితం నవజాత శిశువులను విక్రయిస్తున్న ముఠాను అరెస్టు చేశారు. ఉత్తరాది శిశువులను తీసుకొచ్చి విక్రయిస్తుండగా, పక్కా సమాచారంతో అరెస్టు చేశారు. ఈ ముఠాలో అజితిసింగ్ నగర్‌కు చెందిన ముగ్గురు మహిళలు ఉన్నారు. ఈ ముఠా మొత్తం హైదరాబాద్ నుంచే కార్యకలాపాలు నిర్వహించేది. ఇలా పిల్లలను విక్రయించే ముఠాలు విజయవాడలో మూడు, నాలుగు ఉన్నాయి. ఈ ముఠాలతో సృష్టికి సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ముఠా పలుమార్లు హైదరాబాద్‌లోని సృష్టి కార్యాలయానికి, విజయవాడ గాయత్రీనగర్‌లోని బ్రాంచు‌కు వెళ్లినట్లుగా తెలుస్తోంది.


వారంతా అజ్ఞాతంలోకి..

విశాఖపట్నం కేజీహెచ్‌లో వైద్యులు వ్యవహరించినట్టే విజయవాడలోని కొంతమంది ప్రైవేట్ వైద్యులు కూడా వ్యవహరించినట్లు తెలిసింది. ఆంధ్రా వైద్య కళాశాలలో తనతో పాటు వైద్యవిద్యను అభ్యసించి వేర్వేరు ప్రదేశాల్లో ఆస్పత్రులు నిర్వహిస్తున్న వైద్యులను ఒక టీమ్‌గా ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తోంది. విశాఖపట్నంలో వైద్యులు, దళారులు పోలీసులకు చిక్కడంతో నమ్రతతో సంబంధం నడిపిన వారంతా ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్తున్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో తండాలను టార్గెట్‌గా చేసు కుని వ్యవహారాలు నడిపినట్టు తెలుస్తోంది.


ఆ డాక్టర్లు ఎవరు?

గాయత్రీనగర్‌లో ఉన్న సృష్టి యూనివర్సల్ ఫెర్టిలిటీ సెంటర్‌లో తనకు అనుకూలంగా ఉన్నవారినే వైద్యులుగా నియమించుకున్నారు. సృష్టికి కేసులను పంపిన వైద్యులకు హైదరాబాద్‌లో పలు సందర్భాల్లో విందులు ఏర్పాటు చేసినట్టు తెలిసింది. పిల్లలను తీసుకొచ్చి ఈ వైద్యులకు ఇచ్చిన ముఠాలకు డాక్టర్ నమత్ర లక్షలాది రూపాయలను చెల్లించినట్టు తెలు స్తోంది. విజయవాడ కేంద్రంగా వివిధ ఆస్పత్రులు నిర్వహిస్తున్న ఐదారుగురి వైద్యుల పేర్లు సృష్టి లింకుల్లో వినిపిస్తున్నాయి. విశాఖ ఝలక్‌తో ఈ వైద్యులకు గుండెల్లో గుబులు పుడుతోంది. ఈ వైద్యులంతా హైదరాబాద్‌లో దర్యాప్తు సాగుతున్న తీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. గోపాలపురం పోలీసులు పూర్తిగా విజయవాడ లింకులు బయటకు లాగితే ఇక్కడి ముఠాలు బయటకురావడం ఖాయమని పలువురు అభిప్రాయపడుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పలు రైళ్లు రద్దు.. గమ్యాల కుదింపు

డాలర్‌ డ్రీమ్స్‌తోపాటు జీవన నైపుణ్యాలు అవసరం

For More AP News and Telugu News

Updated Date - Aug 10 , 2025 | 08:26 AM