Share News

Teenage Girl Love Affair Case: పాశవిక హత్య.. కూతురిని రాడ్డుతో కొట్టి చంపిన తండ్రి

ABN , Publish Date - Sep 11 , 2025 | 07:14 AM

రెండో భార్య కూతురు ఓ యువకుడితో ప్రేమాయణంలో ఉండటం ఆ తండ్రికి నచ్చలేదు. వద్దని వారించినా వినే పరిస్థితిలో కుమార్తె లేదు. కట్టలు తెంచుకున్న ఆవేశాన్ని ఆమెపై చూపించాడు. ఇనుప రాడ్డుతో కొట్టి చంపేశాడు.

Teenage Girl Love Affair Case: పాశవిక హత్య.. కూతురిని రాడ్డుతో కొట్టి చంపిన తండ్రి
Teenage Girl Love Affair Case

» రెండో భార్య కూతురిని చంపిన తండ్రి

» మృతదేహం అటవీ ప్రాంతంలో పడేసి పరార్

» ఛత్తీస్ గఢ్ అడవుల్లో పట్టుకున్న పోలీసులు?

» నిందితుడు గంజాయి వ్యాపారి

రెండో భార్య కూతురు ఓ యువకుడితో ప్రేమాయణంలో ఉండటం ఆ తండ్రికి (Father) నచ్చలేదు. వద్దని వారించినా వినే పరిస్థితిలో కుమార్తె (Daughter) లేదు. కట్టలు తెంచుకున్న ఆవేశాన్ని ఆమెపై చూపించాడు. ఇనుప రాడ్డుతో కొట్టి చంపేశాడు. ఇందుకు మొదటి భార్య కూతుర్లు సాయం చేశారు. జిల్లాలో కొద్దిరోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై పోలీసులు (Police) రహస్యంగా కూపీ లాగుతున్నారు. వివరాల్లోకి వెళితే..


విజయవాడ, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): మైలవరానికి (Myalavaram) చెందిన ఓ వ్యక్తికి ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు ఐదుగురు కుమార్తెలు. రెండో భార్యకు ఒక కుమార్తె అతడి జీవితంలోకి రెండో భార్య వచ్చాక మొదటి భార్య ముఖం చూపించకుండా. వెళ్లిపోయింది. రెండో భార్యతో కలిసి గంజాయి విక్రయించడం అలవాటు చేసుకున్నాడు. ఇలా గంజాయి విక్రయిస్తున్న వీరిద్దరిని పోలీసులు అరెస్టు చేసి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి పంపారు.


ఇనుప రాడ్డుతో కొట్టి హత్య

తల్లిదండ్రులిద్దరూ జైలుకు వెళ్లడానికి ముందు నుంచి వారి 14 ఏళ్ల కుమార్తె జి.కొండూరు (Konduru) మండలం గుంటుముక్కలకు చెందిన యువకుడితో ప్రేమాయణం నడుపుతోంది. తల్లిదండ్రులు జైలుకు వెళ్లాక వీరి ప్రేమ ముదిరింది. తండ్రి జైలు నుంచి వచ్చాక బాలికను ప్రేమిస్తున్న వ్యక్తిపై పగను పెంచుకున్నాడు. అతడి కారణంగానే తాను జైలుకు వెళ్లాల్సి వచ్చిందనుకున్నాడు. ఈ నేపథ్యంలో కూతురు, ఆ ప్రియుడు ఒక తోటలో ఉండగా చూశాడు. అతడితో తిరగొద్దని చెప్పినా ఎందుకు వినట్లేదని కూతురుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను అతడితోనే ఉంటానని బాలిక ఎదురుచెప్పింది. ఆవేశంతో ఊగిపోయిన తండ్రి ఇనుప రాడ్డుతో బాలిక తలపై బలంగా కొట్టాడు. బాలిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన జరిగే సమయానికి మొదటి భార్య ఐదుగురు కుమార్తెలు ఇంట్లోనే ఉన్నారు. వారంతా తండ్రికి సహకరించారు. రక్తం కనిపించకుండా నేలను శుభ్రంగా కడిగేశాడు. రక్తపు వాసన రాకుండా బ్లీచింగ్ చల్లారు.


పక్కింటి వ్యక్తి ఆటోలో..

మృతదేహం తరలింపునకు పక్కంటి వ్యక్తి ఆటోను ఉపయోగించుకున్నాడు. చండ్రగూడెం వరకు వెళ్లొస్తానని ఆటో తీసుకున్నాడు. ఆ ఆటోలో కుమార్తె మృతదేహాన్ని తీసుకెళ్లి ఎ.కొండూరు అటవీ ప్రాంతంలో పడేశాడని తెలిసింది. తర్వాత ఆటోను శుభ్రంగా కడిగేసి పక్కింటి వ్యక్తికి అప్పగించాడు. ఈ ఘటన గతనెల 31న జరిగినట్లు తెలుస్తోంది. ఆ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన జరిగాక నిందితుడు, మొదటి భార్య కుమార్తెలు తలోదిక్కుకు పారిపోయారు. మన్యం ప్రాంతంలో తలదాచుకుంటున్న అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారణ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. మృతదేహం తరలింపునకు ఉపయోగించిన ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. ఎ.కొండూరు అటవీ ప్రాంతానికి వెళ్లి గాలించగా, అక్కడ బాలిక మృతదేహం కనిపించలేదని తెలిసింది. తండ్రిని రహస్యంగా విచారణ చేస్తున్న పోలీసులు మొదటి భార్య పిల్లల కోసం గాలిస్తున్నారని సమాచారం.


ఛత్తీస్‌గఢ్‌లో ఏపీ డ్రోన్లు

కుమార్తెను చంపాక నిందితుడు ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని మన్యం ప్రాంతానికి పారిపోయాడు. అతడిని గుర్తించి పట్టుకోవడానికి పోలీసులు డ్రోన్లకు పని చెప్పారు. నిందితుడు ఛత్తీస్‌గఢ్ పారిపోయాడని తెలుసుకున్న పోలీసులు తమ వద్ద ఉన్న రెండు డ్రోన్లతో ఆ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ వాటిని ఎగురవేసి నిందితుడిని గుర్తించి పట్టుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

సూపర్‌ సిక్స్‌.. గ్రాండ్‌ సక్సెస్‌

ట్రైబ్యునల్‌ ఏర్పాటులో జాప్యం ఎందుకు

Read Latest Andhra Pradesh News and National News

Updated Date - Sep 11 , 2025 | 08:19 AM