Ontimitta ZPTC Elections: వైసీపీని కుమ్మేసిన కూటమి.. రెండు స్థానాల్లోనూ విజయ కేతనం..
ABN , Publish Date - Aug 14 , 2025 | 01:43 PM
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంత గడ్డపై టీడీపీ ప్రభుత్వానికి ప్రజలు నీరాజనం పట్టారు. 30 సంవత్సరాల తర్వాత పులివెందుల గడ్డపై టీడీపీ విజయ ఢంకా మోగించింది. అలాగే ఒంటిమిట్టలోనూ భారీ విజయం సొంతం చేసుకుంది.
కడప: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉత్కంఠ రేపిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలకు తెరపడింది. నువ్వా...నేనా అంటూ.. రసవత్తరంగా సాగిన ఎన్నికల సమరానికి ఓటర్లు స్వస్తి పలికారు. మాటల యుద్ధాలు.. సవాళ్లకు ప్రతి సవాళ్లు.. ఘర్షణల మధ్య సాగిన ఎన్నికలకు ప్రజలు తీర్పు వెలువరించారు. ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సొంత గడ్డపై టీడీపీకి ప్రజలు నీరాజనం పట్టారు. 30 సంవత్సరాల తర్వాత పులివెందుల గడ్డపై టీడీపీ తన సత్తా చాటుతూ విజయభేరి మోగించింది. అలాగే ఒంటిమిట్టలోనూ.. టీడీపీ భారీ విజయం సొంత చేసుకుంది. అయితే ప్రస్తుతం జరిగింది జడ్పీటీసీ ఉపఎన్నిక మాత్రమే. ఏడాది మాత్రమే పదవీ కాలం ఉంటుంది. అయినా రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రచారం చేశాయి. అందుకే ఈ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
పోటాపోటీగా సాగిన పులివెందుల ఉపఎన్నిక స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. మాజీ సీఎం సొంత గడ్డపై టీడీపీ తన జెండా ఎగరవేసింది. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికల్లో ప్రజలు ప్రజా ప్రభుత్వానికి ఓటు వేశారు. ఈ మేరకు జడ్పీటీసీ ఉప ఎన్నికలో(Pulivendula ZPTC by Election) తెలుగుదేశం పార్టీ(TDP) అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి ఘన విజయం సాధించారు. 6,735 ఓట్ల మెజారిటీతో 30 ఏళ్ల తర్వాత పులివెందుల గడ్డపై ఆమె విజయభేరి మోగించారు. టీడీపీ ప్రస్థానంలో.. పులివెందుల ఉపఎన్నిక విజయం ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చని అనడంలో అతిశయోక్తి లేదు.
ఇక, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలో (Ontimitta ZPTC Elections) తెలుగుదేశం పార్టీ (TDP) ఘన విజయం సాధించింది. రెండు రౌండ్లలో కలిపి వైసీపీ అభ్యర్థి సుబ్బారెడ్డికి 6,351 ఓట్లు రాగా.. టీడీపీ అభ్యర్థి ముద్దుకృష్ణారెడ్డికి 12,505 ఓట్లు వచ్చాయి. టీడీపీ మెజారిటీ 6,154కు చేరింది. ఒంటిమిట్టలో టీడీపీ గెలవడంతో ఆ పార్టీ నేతలు టపాసులు కాల్చి సంబురాలు చేసుకుంటున్నారు.
అయితే, కడప పాలిటెక్నిక్ కళాశాలలో ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరిగింది. ఒంటిమిట్ట జడ్పీటీసీ కౌంటింగ్‌కు పది టేబుళ్లు ఏర్పాటు చేశారు. రెండు రౌండ్లలో ఒంటిమిట్ట జడ్పీటీసీ కౌంటింగ్ పూర్తి అయింది. ఒక్కో టేబుల్‌పై 1,000 ఓట్లు లెక్కించేలా ఏర్పాట్లు చేశారు. అయితే, ఎన్నికలు ఏకపక్షంగా జరిగాయని ఆరోపిస్తూ కౌంటింగ్‌ను వైసీపీ నేతలు బహిష్కరించారు.
అయితే, రెండు చోట్లా టీడీపీ ఘన విజయంపై సీఎం చంద్రబాబు స్పందించారు. కడప జిల్లా టీడీపీ నేతలంతా పులివెందుల విజయం పట్ల స్పందించాలని ఆయన కోరారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరిగాయని పేర్కొన్నారు. 30 ఏళ్ల తర్వాత చరిత్ర తిరగరాశామని ఆయన ఉద్ఘాటించారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగాయి కాబట్టి.. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలకు 11 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. అలాగే ఒంటిమిట్ట గెలుపుపైనా హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎన్నికల్లో కష్టపడి టీడీపీకి ఘన విజయాన్ని సాధించిన ప్రతి టీడీపీ నాయకుడు, కార్యకర్తకు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పులివెందులలో జగన్ రెడ్డి అరాచకాలను ఎదిరించాం: సీఎం చంద్రబాబు
పులివెందులలో న్యాయం, ధర్మం గెలిచింది: మారెడ్డి లతారెడ్డి
For More AndhraPradesh News And Telugu News