Cyber Fraud: ఏపీలో హైటెక్ స్కామ్స్.. నిలువు దోపిడి చేస్తున్న సైబర్‌నేరగాళ్లు
ABN , Publish Date - Dec 19 , 2025 | 07:00 AM
సైబర్ నేరగాళ్లు యువకుల మొదలు వృద్ధుల వరకు ఎవరినీ వదలడం లేదు. అవతలి వ్యక్తి బ్యాంకులో బ్యాలెన్స్ ఉందని తెలిస్తే చాలు.. వారికి వీడియోకాల్ ద్వారా ఫోన్‌చేసి ఆధార్‌కార్డు చూపించి మోసం చేస్తున్నారు.
సైబర్‌నేరగాళ్ల ఉచ్చులో బాధితులు
సాఫ్ట్‌వేర్‌లనూ దోచేశారు..!
బద్వేలుటౌన్, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఒక వ్యక్తిని ఆపి దోచుకోవడం.. ఒక ఇంట్లో దొంగలుపడి నగలు, నగదు తీసుకెళ్లడం పాతపద్ధతి. మనిషిని మాటల్లో పెట్టి అతని అకౌంట్లలో నుంచి సొమ్ము దోచుకోవడం సైబర్‌నేరగాళ్ల (Cyber Criminals) నయా దోపిడీ. ఇంతకు ముందు చాలా వరకు పొట్టకూటికోసం దొంగతనాలు చేసేవారు. ఇప్పుడు పక్కా వ్యూహంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి హైటెక్ మోసాలకు (High Tech Scams) పాల్పడుతున్నారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త పద్ధతులతో దోపిడీ చేస్తున్నారు. వీరి బారిన పడిన వారిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కూడా ఉండటం విశేషం.
సైబర్ నేరగాళ్లు యువకుల మొదలు వృద్ధుల వరకు ఎవరినీ వదలడం లేదు. అవతలి వ్యక్తి బ్యాంకులో బ్యాలెన్స్ ఉందని తెలిస్తే చాలు.. వారికి వీడియోకాల్ ద్వారా ఫోన్‌చేసి ఆధార్‌కార్డు చూపించి మీ పేరుతో ఎక్కువ సిమ్‌కార్డులు తీసుకొని కొంతమంది నిందితులు ఢిల్లీ కేంద్రంగా హ్యూమన్ ట్రాఫికింగ్, మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని వారిపై కేసులు నమోదయ్యాయని బెదిరిస్తారు. బాధితులు నమ్మేవిధంగా వారికి వాట్సాప్ ద్వారా నకిలీ ఎఫ్‌ఐఆర్ పంపిస్తారు.
ఢిల్లీ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారని, అతను మీపేరు చెప్పాడని, అందువల్ల మీమీద ఎఫ్‌ఐఆర్ నమోదుచేశామని, మీరు ఒక గదిలోకి వెళ్లి ఎవరూ లేకుండా గడియ పెట్టుకుని వాట్సాప్ కాల్ ద్వారా విచారణకు హాజరుకావాలంటారు. లేకపోతే వెంటనే ఢిల్లీ పోలీసులు, సీబీఐ అధికారులు అరెస్ట్ చేస్తారని భయభ్రాంతులకు గురిచేస్తారు. మీరు డిజిటల్ అరెస్ట్‌లో ఉన్నారని, ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకూడదని, ఒకవేళ చెబితే నేషనల్ సెక్యూరిటీ యాక్ట్-1923 కింద ఐదేండ్లు జైలుశిక్ష పడుతుందని భయపెడతారు. బాధితులను భయపెట్టేందుకు కొన్ని నకిలీ సుప్రీంకోర్టు వారెంట్‌లను చూపుతారు. ఢిల్లీ, ముంబై పోలీసులని నమ్మించే విధంగా యూనిఫాంలో ఉంటారు. 24గంటలలో మిమ్మలను అరెస్ట్‌చేసి విచారణ చేసే విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని నమ్మిస్తారు.
కొల్లగొట్టే అత్యాశ..
మనుషులకు ఆశ మంచిదే కానీ.. అత్యాశే కొంప ముంచుతుంది. గతంలో రూ.10వేలు పెట్టుబడి పెడితే మీకు లక్షరూపాయలు వస్తుందని ఆశచూపించి బద్వేలుకు చెందిన కొంతమంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను సైబర్‌నేరగాళ్లు మోసం చేశారు. ఇలా ఒక వ్యక్తి నుంచి రూ.10,26,000, మరో మహిళ నుంచి రూ.23,000, మరో యువతి నుంచి రూ.1,69,000, మరో మహిళ నుంచి రూ.4,31,000, యువకుడి నుంచి రూ.2,91,00లు కొట్టేశారు.
అలాగే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి లింక్ పంపించి ఆ లింక్ ద్వారా రూ.14 లక్షలు, డిజిటల్ అరెస్ట్ పేరుతో ఒక న్యాయవాది నుంచి రూ.72.68 లక్షలు సైబర్ నేరగాళ్లు దోచేశారు. ఇవే కాకుండా జిల్లాలో ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట సైబర్‌నేరగాళ్ల ఉచ్చులోపడి ఖాతాలు ఖాలీ చేసుకుంటున్న బాధితులు లబోదిబోమంటూ పోలీస్‌స్టేషన్లను ఆశ్రయిస్తున్నారు. అయితే ఈ కేసుల్లో రికవరీ మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ప్రజలే జాగ్రత్తగా ఉండాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
వంశీకి ఊహించని షాక్.. మరో కేసు నమోదు
గవర్నర్‌ను కలవనున్న జగన్.. పోలీసులు అలర్ట్
Read Latest AP News And Telugu News