Pawan Kalyan: వికసిత్ భారత్ వైపు నడిపించేలా బడ్జెట్.. పవన్ కల్యాణ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్
ABN , Publish Date - Feb 01 , 2025 | 06:53 PM
Pawan Kalyan: రైతులు, మహిళలు, మధ్యతరగతి, యువత... ప్రతి ఒక్కరి సంక్షేమాన్ని, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇస్తున్న అండదండలు కేంద్ర బడ్జెట్‌లోనూ కొనసాగిందని చెప్పారు.
అమరావతి: 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశాల చెంతన మన దేశాన్ని నిలపడానికి వికసిత్ భారత్ విజన్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ మన దేశాన్ని వికసిత్ భారత్ వైపు నడిపించేలా ఉందని అన్నారు. రాజకీయ అవసరాల కంటే దేశ ప్రజలే ముఖ్యమనే కేంద్ర ప్రభుత్వ సమున్నత దృక్పథం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కనిపించిందని తెలిపారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా 2025-26 బడ్జెట్‌పై పవన్ కల్యాణ్ స్పందించారు.
రైతులు, మహిళలు, మధ్యతరగతి, యువత... ప్రతి ఒక్కరి సంక్షేమాన్ని, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకున్నారని చెప్పుకొచ్చారు. రూ.10 లక్షల విలువైన క్రెడిట్ కార్డులు మంజూరు చేయడంతో సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు ఊతం దొరుకుతుందని చెప్పారు. 5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ మహిళ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రూ.2 కోట్ల రుణాలు ఇవ్వడం ద్వారా ఆయా వర్గాల్లోని మహిళల ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతుందని వివరించారు. రూ.12 లక్షల వరకూ వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపు మూలంగా ఉద్యోగ వర్గాలకు ఎనలేని ఊరట లభిస్తోందన్నారు. ఈ తరహా సంస్కరణలు కచ్చితంగా మధ్యతరగతిని ఆర్థికంగా బలోపేతం చేస్తాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇస్తున్న అండదండలు కేంద్ర బడ్జెట్‌లోనూ కొనసాగిందని చెప్పారు.
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలకు ఆమోదం తెలపడం మూలంగా రాష్ట్రానికి జీవనాడి అయిన ఆ ప్రాజెక్ట్ వేగంగా పూర్తి చేసే అవకాశం లభించిందని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌కు రూ.5,936 కోట్లు, బ్యాలెన్స్ గ్రాంటుగా రూ.12,157 కోట్లు ప్రకటించడం శుభపరిణామమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సదవకాశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సద్వినియోగం చేసుకుంటుందని వివరించారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు రూ.3295 కోట్లు కేటాయించడం ద్వారా ఆ ప్లాంట్ పరిరక్షకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోమారు స్పష్టమైందన్నారు. విశాఖ పోర్టుకు రూ.730 కోట్లు నిధులు ఇవ్వడం ద్వారా పోర్టు సామర్థ్యం పెరుగుతుందని చెప్పారు. వాణిజ్య విస్తృతికి ఆస్కారం కలుగుతుందని.. 2019-24 మధ్య రాష్ట్రం పాలన, ఆర్థికపరమైన విధ్వంసాన్ని ఎదుర్కొందన్నారు. ఆ విపత్కర పరిస్థితుల నుంచి బయటపడుతున్న ఈ తరుణంలో రాష్ట్రానికి అమూల్యమైన ప్రోత్సాహాన్ని ఇస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌లకు పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
CII on Budget 2025: దేశానికి ప్రోత్సాహకంగా బడ్జెట్.. సీఐఐ రియాక్షన్
Union Budget 2025-26: ఏపీ జీవనాడికి ఊపిరి పోసిన నిర్మలమ్మ
CM Chandrababu: ఏపీ రైతులకు శుభవార్త.. అప్పటి నుంచే రైతు భరోసా
Read Latest AP News And Telugu News