Union Budget 2025-26: ఏపీ జీవనాడికి ఊపిరి పోసిన నిర్మలమ్మ
ABN , Publish Date - Feb 01 , 2025 | 02:50 PM
Union Budget 2025 - 26: ఆంధ్రప్రదేశ్ జీవనాడగి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం అంచనా సవరణకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి అవసరమైన బ్యాలెన్స్ గ్రాంట్ రూ. రూ.12157.53 కోట్లు అని నిర్ధారించింది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 01: ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం అంచనా సవరణకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది. ఈ ప్రాజెక్టు 41.15 మీటర్ల వరకు నీరు నిలిపేందుకు సవరించిన అంచనాల మేరకు రూ.30,436.95 కోట్లతో నిర్మాణానికి కేంద్రం పచ్చ జెండా ఊపింది. ఈ మేరకు ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి నిధులు విడుదల చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంట్‌లో ప్రకటించారు.
ఇక ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి అవసరమైన బ్యాలెన్స్ గ్రాంట్ రూ.12157.53 కోట్లు అని నిర్ధారించింది. ప్రస్తుత బడ్జెట్‌లో రూ.5936 కోట్లు కేటాయించినట్లు వివరించింది. అయితే గతేడాది కేంద్ర బడ్జెట్‌లో పోలవరం ప్రాజెక్ట్‌కు రూ.12 వేల కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. అలాగే పోలవరం ప్రాజెక్ట్‌ను 2028 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. శనివారం బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా తన బడ్జెట్ ప్రసంగంంలో కీలక ప్రాజెక్టులకు సంబంధించిన నిధుల కేటాయింపును ఆమె గణాంకాలతో సహ వివరించారు. అందులోభాగంగా గతంలో ప్రకటించిన పోలవరం ప్రాజెక్ట్ నిధుల వివరాలను తెలిపారు. ఈ పోలవరం ప్రాజెక్టు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల మధ్య నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్ట్ హోదా కల్పించిన విషయం విధితమే..
2024, మే - జూన్ మాసాల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఓటరు కూటమికి పట్టం కట్టాడు. దీంతో చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. అనంతరం రాజధాని అమరావతి పనులు ఊపందుకొన్నాయి. అలాగే రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులకు వేగవంతమయ్యేందుకు ఆస్కారం ఏర్పాడింది. మరోవైపు ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి.
ఆ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీతోపాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి తాము కట్టుబడి ఉంటామని వారు ప్రకటించారు. అందులోభాగంగా ప్రభుత్వం కోలువు తీరిన అనంతరం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌లోనే కాకుండా.. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను సాధారణ బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం భారీ కేటాయింపులు చేసింది.
For AndhraPradesh News And Telugu News