Share News

Nara Lokesh: రంగుల పిచ్చితో మొత్తం విద్యావ్యవస్థను జగన్ నాశనం చేశారు: లోకేశ్‌

ABN , Publish Date - Jun 23 , 2025 | 06:37 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ పరుగులు పెడుతోందని మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు. ఐదేళ్లలో సాధించలేనిది ఏడాదిలోనే సాధించి చూపామని అన్నారు. ఉద్యోగులే ప్రభుత్వానికి గుండెకాయ అని మంత్రి నారా లోకేష్ అభివర్ణించారు.

Nara Lokesh: రంగుల పిచ్చితో మొత్తం విద్యావ్యవస్థను జగన్ నాశనం చేశారు: లోకేశ్‌
Minister Nara Lokesh

అమరావతి: సుపరిపాలనలో తొలి అడుగు వేశామని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) తెలిపారు. పాలనలో ప్రభుత్వ ఉద్యోగస్తుల సహకారం ఎంతో అవసరమని చెప్పారు. ప్రభుత్వ అధికారులు కూడా ప్రజలకు మరింత దగ్గర అవ్వాలని సూచించారు. చాలా సమస్యలతో ప్రజలు అధికారుల దగ్గరకు వస్తారని.. వారిని ఆప్యాయంగా పలకరించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని చెప్పారు. ఉద్యోగస్థులు తలుచుకుంటే స్వర్ణాంధ్ర ఖచ్చితంగా సాధ్యం అవుతుందని అన్నారు. గత వైసీపీ పాలకుల అహంకారం, అరాచకంతో 151సీట్లు 11కే పరిమితం అయ్యాయని.. ఈ విషయాన్ని కూటమి నేతలు గుర్తుపెట్టుకోవాలని సూచించారు. రంగుల పిచ్చితో మొత్తం విద్యావ్యవస్థను వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాశనం చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ’సుపరిపాలనలో తొలి అడుగు పేరిట’ ఏడాది పాలనపై ఇవాళ(సోమవారం) ఏపీ సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో లోకేష్ పాల్గొని మాట్లాడారు.


ఐదేళ్ల పరిపాలనలో అప్పుల రాష్ట్రంగా మార్చారని మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. మొన్నటి ఎన్నికల్లో నిజంగా గెలిచింది రాష్ట్ర ప్రజలేనని తెలిపారు. వైసీపీ హయాంలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదని చెప్పారు. వైసీపీ నేతలు ప్రజాసమస్యలను పట్టించుకోలేదని అన్నారు. గతంలో ప్రశ్నిస్తే లాఠీ దెబ్బలు, అరెస్టులు, వేధింపులు ఉండేవని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలు సుఖశాంతులతో ఉన్నారని చెప్పారు. నియంత పాలన నుంచి ప్రజలకు నిజమైన స్వేచ్ఛ వచ్చిందని తెలిపారు. ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా ఎక్కువ మొత్తం పింఛన్లను తాము ఇస్తున్నామని చెప్పారు. తల్లికి వందనం పేరుతో ఒకటో క్లాస్‌ నుంచి ఇంటర్‌ వరకు సాయం చేశామని తెలిపారు. ఇంకా చేయాల్సిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చాలా ఉన్నాయని ఒక్కొక్కటీ వరుసగా చేసుకుంటూ పోతున్నామని వివరించారు. అన్న క్యాంటీన్లు, ఉచిత గ్యాస్‌ అమలు చేస్తున్నామని వెల్లడించారు. మెగా డీఎస్సీ ద్వారా 16 వేల 347 పోస్టుల భర్తీ చేశామని ప్రకటించారు. భూములను కొట్టేయడానికి జగన్ తెచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు చేశామని గుర్తుచేశారు. పవన్‌ కల్యాణ్ నాయకత్వంలో పంచాయతీలకు మంచిరోజులు వచ్చాయని చెప్పారు మంత్రి నారా లోకేష్.


పొగాకు, మామిడి, మిర్చి రైతుల సమస్యలపై యుద్ధప్రాతిపదికన స్పందించామని మంత్రి నారా లోకేష్ అన్నారు. సీమలో హార్టికల్చర్‌, రెన్యువబుల్‌ ఎనర్జీ హచ్‌లు వచ్చాయని గుర్తుచేశారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తో అన్ని పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయని తెలిపారు. కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు కేంద్రం సహకరిస్తోందని చెప్పుకొచ్చారు. రాజకీయాలకు అతీతంగా విద్యాశాఖ ఉండాలని సూచించారు. గతంలో పుస్తకాల దగ్గర నుంచి అన్నింటిపైనా జగన్‌ బొమ్మలు ఉండేవని ఎద్దేవా చేశారు. రంగుల పిచ్చితో మొత్తం విద్యావ్యవస్థను నాశనం చేశారని ఫైర్ అయ్యారు. తాము అధికారంలోకి వచ్చాక విద్యార్థులకు సన్నబియ్యం పెడుతున్నామని తెలిపారు. చిక్కీల దగ్గర నుంచి పుస్తకాల వరకు ఎక్కడా తమ ఫొటోలు లేవని స్పష్టం చేశారు. 9,800 పాఠశాలల్లో వన్‌ క్లాస్‌ వన్‌ టీచర్‌ విధానం తీసుకువచ్చామని తెలిపారు. ఉద్యోగుల కోసం జీవో 117 రద్దు చేశామని పేర్కొన్నారు మంత్రి నారా లోకేష్.


ఏడాది పాలనలో అన్నీ సాధించామని తాము కాలర్ ఎగరేసి తిరగట్లేదని మంత్రి నారా లోకేష్ చెప్పారు. ఇంకా చేయాల్సింది ఎంతో ఉందనే పట్టుదలతోనే ముందుకు వెళ్తున్నామని అన్నారు. ఏడాది పాలనలో ఏం చేశారని ప్రశ్నించే వారికి మెజారిటీ హామీలు అమలు చేసి చూపామని గర్వంగా చెప్పగలమని.. ప్రజల్లో చిరునవ్వు తీసుకొచ్చామని చెప్పారు. జూన్ 4వ తేదీ ప్రజలు విజయం సాధించి ఏపీ చరిత్ర తిరగరాసిన రోజు అని గుర్తుచేశారు. గత ఐదేళ్ల విధ్వంస పాలనకు విముక్తి కలిగిన రోజు అని తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తూ అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధికి కృషి చేస్తున్నామని వెల్లడించారు మంత్రి నారా లోకేష్.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ పరుగులు పెడుతోందని మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు. ఐదేళ్లలో సాధించలేనిది ఏడాదిలోనే సాధించి చూపామని అన్నారు. ఉద్యోగులే ప్రభుత్వానికి గుండెకాయ అని అభివర్ణించారు. ప్రజలకు చేరువగా వెళ్లి సేవలందించాలని కోరారు. దేవుడు కూడా అన్ని సమస్యలు తీర్చలేరని చెప్పారు. అవకాశం ఉన్నంత వరకూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలిపారు. గత జగన్ ప్రభుత్వం పెట్టిపోయిన బకాయిలను కూడా త్వరగా చెల్లిస్తున్నామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి:

దూకుడు పెంచిన సిట్.. మాజీ సీఎస్ కీలక వాంగ్మూలం

యూఎస్‌ను హెచ్చరించిన ఇరాన్

For More Andhrapradesh News and Telugu News

Updated Date - Jun 23 , 2025 | 07:50 PM