Mangalagiri Narasimha Swamy Temple: నృసింహస్వామి ఆలయానికి మాస్టర్ ప్లాన్ రెడీ..
ABN , Publish Date - Aug 26 , 2025 | 10:06 PM
మాస్టర్ ప్లాన్ ప్రకారం మంగళగిరి కొండ చుట్టూ ¾ వంతు భాగంలో పాత, కొత్త హైవేలను కలిపే విధంగా వంద అడుగుల రోడ్డును 3.47 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తారు. ఇది పానకాలస్వామి ఘాట్ రోడ్డుతో అనుసంధానమయ్యే విధంగా ఉంటుంది.
మంగళగిరి, ఆగస్టు 25: మంగళగిరి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దివ్యక్షేత్ర అభివృద్ధి మాస్టర్ ప్లాన్ రెడీ అయిపోయింది. దాదాపు ఎనిమిది నెలలుగా వివిధ కోణాల్లో చర్చించి, పరిశోధించి దీనిని రూపొందించారు. ఇందుకోసం స్థానిక ఎమ్మెల్యే, మంత్రి నారా లోకేశ్ దేవదాయ, పర్యాటక, అటవీ, ఆర్అండ్‌బీ, మునిసిపల్, రెవెన్యూ శాఖలతో ఇరవైసార్లకు పైగా సమావేశమయ్యారు. ఎట్టకేలకు హైదరాబాద్‌కు చెందిన ఎస్ఎంజీ డిజైన్ ఇంక్ ఆర్కిటెక్చర్ సంస్థ మాస్టర్ ప్లాన్‌ను తయారు చేసింది. ఈ ప్లాన్ ప్రకారం మొత్తం క్షేత్రాభివృద్ధికి రూ.147.53 కోట్లు అవసరమని అంచనా వేశారు. మాస్టర్ ప్లాన్‌లో ప్రతిపాదించిన అభివృద్ధి పనులకు ఈ మొత్తాన్ని వెచ్చించనున్నారు. ఈ ప్లాన్ మొత్తం ఎగువ, దిగువ సన్నిధులకు వెలుపల వైపు చేపట్టాల్సిన అభివృద్ధి పనులకే సంబంధించింది. ఇక దిగువ సన్నిధి జీర్ణోద్ధరణ కోసం రూ.7 కోట్లు దేవదాయ శాఖ నిధులను ఖర్చు చేయాలని నిర్ణయించారు. అంటే మొత్తం క్షేత్రాభివృద్ధికి రూ.155 కోట్లు ఖర్చు చేయనున్నారు.
రూ.40.42 కోట్లతో రహదారులు:
మాస్టర్ ప్లాన్ ప్రకారం మంగళగిరి కొండ చుట్టూ ¾ వంతు భాగంలో పాత, కొత్త హైవేలను కలిపే విధంగా వంద అడుగుల రోడ్డును 3.47 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తారు. ఇది పానకాలస్వామి ఘాట్ రోడ్డుతో అనుసంధానమయ్యే విధంగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాసుపత్రి వెనుకవైపు నుంచి ఈ కొత్త రోడ్డును ద్వారకానగర్‌తో అనుసంధానం చేస్తూ 0.37 కిలోమీటర్ల పొడవున, ఇంకొక రోడ్డును ఇందిరానగర్‌లో ఏపీ ఎస్పీ పశ్చిమ ముఖద్వారానికి తూర్పు వైపుగా 0.42 కిలోమీటర్ల పొడవున ప్రతిపాదించారు. ఈ రోడ్ల నిర్మాణంతో భక్తులు ఎటు నుంచి వచ్చినా ఎగువ సన్నిధికి సులభంగా చేరుకోగలుగుతారు. మొత్తం రహదారుల కోసం 33.527 ఎకరాల భూమి అవసరం. ఈ భూమిని AIIMS, ఏపీ ఎస్పీ బెటాలియన్, అటవీ, దేవదాయ శాఖల నుంచి సేకరించనున్నారు. గ్రీనరీ అభివృద్ధి కోసం రూ.40.42 కోట్లు ఖర్చు చేయనున్నారు.
రూ.2 కోట్లతో రెండు ముఖద్వారాలు:
కొండ చుట్టూ నిర్మించనున్న కొత్త వంద అడుగుల రోడ్డుకు తూర్పు, పశ్చిమ దిశలలో రెండు స్వాగత ద్వారాలు నిర్మించనున్నారు. ఇందుకోసం రూ.2 కోట్లు ఖర్చు చేయనున్నారు. పశ్చిమ ముఖద్వారం వద్ద ల్యాండ్‌స్కేప్డ్ రౌండ్ ఫౌంటెన్, గరుత్మంతుడు లేదా హనుమంతుని విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు.
రూ.60 కోట్లతో దిగువ ప్రాంత అభివృద్ధి:
దిగువ సన్నిధికి తూర్పువైపు ప్రాంతం పూర్తిగా మారిపోనుంది. ఈ అభివృద్ధికి రూ.60 కోట్లు ఖర్చు అవుతాయి. రాజగోపురం ఎదురు భాగంలో కళామండపం స్థలంలో పూజా సామగ్రి దుకాణాలు, టీటీడీ కల్యాణ మండపం స్థానంలో కల్చరల్ కాంప్లెక్స్, ఓపెన్ ఎయిర్ థియేటర్ నిర్మిస్తారు. ఇవి కాకుండా మంగళగిరి చేనేత విక్రయశాల, 800 సీట్ల ఆడిటోరియం, ఆర్కియాలజీ మ్యూజియం, VIP వసతిగృహాలు, యాత్రికుల వసతి గదులు, కార్, బైక్, బస్ పార్కింగ్ లాంటివి నిర్మించనున్నారు.
రూ.7 కోట్లతో దిగువ సన్నిధి జీర్ణోద్ధరణ:
దిగువ సన్నిధి ప్రాంతంలో కల్యాణ మండపాన్ని ఆధునికీకరిస్తారు. బజారు స్థలంలో ప్రసాద విక్రయశాల, ఆలయ వెనుక పార్కింగ్ ప్రాంతంలో ఈఓ కార్యాలయం, వీవీఐపి విశ్రాంతి గృహాలు నిర్మిస్తారు. ప్రధాన ఆలయ విమాన గోపురం, అమ్మవారి శిఖరం, వాహనశాల, యాగశాలను జీర్ణోద్ధరించేందుకు రూ.7 కోట్లు ఖర్చు అవుతాయి.
రూ.20 కోట్లతో ఎగువ సన్నిధి అభివృద్ధి:
పానకాలస్వామి గర్భగుడికి వెళ్లేందుకు రెండు వేర్వేరు మార్గాలు, ముఖ మండప విస్తరణ, గండలయ స్వామి ఆలయ అభివృద్ధి (రూ.1.8 కోట్లు), పెదకోనేటి ఆధునీకరణ (రూ.3.8 కోట్లు), తాగునీరు, విద్యుత్, గోపురాల మరమ్మతులు కలిపి రూ.20 కోట్ల వ్యయం అంచనా.
రూ.12 కోట్లతో ఎకోపార్క్ అభివృద్ధి:
AIIMS వెంబడి ఉన్న ఎకోపార్క్‌ను రూ.12.03 కోట్లు వ్యయంతో అభివృద్ధి చేస్తారు. రెస్టారెంట్, ప్రకృతి మ్యూజియం, పబ్లిక్ టాయిలెట్స్, పార్కింగ్, సమాచార కేంద్రం వంటివి ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు.
సాస్సీ నిధులు – రూ.100 కోట్లు:
ఈ అభివృద్ధికి కావాల్సిన నిధుల కోసం కేంద్ర ప్రభుత్వ సాస్సీ పథకం నుంచి రూ.100 కోట్లు మంజూరు అయ్యే అవకాశాలున్నాయి. మిగిలిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం, ఆర్అండ్‌బీ, పర్యాటక, పట్టణాభివృద్ధి శాఖల నుంచి రాబట్టే ప్రయత్నం జరుగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ పింఛన్ల కొనసాగింపుపై కీలక ఆదేశాలు..
ప్రపంచానికి అనుగుణంగా మారండి.. బ్యాంకర్లకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు
మరిన్ని ఏపీ వార్తలు కోసం క్లిక్ చేయండి..