Deputy CM Pawan Kalyan: జగన్ హయాంలో.. ఏపీలో అభివృద్ధి దూరమై శాంతిభద్రతలు క్షీణించాయి: పవన్‌కల్యాణ్
ABN , Publish Date - Jun 19 , 2025 | 08:45 PM
'సుపరిపాలనకు ఏడాది' పేరుతో సమగ్ర అభివృద్ధి నివేదికని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ప్రకటించారు. 2019-24 వరకు నియంతృత్వ పాలకుల పాలనలో ఏపీ నలిగిపోయిందని చెప్పారు. జగన్ హయాంలో ఏపీలో అభివృద్ధి దూరమై శాంతిభద్రతలు క్షీణించాయని అన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో రూ.వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా మార్చి.. దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) ఉద్ఘాటించారు. రానున్న నాలుగేళ్లలో ఇంతకు రెట్టింపు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు. డిప్యూటీ సీఎంగా, వివిధశాఖలకు మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఏడాది గడిచిన సందర్భంగా సుపరిపాలనకు ఏడాది పేరుతో 20 పేజీలతో కూడిన 2024-2025 సమగ్ర అభివృద్ది నివేదికను పవన్ కల్యాణ్ ప్రకటించారు.
వైసీపీ హయాంలో నియంతృత్వ పాలన..
ప్రగతి, పారదర్శకత, సుస్థిరత, జవాబుదారీతనం, గ్రామ స్వరాజ్యానికై ముందడుగు, హరితాంధ్ర సాధనకై మరో అడుగు అంటూ ఈ నివేదికను ప్రజలకు పవన్ కల్యాణ్ వివరించారు. గత సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్టీఏ కూటమి విజయానికి అండగా నిలబడి, ఏపీని బానిస సంకెళ్ల నుంచి విముక్తి చేసిన ప్రతి ఒక్కరికీ మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. 2019 నుంచి 2024 వరకు ఐదేళ్ల కాలంలో రాష్ట్రం నియంతృత్వ పాలకుల పాలనలో నలిగిపోయింది, అభివృద్ధికి దూరమైంది, శాంతిభద్రతలు క్షీణించాయి. యువత భవిష్యత్తుపై నీలి మేఘాలు కమ్ముకున్నాయి. మహిళలకు రక్షణ కరువైందని పవన్ కల్యాణ్ ఆరోపించారు.
కూటమి ప్రభుత్వంలో ఏపీ అభివృద్ధి...
‘రాష్ట్ర రాజధాని నిర్మాణంలో ఒక్క ఇటుక కూడా కదలకుండా నిర్మానుష్యంగా మారిన సమయంలో రాష్ట్రాన్ని రక్షించేందుకు, ప్రజాస్వామ్య పరిపాలనను పునరుద్ధరించేందుకు, భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ దేశాన్ని ప్రపంచ నాలుగో ఆర్థిక వ్యవస్థగా నిలిపిన దార్శనికుడు, నవభారత నిర్మాత, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో.. నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, ప్రజల పక్షాన ఎల్లవేళలా నిలబడి పోరాడి మన సమష్టి సహకారంతో ఎన్డీఏ కూటమి 164 అసెంబ్లీ సీట్లను గెలిచి 94శాతం స్ట్రైక్ రేటుతో చారిత్రాత్మక విజయం సాధించింది. ఇంతటి గెలుపును అందించిన ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు, మళ్లీ రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆహర్నిశలు కృషి చేస్తూ సంవత్సర కాలంలోనే గత ఐదేళ్లలో జరగని అభివృద్ధిని చేసి చూపిస్తూ, ప్రజల్లోనే కాకుండా, పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని నింపడానికి కృషి చేశాం. ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని, సుపరిపాలనను చూసి నేడు కేంద్రప్రభుత్వం సంపూర్ణ సహకారాలు అందిస్తుండటంతో ఏపీ అన్ని రంగాల్లో సమష్టి అభివృద్ధి సాధిస్తూ స్వర్ణాంధ్ర 2047 సాధించే దిశగా అడుగులు వేస్తోంది’ అని పవన్ కల్యాణ్ వెల్లడించారు.
ప్రభుత్వంలో పారదర్శకత ఉండాలి...
‘రాజకీయాల్లో, ప్రభుత్వంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని నిరంతరం పరితపించే నేను గత సంవత్సర కాలంలో చేపట్టిన శాఖల ద్వారా చేసిన అభివృద్ధిని, సాధించిన విజయాలను ప్రజలందరి ముందు ఉంచడం నా నైతిక బాధ్యతగా భావిస్తూ, అధికార బాధ్యతలు స్వీకరించి సంవత్సరమైన సందర్భంగా ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాను. పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ పర్యావరణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల సమగ్ర నివేదికను ప్రజలు అందరూ నిశితంగా పరిశీలించి ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను, మీరు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేయాలనే మా సంకల్పాన్ని గుర్తిస్తారని ఆశిస్తున్నాను. ఈ సందర్భంగా ఏపీ అభివృద్ధికి అన్నిరకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి, పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ, జలశక్తి శాఖ, పర్యావరణ అటవీశాఖ, శాస్త్ర సాంకేతిక శాఖ అలాగే ఇతర శాఖల మంత్రులకు అధికారులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేసేందుకు కృషి చేస్తున్న ఉన్నతాధికారుల నుంచి, క్షేత్రస్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరిని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. రానున్న రోజుల్లో మరింత బాధ్యతగా, భవిష్యత్‌ని దృష్టిలో ఉంచుకుని ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో, సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం సంక్షేమాభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుంది. పిఠాపురం నియోజకవర్గంలో వేల కోట్ల రూపాయలతో చాలా అభివృద్ధి పనులు పూర్తి చేశాం. రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాం’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
నెల్లూరు రైల్వే కోర్టుకు మాజీ మంత్రి
జగన్ వ్యాఖ్యలపై నవ్వుకుంటున్నారు.. పట్టాభి సెటైర్
జగన్ పల్నాడు పర్యటనపై షర్మిల సంచలన కామెంట్స్
Read latest AP News And Telugu News