CPI Ramakrishna: సీఎం చంద్రబాబుకు సీపీఐ నేత రామకృష్ణ లేఖ.. అసలు విషయమిదే..
ABN , Publish Date - Dec 28 , 2025 | 06:45 PM
మెడికల్ కాలేజీల పీపీపీ విధానాన్ని విరమించుకోవాలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు.
అమరావతి, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): మెడికల్ కాలేజీల పీపీపీ విధానాన్ని విరమించుకోవాలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు (AP CM Chandrababu Naidu) సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ (CPI Leader Ramakrishna) ఇవాళ(ఆదివారం) లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) పేరుతో ఏపీలో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించే యోచనను విరమించుకోవాలని సూచించారు. మెడికల్ కళాశాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు ముఖ్యమంత్రి అత్యుత్సాహం చూపిస్తూ, మొండిగా వ్యవహరించడం సరికాదని పేర్కొన్నారు.
ఏపీలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థి, యువజన సంఘాలు, ప్రజాసంఘాలు, మేధావులు అందరూ ముక్తకంఠంతో రాష్ట్ర ప్రభుత్వ పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ నిధులతో ఏర్పాటైన వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటుకు అప్పగించడంతోపాటు, రెండేళ్ల పాటు సిబ్బందికి జీతాలు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమవటం తగదని అన్నారు. విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకునేందుకు మాత్రమే ప్రైవేటుకు అవకాశం కల్పించడం విచారకరమని తెలిపారు.
కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పీపీపీ విధానం ప్రభుత్వ, ప్రజల ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు దోచి పెట్టడమేనని విమర్శించారు. టెండర్లు వేసేందుకు కూడా ఎవరూ రాని పరిస్థితుల్లో... మంత్రి సత్యకుమార్ మాత్రం టెండర్లు వేసేందుకు ముందుకు వస్తున్నారని అవాస్తవాలు ఎందుకు చెబుతున్నారని ప్రశ్నించారు. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా వందలాది మందికి విద్యను అందించటం అభినందనీయమేనని అన్నారు. కానీ ప్రభుత్వ రంగంలోని వాటిని ప్రైవేటుకు అప్పగించి, ట్రస్టు ద్వారా మాత్రం కొందరికీ చదువులు చెప్పించి మిగిలిన వారిని గాలికి వదిలేయటం సబబేనా? అని నిలదీశారు. ఏపీలోని విద్య, వైద్య రంగాలను ప్రైవేటుకు అప్పగిస్తే పేద, సామాన్య, మధ్య తరగతి వర్గాలకు అవి అందుబాటులో ఎలా ఉంటాయి? అని రామకృష్ణ ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి...
వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలోకి కీలక నేతలు
ఈ ఏడాది ప్రత్యేకంగా ముక్కోటి ఏకాదశి
Read Latest AP News And Telugu News