CM Chandrababu: తీరు మార్చుకోండి.. ఆ ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు ఫైర్
ABN , Publish Date - Nov 08 , 2025 | 03:32 PM
కొంతమంది ఎమ్మెల్యేలు ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొనడం లేదని సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఎమ్మెల్యేలు ప్రవర్తన మార్చుకోవాలని.. తీరు మారకపోతే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు సీఎం చంద్రబాబు.
అమరావతి, నవంబరు8 (ఆంధ్రజ్యోతి): టీడీపీ ఎమ్మెల్యేలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ(శనివారం) సీఎం చంద్రబాబు అమరావతిలోని టీడీపీ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలో పలు కీలక అంశాలపై చర్చించారు సీఎం చంద్రబాబు. పెన్షన్ల పంపిణీ, సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల అందజేతపై సీఎం సమీక్షించారు. ఈ క్రమంలో పెన్షన్ల పంపిణీ, సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల అందజేత కార్యక్రమాల్లో 48 మంది ఎమ్మెల్యేలు పొల్గొనడం లేదని సీఎం చంద్రబాబు దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ 48 మంది ఎమ్మెల్యేలకు వెంటనే నోటీసులు ఇవ్వాలని ఆజ్ఞాపించారు. ఈ మేరకు బ్యాక్ ఆఫీసు, ప్రొగ్రాం కమిటీకి సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు.
కొంతమంది ఎమ్మెల్యేల ప్రవర్తన సరిగా లేదని సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. పేదల సేవలో భాగంగా ఫించన్ల పంపిణీలో మంత్రులు, ఎమ్మెల్యేలు తప్పనిసరిగా పాల్గొనాల్సిందేనని సీఎం హుకుం జారీ చేశారు. పెన్షన్ల పంపిణీలో పాల్గొనని ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకున్న తర్వాత చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడబోనని హెచ్చరించారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత కార్యకర్తలు, ప్రజలతో ఎమ్మెల్యేలు మాట్లాడాలని దిశానిర్దేశం చేశారు. టీడీపీ కార్యకర్తలకు ఇన్సురెన్స్, సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీలో కూడా ఎమ్మెల్యేలు పాల్గొని తీరాల్సిందేనని ఆజ్ఞాపించారు సీఎం చంద్రబాబు.
ఎమ్మెల్యేలకు నచ్చిన కార్యకర్తలనే కాకుండా సీన్సియర్‌గా పనిచేసిన టీడీపీ కార్యకర్తలను కూడా కలుపుకెళ్లాలని మార్గనిర్దేశం చేశారు. ఆయా నియోజకవర్గ టీడీపీ కార్యాలయాల్లో ప్రతి శుక్రవారం జరిగే ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాల్గొనాల్సిందేనని సీఎం దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలు ఎవరైనా పాల్గొనకపోతే వెంటనే పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వివరణ తీసుకోవాలని, తన దృష్టికి కూడా తీసుకురావాలని సీఎం ఆదేశించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను గతంలో కంటే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందని ఉద్ఘాటించారు. తమ ప్రభుత్వానికి ఉన్న నిధుల కొరతపై ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలపై ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
అర్ధరాత్రి నడిరోడ్డుపై మందుబాబుల హంగామా.. ఏం జరిగిందంటే
అనుకున్న సమయానికే అమరావతికి క్వాంటమ్ కంప్యూటర్: చంద్రబాబు
Read Latest AP News And Telugu News