CM Chandrababu on Industries: లాజిస్టిక్స్ వ్యయం తగ్గించడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Sep 26 , 2025 | 05:17 PM
ఏపీకి ప్రస్తుతం డ్రై పోర్టుల ప్రాజెక్టులు కూడా పెద్దఎత్తున వస్తున్నాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. లాజిస్టిక్స్ ఎకో సిస్టంలో మౌలిక సదుపాయాలే ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని ఉద్గాటించారు.
అమరావతి, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): లాజిస్టిక్స్, పరిశ్రమలు, ఉపాధి, ఉద్యోగ అవకాశాల అంశంపై ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ప్రసంగించారు. వస్తు రవాణా, ప్రయాణికుల రవాణా లాంటి మాధ్యమాలను మరింత అభివృద్ధి చేయాల్సి ఉందని తెలిపారు. పోర్టులు, ఎయిర్ పోర్టులు, రహదారి మార్గాలు, రైల్వే ఇలా వేర్వేరు రంగాలను విస్తృతం చేయాలని సూచించారు. భారత్‌లో లాజిస్టిక్స్ వ్యయం రూ.24.01 లక్షల కోట్లుగా ఉందని చెప్పుకొచ్చారు. జీడీపీలో లాజిస్టిక్స్ వాటా 7.97 శాతంగా ఉందని వివరించారు. రవాణా రంగంలో రోడ్ల ద్వారా జరిగే రవాణా 41 శాతం మేర వాటా కలిగి ఉందని తెలిపారు. లాజిస్టిక్స్‌కు అయ్యే వ్యయాన్ని తగ్గించగలిగితే ఉత్పత్తి వ్యయమూ తగ్గుతుందని వెల్లడించారు సీఎం చంద్రబాబు.
పైప్ లైన్ మార్గం కీలకం..
ఇది ఉత్పత్తిదారులు, వినియోగదారులతోపాటు అందరికీ ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొన్నారు. లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ ఎకో సిస్టమ్ లో రైలు, రోడ్డు, జల రవాణాతోపాటు పైప్‌లైన్ మార్గం కూడా కీలకంగా మారిందని చెప్పుకొచ్చారు. పైప్‌లైన్ ద్వారా గ్యాస్, నీరు, స్లర్రీ లాంటివి రవాణా చేసేందుకు ఆస్కారం ఉందని వెల్లడించారు. మల్టీమోడల్ ట్రాన్స్‌పోర్టు సిస్టమ్ ద్వారా హైయ్యర్ కార్గో రవాణా చేస్తే వ్యయం తక్కువ అవుతుందని వివరించారు. ఏపీకి ప్రస్తుతం డ్రై పోర్టుల ప్రాజెక్టులు పెద్దఎత్తున వస్తున్నాయని పేర్కొన్నారు. లాజిస్టిక్స్ ఎకో సిస్టమ్ లో మౌలిక సదుపాయాలే ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని ఉద్గాటించారు. దీని కోసం ఓ బ్లూ ప్రింట్ తయారు చేసి వ్యయం తగ్గించటమే లక్ష్యంగా పనిచేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఆ జిల్లాల్లో బ్లాక్ సాయిల్..
‘భారతదేశ లాజిస్టిక్స్ కాస్ట్ రూ.24 లక్షల కోట్లు. పాత్ హోల్స్ ఫ్రీ రోడ్లు చేయడానికి అన్ని ప్రయత్నాలు చేశాం. ఇంకా చాలా చేయాల్సి ఉంది. డబ్బులు ఎంతైనా ఫర్వాలేదు.. అయితే పాత్ హోల్ ఉంటే వదిలిపెట్టనని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డిని ఆదేశించాను. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో బ్లాక్ సాయిల్ అవ్వడంతో వెంటనే రోడ్లు దెబ్బతింటున్నాయి. రాయలసీమలో ఆ ఇబ్బంది ఉండదు. మొదట్లో గుంతల మూలంగా కోల్‌కత్తా నుంచి చెన్నైకి వెళ్లాలంటే నాలుగైదు రోజులు పట్టేది. అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పాయితో మాట్లాడి స్వర్ణ చతుర్బుజికి శ్రీకారం చుట్టాం. రోడ్లు నాగరికతకు చిహ్నం. 4,739 కిలోమీటర్లు జాతీయ రహదారులు ఏపీలో ఉన్నాయి. వెయ్యి స్కేర్ కిలోమీటర్లకు 53 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు ఉన్నాయి. ఇప్పుడున్నవి కాకుండా రెండు లైన్లు, నాలుగు రైల్వే లైన్లు చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అలాగే హైస్పీడ్ రైల్వే కారిడార్‌కూ కేంద్రం అంగీకరించింది’ అని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు.
విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు..
‘హైదరాబాద్- బెంగళూరు కారిడార్, హైదరాబాద్- చెన్నై కారిడార్ నాలుగు లైన్ల రైల్వే లైన్లు రాబోతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విశాఖపట్నంలో రైల్వేజోన్‌ను ఏర్పాటు చేశాం. ఆంధ్రప్రదేశ్ నుంచి హైస్పీడ్ రైళ్లు కూడా వెళ్లనున్నాయి. 1053 కిలోమీటర్ల సమద్రతీర ప్రాంతం ఏపీకి ఉంది. గుజరాత్ తర్వాత 320 మిలియన్ టన్నుల కెపాసిటీతో మనం హ్యాండిల్ చేయొచ్చు. అయితే 12 మిలియన్ టన్నులను మాత్రమే.. ఇప్పుడు హ్యాండిల్ చేయగలిగే రెండో స్థానంలో ఏపీ ఉంది. రామాయపట్నం ఏప్రిల్ 26వ తేదీకి, మచిలీపట్నం డిసెంబర్ 26వ తేదీకి పూర్తిచేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నాం. ఫిషింగ్ హర్బర్‌లు అన్ని పూర్తయితే మత్స్యకారులకు ఉపాధి లభిస్తోంది. అమరావతి నుంచి కృష్ణా నదిలో ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ కనెక్ట్ చేశాం. ఏపీలో ఆరు ఎయిర్‌పోర్టుల ఆపరేషన్ జరుగుతున్నాయి.. ఇంకొక్కటి విశాఖపట్నం ఎయిర్ పోర్టు నడుస్తోంది. విశాఖపట్నంలో రానున్న ఆగస్టు కల్లా మరో ఎయిర్ పోర్టు ఆపరేషన్‌కు వస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్యాసింజర్ ట్రాఫిక్ పెరిగింది’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వైసీపీ కీలక నేత కేసును సీబీఐకి అప్పగించిన హైకోర్టు
ఏపీ శాసనసభలో నాలా యాక్ట్ రద్దు బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం
Read latest AP News And Telugu News