Chandrababu On E-Governance: సాంకేతికతతో ప్రజల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Sep 22 , 2025 | 07:20 PM
పాలనలో డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ అత్యంత ముఖ్యమైన అంశమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సాంకేతికతతోనే ప్రజలకు పాలనను మరింత చేరువ చేసే అవకాశం ఉంటుందని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.
విశాఖపట్నం, సెప్టెంబర్ 22 (ఆంధ్రజ్యోతి): పాలనలో డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ (Digital Transformation) అత్యంత ముఖ్యమైన అంశమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. సాంకేతికతతోనే ప్రజలకు పాలనను మరింత చేరువ చేసే అవకాశం ఉంటుందని ఉద్ఘాటించారు. విశాఖలో కేంద్ర ఐటీ సమాచార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న జాతీయ ఈ-గవర్నెన్స్ సభకు (E Governance Conference Summit) సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సివిల్ సర్సీసెస్- డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ థీమ్‌తో జరుగుతున్న 28వ జాతీయ ఈ - గవర్ననెన్స్ సదస్సులో ప్రసంగించారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
మరింత సమర్థంగా పౌర సేవలు..
ప్రభుత్వ శాఖల ద్వారా అందే పౌర సేవలను మరింత సమర్థంగా నిర్వహించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ (Cyber Security) లాంటి సాంకేతికత కీలకమని చెప్పుకొచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఐటీ, ఈ -గవర్నెన్స్ అంశాలతో పాలనలో మార్పులు వచ్చాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కమ్యూనికేషన్ సంస్కరణల ద్వారా ప్రజా జీవనంలోనూ విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు. సాంకేతికతను అందిపుచ్చుకుని గతంలోనే ఉమ్మడి ఏపీలో ఈ-సేవ, మీ-సేవ ద్వారా ప్రభుత్వ శాఖలు అందించే పౌర సేవలను ప్రజల దగ్గరకు తీసుకెళ్లామని పేర్కొన్నారు.

సైబర్ సెక్యూరిటీ కీలకం..
ఈ-ఫైల్స్, ఈ-కేబినెట్ లాంటి అంశాలతో వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు ఆస్కారం ఏర్పడిందని తెలిపారు. అలాగే ఈ వ్యవస్థలను అమలు చేసే సమయంలో సైబర్ సెక్యూరిటీ కూడా అత్యంత కీలకమని స్పష్టం చేశారు. ఐటీతో వచ్చిన విస్తృత ప్రయోజనాలను అందిపుచ్చుకోగలుగుతున్నామని వెల్లడించారు. ఈ ప్రక్రియను మరింతగా ముందుకు తీసుకెళ్లేందుకు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్సు (WhatsApp Governance)ను అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు వివరించారు. మొత్తం 751 పౌరసేవలను వాట్సాప్ ద్వారా పౌరులకు అందిస్తూ పాలనను వారి మొబైల్ ఫోన్ల వరకూ తీసుకెళ్లామని తెలిపారు. మరోవైపు సాంకేతికత కారణంగా పొరుగు రాష్ట్రాలతోనూ పోటీ పెరిగిందని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.

క్వాంటం కంప్యూటర్ సేవలు..
ఆంధ్రప్రదేశ్‌లో ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ సంస్థలతో కలిసి క్వాంటమ్ వ్యాలీ (Quantum Valley)ని ఏర్పాటు చేస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. క్వాంటమ్ కంప్యూటర్ సేవలను ప్రభుత్వాలు, విద్య, వైద్య సంస్థలు వినియోగించుకునే అవకాశం ఉందని సూచించారు. క్వాంటమ్ వ్యాలీతో ఇక్కడ ఓ ఎకో సిస్టమ్ ఏర్పాటు అవుతోందని తెలిపారు. క్వాంటమ్ కంప్యూటర్లు, పరికరాల తయారీ సంస్థలు కూడా పెట్టుబడులతో ముందుకు వచ్చాయని వివరించారు. టెక్నాలజీ పరంగా సేవలు, ఉద్యోగాలు, ఉత్పాదన తదితర రంగాలూ వేగంగా మారుతున్నాయని.. ఈ పరిస్థితుల మధ్య వచ్చే 10 ఏళ్ల కాలం మన దేశానికి అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన స్వదేశీ ఉత్పత్తుల నినాదాన్ని స్వాగతిస్తున్నామని.. దానికి అనుగుణంగా దేశంలో తయారయ్యే ఉత్పత్తులు గ్లోబల్ బ్రాండ్స్‌గా మారాలని దిశానిర్దేశం చేశారు.

సంజీవని ప్రాజెక్టు అమలు...
ఏపీలో వైద్య సేవలను టెక్నాలజీతో అనుసంధానం చేసే సంజీవని ప్రాజెక్టు ( Sanjeevani Project) చేపట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. బిల్‌గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి డిజిటల్ హెల్త్ రికార్డులను రూపొందిస్తున్నామని.. త్వరలోనే ఈ వ్యవస్థను మొత్తం దేశానికి అమలు చేసేందుకు ఆస్కారం ఉందని పేర్కొన్నారు. సాంకేతికతను అందిపుచ్చుకుని ప్రజలకు ఏ మేరకు ఈజ్ ఆఫ్ లివింగ్‌ను చేరువ చేశామన్న అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. గతంలో బీపీఓ విధానాన్ని అందిపుచ్చుకోవటం ద్వారా పెద్దఎత్తున యువతకు ఉద్యోగ అవకాశాలు లభించాయని.. ఇప్పుడు కొన్ని యాప్‌ల ద్వారా వచ్చే ఆర్థిక ప్రయోజనాలు విదేశాలకు వెళ్తున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు సీఎం చంద్రబాబు. టెక్నాలజీలో మరో కీలకమైన అంశంగా సెమీకండక్టర్ల పరిశ్రమపైనా దృష్టిపెట్టాలని అన్నారు. ఓ సెమీ కండక్టర్ పరిశ్రమను ఏపీకి కేటాయించటంపై ప్రధానికి సీఎం ధన్యవాదాలు తెలిపారు. సమీప భవిష్యత్తులో స్పేస్, డ్రోన్, ఎలక్ట్రానిక్ సిటీ, మెడ్ టెక్ పార్కుల ద్వారా జాతీయ అభివృద్ధిలో ఏపీ కూడా ప్రధాన భాగస్వామి అవుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా డిజిటల్ ఏపీ సంచికను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఎస్ కె.విజయానంద్ తోపాటు కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈ వార్తలు కూడా చదవండి..
సాంకేతిక పరిజ్ఞానంతో కాలుష్య నియంత్రణను పటిష్టం చేయాలి: పవన్ కల్యాణ్
జీఎస్టీ సంస్కరణలతో మేడిన్ ఇండియా మరింత బలోపేతం: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News