Pawan Kalyan ON PCB Reforms: సాంకేతిక పరిజ్ఞానంతో కాలుష్య నియంత్రణను పటిష్టం చేయాలి
ABN , Publish Date - Sep 22 , 2025 | 06:08 PM
పీసీబీని అడ్డుపెట్టుకొని వ్యక్తిగత ప్రయోజనాలను పొందాలని భావించే వారి విషయంలో జాగరూకతతో వ్యవహారించాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. ఏపీలో పెట్టుబడులను ప్రోత్సహిస్తూనే.. కాలుష్యాన్ని నియంత్రించేలా ముందుకు వెళ్లాలని పవన్ కల్యాణ్ మార్గనిర్దేశం చేశారు.
అమరావతి, సెప్టెంబర్ 22 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీలోని తన చాంబర్‌లో అటవీ, పర్యావరణ ముఖ్య కార్యదర్శితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సమావేశమయ్యారు. తెలుగుదేశం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చేసిన ఆరోపణలపై మరోసారి సమీక్షించారు పవన్ కల్యాణ్. పీసీబీని అడ్డుపెట్టుకొని వ్యక్తిగత ప్రయోజనాలను పొందాలని భావించేవారి విషయంలో జాగరూకతతో వ్యవహారించాలని దిశానిర్దేశం చేశారు. ఏపీలో పెట్టుబడులను ప్రోత్సహిస్తూనే... కాలుష్యాన్ని నియంత్రించేలా ముందుకు వెళ్లాలని మార్గనిర్దేశం చేశారు పవన్ కల్యాణ్.
అలా అని పారిశ్రామికవేత్తలను పారిపోయే పరిస్థితి తీసుకురాకూడదని చెప్పుకొచ్చారు. గత జగన్ ప్రభుత్వంలో అలాంటి తప్పిదాలే చోటు చేసుకున్నాయని గుర్తుచేశారు. ఎల్జీ పాలిమర్స్ లాంటి సంస్థల్లో చోటు చేసుకున్న ప్రమాదాల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. విశాఖపట్నం ప్రాంతంలో చాలా ఫార్మా సంస్థలు ఉన్నాయని.. వాటిలో కాలుష్య నియంత్రణ నిబంధనలు అమలుపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు పవన్ కల్యాణ్.
నిబంధనల అమల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని మార్గనిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వం పాలన ప్రారంభించిన తొలి రోజుల్లోనే పీసీబీపై సమీక్షించి దిశానిర్దేశం చేశామని గుర్తుచేశారు. భావితరాలకు సాధ్యమైనంత స్వచ్ఛమైన గాలి, నీరు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు. కాలుష్య నియంత్రణ మండలిని బలోపేతం చేయాలని సూచించారు. కాలుష్య నియంత్రణ మండలి సిబ్బంది విధులు సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని దిశానిర్దేశం చేశారు. కాలుష్య నియంత్రణ మండలి విధులు, నిధులు, ప్రస్తుత పరిస్థితి ప్రజలకు తెలియాలని పవన్ కల్యాణ్ సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ మార్పులతో ముందుగానే దసరా: బీజేపీ
ఎన్టీటీపీఎస్ కాలుష్యంపై మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు
Read Latest AP News And Telugu News