CM Chandrababu on Srisailam: శ్రీశైలం ఆలయ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ఫోకస్
ABN , Publish Date - Oct 05 , 2025 | 02:03 PM
శ్రీశైలం ఆలయ అభివృద్ధిపై ఏపీ సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
అమరావతి, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవస్థానం అభివృద్ధి (Srisailam Temple Development)పై దేవదాయ, అటవీశాఖలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) ఇవాళ (ఆదివారం) సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలిగిన దివ్యక్షేత్రంగా వెలుగొందుతున్న ఆలయ సమగ్రాభివృద్దిపై చర్చించారు. ప్రతి ఏడాది లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నందున వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించే ప్రణాళికలపై దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు.
తిరుమల తరహాలోనే శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ధి చేసేలా కార్యాచరణకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఆధ్యాత్మికంగా, పర్యాటక ప్రాంతంగా, పర్యావరణ పరంగా శ్రీశైలం ప్రాంతాన్ని అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రచించాలని ముఖ్యమంత్రి మార్గనిర్దేశం చేశారు. దేవాలయ అభివృద్ధి కోసం 2 వేల హెక్టార్ల భూమిని దేవదాయశాఖకు కేటాయించేలా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. శ్రీశైల క్షేత్రానికి జాతీయ రహదారులను అనుసంధానించేలా ప్రణాళికలు చేయాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు.
శ్రీశైలంలోని పులుల అభయారణ్యం అభివృద్ధికి పలు సూచనలు చేశారు సీఎం చంద్రబాబు. భక్తుల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతున్న కారణంగా ఆలయ సమగ్రాభివృద్ధికి సత్వర చర్యలు అవసరమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున భక్తులు వస్తున్న సందర్భంగా సౌకర్యాలు విస్తరించాలని పవన్ కల్యాణ్ మార్గనిర్దేశం చేశారు. శబరిమలతో సహా ఇతర ప్రముఖ దేవాలయాల్లో సౌకర్యాలను పరిశీలించి శ్రీశైలాన్ని అభివృద్ధి చేద్దామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. ఎట్టకేలకు అమరావతిలోని సీఆర్డీఏ భవనానికి మోక్షం
వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు
Read Latest AP News And Telugu News