AP Cabinet Meet: ఏపీ మంత్రిమండలి భేటీ ప్రారంభం.. 44 అంశాలపై కీలక చర్చ
ABN , Publish Date - Dec 11 , 2025 | 10:31 AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏపీ మంత్రి మండలి సమావేశం గురువారం జరుగుతోంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై మంత్రులతో చర్చిస్తున్నారు సీఎం చంద్రబాబు.
అమరావతి, డిసెంబరు11(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) నేతృత్వంలో ఏపీ మంత్రి మండలి సమావేశం (AP Cabinet Meet) ఇవాళ(గురువారం) జరుగుతోంది. ఈరోజు ఉదయం 10:30కు కేబినెట్ భేటీ రాష్ట్ర సచివాలయంలో ప్రారంభమైంది. మొత్తం 44 అంశాలపై మంత్రి మండలి సమావేశంలో సీఎం చర్చిస్తున్నారు. ఎస్‌ఐపీబీలో ఆమోదం పొందిన ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేయనున్నారు.
సీఆర్డీఏ అథారిటీ నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది కేబినెట్. అమరావతి నిర్మాణానికి నాబార్డు నుంచి రూ.7380.70 కోట్లు రుణం తీసుకునేందుకు సీఆర్డీఏకు అనుమతి ఇవ్వనుంది. సీడ్ యాక్సిస్ రహదారిని 16వ జాతీయ రహదారికి అనుసంధానించే పనులకు రూ.532 కోట్ల మేర ఆమోదం తెలపనుంది.
పలు సంస్థలకు భూములు కేటాయించేలా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. రూ.169 కోట్లతో లోక్ భవన్ (గవర్నర్ బంగ్లా) నిర్మాణానికి టెండర్లు పిలిచేందుకు ఆమోదం తెలపనుంది. రూ. 163 కోట్లతో జ్యూడిషియల్ అకాడమీకి పరిపాలనా అనుమతులకు ఆమోదించనుంది. రూ. 20 వేల కోట్లు పెట్టుబడులు, 56 వేల ఉద్యోగాల కల్పనకు ఆమోదం తెలపనుంది మంత్రివర్గం.
కుప్పంలో పాలేరు నదిపై చెక్‌డ్యామ్‌ల నిర్వాహణకు పరిపాలన అనుమతుల మంజూరుపై మంత్రి మండలి ఓ నిర్ణయం తీసుకోనుంది. గిరిజన సంక్షేమ శాఖలో 417 భాషా పండితుల పోస్టులను స్కూల్ అసిస్టెంట్‌లుగా పదోన్నతి చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ ముసాయిదా బిల్లుపై కేబినెట్‌లో చర్చించనుంది. ఎస్‌ఐపీబీలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలపై మాట్లాడనున్నారు. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశ నిర్ణయాలకు ఆమోదంపై చర్చించనుంది కేబినెట్.
రూ.9,500 కోట్లతో 506 ప్రాజెక్టులకు పరిపాలన అనుమతులకు ఆమోదం తెలపనుంది కేబినెట్. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో సమగ్ర నీటి నిర్వాహణకు సంబంధించిన ప్రాజెక్టులపై చర్చించనుంది. అమరావతిలో లోక్‌భవన్, అసెంబ్లీ దర్బార్ హాల్ నిర్మాణాలకు ఆమోదంపై ఓ నిర్ణయం తీసుకోనుంది. గవర్నర్ కార్యాలయం, గెస్ట్ హౌస్‌లు, స్టాఫ్ క్వార్టర్ల నిర్మాణానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
గోల్డీ హైదర్‌తో మంత్రి లోకేశ్ కీలక భేటీ.. పెట్టుబడులపై చర్చ
ఇంద్రకీలాద్రిలో భవాని దీక్ష విరమణలు ప్రారంభం.. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీ
Read Latest AP News And Telugu News