Share News

Lokesh Meets CP Radhakrishnan: సీపీ రాధాకృష్ణన్‌.. క్రమశిక్షణ, పట్టుదలకు మారుపేరు

ABN , Publish Date - Aug 18 , 2025 | 08:29 PM

ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన సీపీ రాధాకృష్ణన్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ న్యూఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైనందుకు టీడీపీ తరపున శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేసిన అనుభవం రాబోయే రోజుల్లో దేశానికి సమర్థవంతమైన సేవలు అందించడానికి ఉపకరిస్తోందని నారా లోకేష్ పేర్కొన్నారు.

Lokesh Meets CP Radhakrishnan:  సీపీ రాధాకృష్ణన్‌.. క్రమశిక్షణ, పట్టుదలకు మారుపేరు
AP Minister Nara Lokesh Meets CP Radhakrishnan

న్యూఢిల్లీ, ఆగస్టు18 (ఆంధ్రజ్యోతి): ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన సీపీ రాధాకృష్ణన్‌ను (CP Radhakrishnan) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (AP Minister Nara Lokesh) న్యూఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైనందుకు టీడీపీ తరపున శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేసిన అనుభవం రాబోయే రోజుల్లో దేశానికి సమర్థవంతమైన సేవలు అందించడానికి ఉపకరిస్తోందని పేర్కొన్నారు. క్రమశిక్షణ, పట్టుదలకు మారుపేరైన రాధాకృష్ణన్ తమలాంటి కొత్తతరానికి ఆదర్శంగా నిలుస్తారని ప్రశంసలు కురిపించారు. సీఎం నారా చంద్రబాబు నాయుడుతో తన పరిచయాన్ని లోకేశ్‌తో సీపీ రాధాకృష్ణన్ పంచుకున్నారు.

కాగా, ఈనెల 20వ తేదీన ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా నామినేషన్‌ దాఖలు చేయనున్నారు సీపీ రాధాకృష్ణన్‌. ఎల్లుండి(బుధవారం) ఉదయం 11గంటలకు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు రాధాకృష్ణన్‌. నామినేషన్‌ కార్యక్రమానికి ఎన్డీఏ పార్టీల పార్లమెంటరీ పార్టీ నేతలు, ఉభయ సభల పక్ష నేతలు, ముఖ్యనేతలు హాజరుకానున్నారు.


కేంద్ర మంత్రి సర్బానంద సోనవాల్‌తో లోకేష్ భేటీ..

మరోవైపు.. కేంద్ర షిప్పింగ్, ఓడరేవులు, జల రవాణా శాఖల మంత్రి సర్బానంద సోనవాల్‌తో మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ భేటీకి సంబంధించిన విషయాలను మీడియాకు లోకేష్ వెల్లడించారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్‌లో కీలకమైన మారిటైమ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, పోర్టుల ఆధారిత అభివృద్ధి, జలరవాణా ప్రాజెక్టులకు సహకారం అందించాలని కేంద్రానికి విజ్జప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం కింద హామీ ఇచ్చిన దుగ్గిరాజపట్నం ఓడరేవును వేగవంతం చేయాలని సూచించారు. దుగరాజపట్నం నౌకానిర్మాణం, ఓడరేవు క్లస్టర్ అభివృద్ధి కోసం గుర్తించారని అన్నారు. అక్కడ ప్రధాన ఓడరేవుతోపాటు రెండు వేల ఎకరాల్లో రూ.3,500 కోట్ల పెట్టుబడితో నౌకా నిర్మాణం, మరమ్మతు కేంద్రం నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు మంత్రి నారా లోకేష్.


భారీగా ఉద్యోగాలు, పెట్టుబడులు...

పోర్టు అనుబంధ రంగాల్లో రూ.26వేల కోట్ల పెట్టుబడులు, 5వేల ప్రత్యక్ష, 30వేల పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయని చెప్పుకొచ్చారు. దీనిద్వారా నెల్లూరు జిల్లా అభివృద్ధిని మరింతగా పెంచుతోందని వెల్లడించారు. దుగరాజపట్నం పోర్టుకు రాష్ట్ర ఈక్విటీగా భూమిని ఇప్పటికే సేకరించి ఇచ్చామని, ఎస్పీవీ మోడల్‌లో ప్రపంచస్థాయి భాగస్వాములను ఆకర్షించి పారిశ్రామిక కారిడార్లతో అనుసంధానించాలన్నది ఏపీ ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు. సాగర్ మాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో రూ.1.14లక్షల కోట్ల విలువైన 110 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ యాంకరేజి పోర్టుల్లో వార్ఫ్‌లు, స్లిప్ వేల అప్‌గ్రేడ్, జీవవైవిధ్యం కోసం రూ.200 కోట్లు మంజూరు చేయాలని కోరారు మంత్రి నారా లోకేష్.


జలమార్గాలను అభివృద్ధి చేయాలి..

గోదావరి – కృష్ణానదులపై కొత్త జలరవాణా మార్గాలు, కార్గో టెర్మినల్స్, ఫ్లోటింగ్ జెట్టీల అభివృద్ధికి రూ.127.5 కోట్లు మంజూరు చేయాలని సూచించారు. పోర్టుల్లో రవాణా కార్యకలాపాల అభివృద్ధికి ఆయా పోర్టులకు అనుసంధానంగా మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. రివర్ టూరిజాన్ని ప్రోత్సహించడంలో భాగంగా అమరావతి నుంచి విజయవాడ స్ట్రెచ్ 2తో సహా పట్టణ జలమార్గాలను అభివృద్ధి చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోందని పేర్కొన్నారు. పీపీపీ మోడల్‌లో చేపట్టే ఈ ప్రాజెక్టుల వల్ల రోడ్ల రద్దీని తగ్గించడమేగాక సరుకును జలమార్గాలకు మోడల్ షిఫ్ట్‌ను సులభతరం చేస్తాయని తెలిపారు. ఏపీలోని తీరప్రాంతంలో పోర్టు ఆధారిత అభివృద్ధి ద్వారా యువతకు ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, గ్లోబల్ కాంపిటీటివ్ నెస్‌పై దృష్టిసారించామని, ఏపీలో సామాజిక, ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చే ఈ ప్రాజెక్టులకు కేంద్రం సహాయం అందించడంతోపాటు అనుమతులు మంజూరు చేయాల్సిందిగా మంత్రి నారా లోకేష్ కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి

కాకాణి గోవర్ధన్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్

కేంద్రమంత్రులతో నారా లోకేష్ భేటీ.. ఎందుకంటే..

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 18 , 2025 | 08:37 PM