AP Legislative Council ON Key Bills: కీలక బిల్లులకు ఏపీ శాసన మండలి ఆమోదం
ABN , Publish Date - Sep 22 , 2025 | 02:52 PM
ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో సోమవారం పలు కీలక బిల్లులపై చర్చ జరిగింది. చర్చల అనంతరం ఈ బిల్లులకు శాసన మండలి ఆమోదం తెలిపింది. మోటార్ వెహికిల్ ట్యాక్సేషన్ సవరణ బిల్లు -2025ను శాసన మండలి ఆమోదించింది.
అమరావతి, సెప్టెంబర్ 22 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ శాసన మండలి (AP Legislative Council)లో ఇవాళ(సోమవారం) పలు కీలక బిల్లులపై చర్చ జరిగింది. చర్చల అనంతరం ఈ బిల్లులకు శాసన మండలి ఆమోదం తెలిపింది. మోటార్ వెహికిల్ ట్యాక్సేషన్ సవరణ బిల్లు -2025ను శాసన మండలి ఆమోదించింది. వాహనాలపై హరితపన్నును తగ్గిస్తూ చేసిన ప్రతిపాదలనలకు శాసన మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ స్టేట్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్ సవరణ బిల్లు-2025ను శాసన మండలి ఆమోదించింది. ఎస్టీ కమిషన్ చైర్మన్‌కు 65 ఏళ్ల వయోపరిమితిని తొలగించే బిల్లు ప్రతిపాదనకు సైతం పచ్చజెండా ఊపింది. ఆంధ్రప్రదేశ్ ప్రివెన్షన్ ఆఫ్ బెగ్గింగ్ సవరణ బిల్లును శాసన మండలి ఆమోదించింది. భిక్షాటన నిరోధక చట్టంలో అభ్యంతర కరమైన రెండు పదాలను తొలగిస్తూ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది.
కుష్టువ్యాధికి సంబంధించి లెపర్, లునటిక్ పదాలను తొలగిస్తూ చట్టసవరణ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ సవరణ బిల్లు -2025కు శాసన మండలి ఆమోదం తెలిపింది. కార్మికుల రోజువారి పనిగంటలు 8 నుంచి 10 గంటలకు పెంచడం, విశ్రాంతి విరామం సడలింపు చేస్తూ చట్ట సవరణ బిల్లుకు పచ్చజెండా ఊపింది. సురక్షిత విధానాలు, షరతులతో మహిళలకు నైట్ డ్యూటీ అమలు చేసేలా చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. రాత్రి 8:30 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మహిళలు విధులు నిర్వహించేందుకు అనుమతి ఇస్తూ పెట్టిన బిల్లుకు శాసన మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. వారానికి 48 గంటల పనివిధానం యథాతథంగా అమలువుతుందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు.
వారానికి 48 గంటల పని తర్వాత కార్మికులు వారాంతపు సెలవు తీసుకోవచ్చని మంత్రి సుభాష్ క్లారిటీ ఇచ్చారు. చట్టంలో సవరించిన అంశాలను పున:పరిశీలన చేయాలని మండలిలో విపక్షనేత బొత్స సత్యనారాయణ సూచించారు. మహిళలకు రాత్రి విధుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని చెప్పుకొచ్చారు. కార్మిక సంఘాలతో చర్చించి అందరి అభిప్రాయాలతో ప్రవేశపెట్టి ఆమోదించాలని కోరారు.
పనిగంటల పెంపు, మహిళలకు రాత్రి విధులపై ప్రభుత్వం పున:పరిశీలన చేయాలని సూచించారు. మహిళలకు సమాన పనిగంటలతోపాటు, సమాన సంఖ్యలో నియామకాలు చేపట్టేలా సవరణ చేయాలని కోరారు బొత్స సత్యనారాయణ. అవకాశం ఉన్న రూల్స్ అన్నీ జీవో నిబంధనల్లో చేర్చుతామని స్పష్టం చేశారు మంత్రి పయ్యావుల కేశవ్. చట్ట సవరణ చేసే బిల్లు వల్ల మహిళలు, కార్మికులకు ఇబ్బందికర పరిస్థితి వస్తుందని విపక్ష నేత బొత్స సత్యనారాయణ తెలిపారు.
సవరణ బిల్లును తాము సమర్థించలేమని, ఆమోదంలో భాగస్వామ్యులం కాలేమని బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు. చట్ట సవరణతో ప్రజా ప్రయోజనాలు, కార్మికుల ప్రయోజనాలు, మహిళా కార్మికుల రక్షణ , శ్రేయస్సుకు ఆటంకం కలిగిస్తుందని పేర్కొన్నారు. ఏపీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ వాకౌట్ చేస్తున్నట్లు తెలిపారు విపక్ష నేత బొత్స సత్యనారాయణ. అనంతరం ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్టరీస్ సవరణ బిల్లు -2025కు శాసన మండలి ఆమోదించింది.
ఏపీ ఫ్యాక్టరీస్ లీవ్ టు విత్ డ్రా సవరణ బిల్లుకు శాసన మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కార్మికులకు రక్షణ, పరిశ్రమలకు సౌలభ్యం కలిగించేందుకే చట్ట సవరణలు చేస్తున్నామని మంత్రి వాసం శెట్టి సుభాష్ తెలిపారు. పనిగంటల్లో సరళత, రోజు వారీ పనిగంటలు పెంచడం, ఓవర్ టైమ్ పెంచడం ద్వారా పారిశ్రామిక ఉత్పత్తి పెంచడమే లక్ష్యమని మంత్రి సుభాష్ వెల్లడించారు. పారిశ్రామిక అవసరాల మేరకు కార్మిక చట్టాలను సవరించామని మంత్రి వాసం శెట్టి సుభాష్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ మార్పులతో ముందుగానే దసరా: బీజేపీ
ఎన్టీటీపీఎస్ కాలుష్యంపై మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు
Read Latest AP News And Telugu News