Anitha: ఆధునాతనంగా మోడల్ పోలీస్‌స్టేషన్‌ల నిర్మాణం: హోంమంత్రి అనిత
ABN , Publish Date - Dec 15 , 2025 | 11:29 AM
ఆధునాతనంగా మోడల్ పోలీస్‌స్టేషన్‌ల నిర్మాణం చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. ఏపీ పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ తరపున అనేక మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు.
అమరావతి, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): చాలా మోడల్ పోలీస్టేషన్‌లను 2019కు ముందు తాము కట్టామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత (AP Home Minister Vangalapudi Anitha) వ్యాఖ్యానించారు. గత జగన్ ప్రభుత్వంలో మోడల్ పోలీస్టేషన్‌లను పట్టించుకోలేదని విమర్శించారు. తమను అరెస్టు చేసి ఇదే మోడల్ పోలీస్టేషన్‌లో కూర్చోపెట్టారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ మోడల్ స్టేషన్లు నిర్మాణం చేస్తున్నామని పేర్కొన్నారు. కొత్త జిల్లాలు ఏర్పడిన వాటిలో కార్యాలయాలు లేవని.. నిర్మాణాలు చేయాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా కళ్యాణం శివ శ్రీనివాస్ (కేకే) ఇవాళ(సోమవారం) బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా కళ్యాణం శ్రీనివాస్‌కు ధన్యవాదాలు తెలిపారు హోంమంత్రి అనిత. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హోంమంత్రి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జనసేన ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, చిల్లపల్లి శ్రీనివాసరావు, చక్రవర్తి, పలువురు కూటమి పార్టీల నేతలు, కార్పొరేషన్ ఎండీ రవిప్రకాష్, జనరల్ ఫైనాన్స్ మేనేజర్ సీతారామరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు హోంమంత్రి అనిత. ఏపీ పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ తరపున అనేక మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు హోంమంత్రి అనిత.
ఎండీ రవి ప్రకాశ్ సారథ్యంలో పలు నిర్మాణాలు చేపట్టారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.509కోట్లతో అనేక భవనాల నిర్మాణం చేశామని వివరించారు. ఉమ్మడి ఏపీలో చర్లపల్లి, విశాఖపట్నం, జైళ్లు, ఆక్టోపస్, పోలీసు అకాడమీ వంటి అనేక నిర్మాణాలు ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ తరపున జరిగాయని తెలిపారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అనేక మోడల్ పోలీస్టేషన్‌ల నిర్మాణం చేపట్టామని చెప్పుకొచ్చారు. రూ.179 కోట్లతో కొత్తగా నిర్మాణాలు చేపట్టబోతున్నామని వెల్లడించారు. రూ.412 కోట్లతో గ్రేహౌండ్స్ నిర్మాణం త్వరలోనే ప్రారంభం అవుతుందని వివరించారు హోంమంత్రి అనిత.
రూ.300 కోట్లతో ఏపీ పోలీసు అకాడమీ నిర్మాణం చేసుకోవాలని సూచించారు. నేడు పోలీసు హౌసింగ్ చేతిలో రూ. 1000 కోట్ల ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయిని తెలిపారు. ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్, ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ రవిప్రకాశ్‌ల సారథ్యంలో ఈ నిర్మాణాలు విజయవంతంగా పూర్తి చేయాలని కోరారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల ఆశీర్వాదంతో తమకు పదవులు లభించాయని చెప్పుకొచ్చారు. కళ్యాణం శివ శ్రీనివాస్ తన మార్కుతో మంచి ఫలితాలు సాధించాలని కోరుకుంటున్నామని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.
రెండేళ్లలో ఆ పనులు పూర్తి చేస్తాం: కళ్యాణం శ్రీనివాస్
గత జగన్ ప్రభుత్వంలో పోలీసు గృహ నిర్మాణ సంస్థలో ఎలాంటి నిర్మాణాలు చేయలేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణం శ్రీనివాస్ విమర్శించారు. తాను పోలీసు అవ్వాలని అనుకున్నా సాధ్యం కాలేదని చెప్పుకొచ్చారు. నేడు బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.
తనకు ఈ అవకాశం ఇచ్చిన అధినేతలకు ధన్యవాదాలు తెలిపారు. పోలీసు హౌసింగ్ తరపున రూ. 1200 కోట్ల నిర్మాణాలు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. పదవి అంటే కుర్చీలో కూర్చోవడం కాదని... తన మార్కు పనితనం చూపిస్తానని వెల్లడించారు. హోంమంత్రి అనిత, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాతో పాటు అధికారులు, సిబ్బంది సహకారంతో నిర్మాణాలు పూర్తి చేస్తామని చెప్పుకొచ్చారు. తనకు ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకుని రెండేళ్లలో పనులు పూర్తి చేస్తామని తెలిపారు. తప్పకుండా అన్ని ప్రాజెక్టులను నాణ్యతతో పూర్తి చేసి పోలీసు గృహ నిర్మాణ సంస్థకు మరింత పేరు తీసుకువస్తానని కళ్యాణం శ్రీనివాస్ పేర్కొన్నారు.
ఈ ఏడాది ముప్పై ఫైర్ స్టేషన్ల నిర్మాణం చేపట్టాం: రవి ప్రకాశ్
పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ తరపున పోలీస్టేషన్ భవనాల నిర్మాణం, ఫైర్ స్టేషన్లు నిర్మాణం చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ రవి ప్రకాశ్ వ్యాఖ్యానించారు. ఈ ఏడాది ముప్పై ఫైర్ స్టేషన్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. చైర్మన్‌గా కళ్యాణం శ్రీనివాసరావు ఇవాళ బాధ్యతలు చేపట్టారని వివరించారు. అందరం కలిసి ఈ సంస్థ ద్వారా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని రవి ప్రకాశ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జీవీఎంసీకి ప్రతిష్టాత్మక అవార్డులు
విశాఖ బీచ్ రోడ్డులో ఉత్సాహంగా నేవీ మారథాన్
Read Latest AP News And Telugu News