Share News

AP High Court: వైసీపీ ఎంపీ పిల్‌పై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం

ABN , Publish Date - Nov 05 , 2025 | 08:56 PM

వీఆర్‌లో ఉన్న పోలీస్ అధికారులకు జీతాలు రావడం లేదని వైసీపీ ఎంపీ గురుమూర్తి ఆంధ్రప్రదేశ్ హై కోర్టులో పిల్ వేశారు. ఎంపీ గురుమూర్తి వేసిన పిటిషన్‌పై బుధవారం చీఫ్ జస్టిస్ ధర్మాసనం విచారణ చేపట్టింది.

AP High Court: వైసీపీ ఎంపీ పిల్‌పై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం
AP High Court

అమరావతి, నవంబరు5 (ఆంధ్రజ్యోతి): వీఆర్‌లో ఉన్న పోలీస్ అధికారులకు జీతాలు రావడం లేదని వైసీపీ ఎంపీ గురుమూర్తి (YSRCP MP Gurumurthy) ఆంధ్రప్రదేశ్ హై కోర్టులో (AP High Court) పిల్ వేశారు. ఎంపీ గురుమూర్తి వేసిన పిటిషన్‌పై ఇవాళ(బుధవారం) చీఫ్ జస్టిస్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా న్యాయస్థానం పలు ప్రశ్నలని ఎంపీకి సంధించింది. పోలీస్ సేవలను ఎక్కడ వినియోగించుకోవాలో పోలీసు శాఖకు బాగా తెలుసని చెప్పుకొచ్చింది. పోలీసులకు ఫలానా విధులని అప్పగించాలని తాము ఎలా ఆదేశించగలమని ధర్మాసనం ప్రశ్నించింది.


జీతాలు రాకుంటే ఆ పోలీసులే నేరుగా కోర్టును ఆశ్రయించవచ్చు కదా..? అని అడిగింది. పోలీసుల తరపున వైసీపీ ఎంపీ గురుమూర్తి ఎలా పిల్ దాఖలు చేస్తారని ప్రశ్నించింది. వీఆర్‌లో ఉన్న పోలీసులు ఎదుర్కొంటున్న సమస్యలను లేవనెత్తుతూ పోలీస్ అధికారుల సంఘం లేదా జీతాలు అందని పోలీసులు ఎవరూ తమను ఆశ్రయించలేదని హైకోర్టు గుర్తు చేసింది. మార్గదర్శకాలు అమలు చేయకుంటే కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంబించే అధికారం తమకు లేదని పేర్కొంది ధర్మాసనం.


అయితే, పేద, అణగారిన వర్గాల గొంతుకను వినిపించేందుకే పిల్ వేసినట్లు వైసీపీ ఎంపీ గురుమూర్తి హైకోర్టుకు తెలిపారు. పోలీసులు ఆ నిర్వచనం పరిధిలోకి రారని తేల్చిచెప్పింది. సుప్రీంకోర్టు ఆదేశాల అమలుకు తగిన వేదికను ఆశ్రయించాలని పిటిషనర్‌కు సూచించింది. ఈ నేపథ్యంలో పిల్‌ను కొట్టివేసింది ధర్మాసనం. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి...

జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్

భారీ పెట్టబడులు, ఒప్పందాలకు విశాఖ వేదిక.. మంత్రి డీబీవీ స్వామి కీలక వ్యాఖ్యలు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 05 , 2025 | 09:02 PM