Share News

AP DSC Recruitment: డీఎస్సీ మెరిట్ జాబితా.. అభ్యర్థులకు అలర్ట్

ABN , Publish Date - Aug 21 , 2025 | 08:41 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారదర్శకంగా డీఎస్సీ నియామకాలు చేపడుతోందని డీఎస్సీ-2025 కన్వీనర్‌ ఎంవీ కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. అర్హులైన అభ్యర్థులను పారదర్శకంగా నియమించడమే ప్రభుత్వ దృఢ సంకల్పమని వ్యాఖ్యానించారు. స్పోర్ట్స్ కోటా మెరిట్ జాబితా కూడా పూర్తి అయిన నేపథ్యంలో ఈ నెల 22వ తేదీన మెరిట్ లిస్ట్ విడుదల చేయడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.

AP DSC Recruitment: డీఎస్సీ  మెరిట్ జాబితా.. అభ్యర్థులకు అలర్ట్
AP DSC Recruitment

అమరావతి, ఆగస్టు21(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) పారదర్శకంగా డీఎస్సీ నియామకాలు (AP DSC Recruitment) చేపడుతోందని డీఎస్సీ-2025 కన్వీనర్‌ ఎంవీ కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. అర్హులైన అభ్యర్థులను పారదర్శకంగా నియమించడమే ప్రభుత్వ దృఢ సంకల్పమని వ్యాఖ్యానించారు. స్పోర్ట్స్ కోటా మెరిట్ జాబితా కూడా పూర్తి అయిన నేపథ్యంలో ఈ నెల 22వ తేదీన మెరిట్ లిస్ట్ విడుదల చేయడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. మెరిట్ లిస్ట్ జాబితా డీఎస్సీ అధికారిక వెబ్‌సైటుతో పాటు జిల్లా విద్యాధికారి వెబ్‌సైటులో కూడా ఉంచుతామని తెలిపారు.


అభ్యర్థులు ఈ వెబ్‌సైట్స్ నుంచి మాత్రమే సమాచారం పొందాలని సూచించారు. వివిధ కేటగిరీలకు సంబంధించిన పోస్టుల నియామక ప్రక్రియలో భాగంగా ‘జోన్ ఆఫ్ కన్సిడరేషన్’ లోకి వచ్చిన అభ్యర్థులకు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్ అందించబడుతుందని క్లారిటీ ఇచ్చారు. సదరు అభ్యర్థులు సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఇటీవల తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రం, గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించిన మూడు సెట్ల జిరాక్స్ కాపీలు, 5 పాస్‌పోర్టు సైజు ఫొటోలతో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుందని తెలిపారు. వెరిఫికేషన్‌కు హాజరు కావడానికి మునుపే సంబంధిత సర్టిఫికెట్లను వెబ్‌సైట్స్‌లో అప్‌లోడ్ చేయడం తప్పనిసరని డీఎస్సీ-2025 కన్వీనర్‌ ఎంవీ కృష్ణారెడ్డి పేర్కొన్నారు.


వెరిఫికేషన్ సమయంలో సమర్పించాల్సిన సర్టిఫికెట్ల వివరాలతో కూడిన చెక్‌లిస్ట్ డీఎస్సీ వెబ్‌సైట్స్‌లో అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు. సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో అభ్యర్థి హాజరు కాకపోయినా, సరైన సర్టిఫికెట్లు సమర్పించకపోయినా, తగిన విద్యార్హతలు లేనట్లుగా రుజువైనా మెరిట్ లిస్టులో తర్వాత ఉన్న అభ్యర్థికి అవకాశం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఉపాధ్యాయ ఉద్యోగం ఇప్పిస్తామని దళారులు చెప్పే మాటలు, కొంతమంది సోషల్ మీడియా వేదికగా, అసత్య వదంతులు వ్యాప్తి చేస్తూ అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తూ, అభ్యర్థుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారనిపేర్కొన్నారు. ఇలాంటి దుష్ప్రచారాలను నమ్మి అభ్యర్థులు మోసపోవద్దని డీఎస్సీ-2025 కన్వీనర్‌ ఎంవీ కృష్ణారెడ్డి సూచించారు.


ఇలాంటి వదంతులు సృష్టించి వ్యాప్తి చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అభ్యర్థులు కేవలం డీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న ప్రకటనలు, నోటిఫికేషన్లు, ఫలితాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. అభ్యర్థుల వ్యక్తిగత స్కోర్లు, మెరిట్ లిస్ట్, ఎంపిక జాబితాలు, నియామక ఉత్తర్వులు మెగా డీఎస్సీ అధికారిక వెబ్‌సైట్స్, జిల్లా విద్యాధికారి వెబ్‌సైట్, క్యాండిడేట్ లాగిన్ నందు, ప్రభుత్వం ద్వారా విడుదల చేసే పత్రికా ప్రకటనల ద్వారా మాత్రమే తెలియజేస్తామని డీఎస్సీ-2025 కన్వీనర్‌ ఎంవీ కృష్ణారెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎమ్మెల్యేలు ఇలా చేస్తే ఎలా.. సీఎం చంద్రబాబు ఫైర్

టీటీడీపై వైసీపీ బురద జల్లుతోంది.. జ్యోతుల నెహ్రూ ధ్వజం

Read Latest AP News and National News

Updated Date - Aug 21 , 2025 | 08:47 PM