New Year Celebrations: న్యూ ఇయర్.. మందుబాబులకు ఇక డబుల్ కిక్కే..
ABN , Publish Date - Dec 29 , 2025 | 08:03 PM
నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్లను దృష్టిలో ఉంచుకుని మద్యం దుకాణాలు, బార్ల కార్యకలాపాల వేళలను పొడిగిస్తూ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
అమరావతి, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): నూతన సంవత్సర వేడుకల (New Year Celebrations) నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్లను దృష్టిలో ఉంచుకుని మద్యం దుకాణాలు, బార్ల కార్యకలాపాల వేళలను పొడిగిస్తూ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయం ప్రకారం డిసెంబర్ 31, జనవరి 1వ తేదీల్లో అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం విక్రయాలకు అనుమతి ఇచ్చింది. ఈ వెసులుబాటు బార్లు, ఇన్-హౌస్ లైసెన్సులు, ఈవెంట్ పర్మిట్ లైసెన్సులకు కూడా వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
అదేవిధంగా, ఏపీ టూరిజం ఆధ్వర్యంలో ఉన్న లైసెన్సులకు కూడా ఈ సమయాన్ని వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ లైసెన్సుల కింద పనిచేసే యూనిట్లకు డిసెంబర్ 31, జనవరి1 తేదీల్లో రాత్రి 1గంట వరకు మద్యం విక్రయాలకు అనుమతి ఇచ్చినట్లు వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా మెమోను జారీ చేసింది. ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ పియూష్ కుమార్ ఈ నిర్ణయానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. నూతన సంవత్సర వేడుకల సమయంలో పర్యాటకులు, ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఏపీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే, మద్యం షాపుల వేళలు పొడిగించినప్పటికీ చట్టం, శాంతిభద్రతలు, ట్రాఫిక్ నియమాలు కచ్చితంగా పాటించాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. పోలీస్ శాఖ సమన్వయంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పర్యవేక్షణ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. న్యూ ఇయర్ వేడుకలను సురక్షితంగా, నియమ నిబద్ధతతో జరుపుకోవాలని ప్రభుత్వం ప్రజలకు సూచించింది.
ఇవి కూడా చదవండి...
రాయచోటి జిల్లా అంశంపై సుదీర్ఘ చర్చ.. అభివృద్ధి బాధ్యత నాదే..
ఏపీ కేబినెట్‌లో 24 అంశాలపై చర్చ.. జిల్లాల పునర్వవస్థీకరణకు గ్రీన్ సిగ్నల్
Read Latest AP News And Telugu News