AP News: అన్నదాతల్లో అయోమయం.. లబ్ధిదారుల్లో వ్యత్యాసం..
ABN , Publish Date - Aug 06 , 2025 | 03:38 PM
అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల్లో.. ఒక దానికి లబ్ధి చేకూరి, మరో పథకం వర్తించని రైతులు, రైతు సేవా కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కానీ, వారి సందేహాలను నివృత్తి చేసే వారు కానరావడం లేదు. రెండు పథకాలకు ఒకే లబ్దిదారుల జాబితా లేదని అధికారులు చెప్పకనే చెబుతున్నారు.
పీఎం కిసాన్. అన్నదాత సుఖీభవ లబ్ధిదారుల్లో వ్యత్యాసం
రెండు పథకాలు.. లక్ష్యం రైతుకు పెట్టుబడి సాయం
కేంద్ర జాబితాలో ఉన్న లబ్ధిదారులు.. రాష్ట్ర జాబితాలో లేరు
రూ.5 వేలు పడిన వారికి రూ.2 వేలు పడలేదు..
రెండు పథకాల మధ్య 3 68.864 30 మంది రైతులు
అన్నదాత సుఖీభవ.. ఇది రాష్ట్ర ప్రభుత్వ పథకం.. పీఎం కిసాన్.. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం. రెండు పథకాల లక్ష్యం ఒక్కటే అన్నదాతకు పెట్టుబడి సాయం అందించడం. ఇంత వరకు బాగానే ఉంది. లబ్ధిదారుల ఎంపికలో రెండు పథకాలకు పొంతన లేదు. ఒక పథకం జాబితాలో ఉన్న లబ్ధిదారులు.. మరో పథకం జాబితాలో లేరు. పీఎం కిసాన్ పథకం కింద రూ.2 వేలు నగదు జమ అయిన అన్ని ఖాతాలకు.. అన్నదాత సుఖీభవ సొమ్ము రూ.5 వేలు జమ కాలేదు. ఇదే పరిస్థితి అన్నదాత సుఖీభవ పథకం లబ్దిదారులది. పీఎం కిసాన్‌కు అర్హత ఉంటే.. సుఖీభవ పథకానికి ఎలా అనర్హులం అవుతామంటూ.. బాధితులు ప్రశ్నిస్తున్నారు. సుఖీభవ పొందిన తమకు.. పీఎం కిసాన్ ఎందుకివ్వరని సదరు రైతులు నిలదీస్తున్నారు. ఇలాంటి లబ్ధిదారులు వందల్లో ఉంటే ఎక్కడో పొరపాటు జరిగిందని భావించవచ్చు. ఈ సంఖ్య వేలల్లో ఉంది.
నరసరావుపేట: అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల్లో.. ఒక దానికి లబ్ధి చేకూరి, మరో పథకం వర్తించని రైతులు, రైతు సేవా కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కానీ, వారి సందేహాలను నివృత్తి చేసే వారు కానరావడం లేదు. రెండు పథకాలకు ఒకే లబ్దిదారుల జాబితా లేదని అధికారులు చెప్పకనే చెబుతున్నారు. పీఎం కిసాన్ పథకానికి 2019 వెబ్ ల్యాండ్ ప్రకారం లబ్ధిదారులను గుర్తించారని, సుఖీభవ పథకానికి 2005 జూన్ నాటి వెబ్ ల్యాండ్ ప్రకారం లబ్ధిదారుల ఎంపిక జరిగిందని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
ఈకేవైసీ మతలబు ఏమిటో?
ఈకేవైసీ కాలేదని, ఇంటి మ్యాపింగ్ జరగలేదని, 1బీ నమోదు కాలేదని తదితర అంశాలతో అర్హులైన రైతుల పేర్లను అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారుల జాబితా నుంచి అదికారులు తొలగించారు. ఇక్కడ తొలగించిన లబ్ధిదారులకు పీఎం కిసాన్ పథకం వర్తించింది. వీరి బ్యాంకు ఖాతాలకు రూ.2 వేలు జమ కావడం గమనార్హం. ఈకేవైసీ పీఎం కిసాన్ పథకానికి ఉంది. అయితే అక్కడ ఉన్న ఈకేవైసీ.. సుఖీభవకు ఎందుకు కాలేదు.? రెండు ఈకేవైసీలు ఒకటి కాదా అని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. మ్యాపింగ్ అయిన లబ్ధిదారులకు కూడా సుఖీభవ వర్తించలేదు. ఇలాంటి వారు కూడా వేలల్లోనే ఉన్నారు.
మూడు జిల్లాల్లో బాధితులు ఇలా..
పల్నాడు జిల్లాలో 37,681, బాపట్ల జిల్లాలో 17,241, గుంటూరు జిల్లాలో 13,942 మంది రైతులు పీఎం కిసా నన్ను కోల్పోయారు. మూడు జిల్లాల్లో 68,864 మంది రైతుల ఖాతాలకు అన్నదాత సుఖీభవ తొలి విడత నగదు రూ.5 వేలు జమ కాలేదు. అలాగే పీఎం కిసాన్ పథకం లబ్ధిపొందిన వారు కూడా.. సుఖీభవకు దూరమయ్యారు. కూటమి ప్రభుత్వం ఏటా రూ.20 వేలు పెట్టుబడి సాయం అందిస్తానని హామీ ఇచ్చింది. రెండు పథకాల జాబితాలను పరిశీలించి.. అర్హులకు రెండు పథకాల సొమ్ము ఇచ్చేలా చర్యలు తీసుకుంటేనే... ప్రభుత్వ హామీ నెరవేరుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఒక పార్టీని టార్గెట్ చేస్తారా.. ఎంపీపై సుప్రీం అసహనం, రూ.10 లక్షల జరిమానా
విమానాశ్రయాలకు ఉగ్రముప్పు.. హై అలర్ట్
For More National News And Telugu News